గర్భిణీ మహిళల  ఆరోగ్యపరిస్ధితిని తెలుసుకోవాలంటే గైనకాలజిస్టులు ఉండాల్సిందే!!
ఈ అడవిలో కనీస చదువు లేని ఒక గిరిజన యువకుడు ఆ పని చేస్తున్నాడు. ఏమిటీ,ఎందుకో తెలుసుకోవాలంటే,
తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అటవీ ప్రాంతం వైపు చూడాలి. 


ఇక్కడ చాలా గిరిజన సముదాయాలు అటవీ సంపదపై ఆధారపడి జీవిస్తున్నాయి. కొన్ని తెగలు ఇప్పటికీ పోడు వ్యవసాయం చేస్తున్నాయి. మరికొన్ని తెగలు స్థిర వ్యవసాయంపై ఆధారపడి బతుకుతున్నాయి. వీరిలో చాలామందికి ఒకట్రెండు ఎకరాలే ఉంటాయి. నీటిసదుపాయం లేక, సంప్రదాయ వ్యవసాయ పద్ధతులనే అనుసరించడం వల్ల వ్యవసాయం గిట్టుబాటు కాని పరిస్థితి. వీటికితోడు అటవీ చట్టాల కారణంగా గిరిజనులు అనాదిగా తమకున్న జీవనోపాధి వసతులను కోల్పోయే పరిస్థితి ఏర్పడుతోంది. ఆదివాసీలకు అడవిపైనా, అటవీ ఉత్పత్తులపైనా సహజమైన హక్కుందని ఐక్యరాజ్యపమితి కూడా చెబుతోంది. కానీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన అటవీ చట్టాల వల్ల, వారు తమ సహజహక్కును కోల్పోవాల్సి వస్తోంది.


 ఇప్పటి వరకు అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం 3 శాతం గిరిజనులు మాత్రమే పరిశ్రమల రంగాల్లో పనిచేస్తున్నారు. 5 శాతం వరకు సేవారంగంలో పనిచేస్తున్నారు. మిగిలిన వారంతా వ్యవసాయం లేదా అటవీ ఉత్పత్తుల సేకరణ మీద ఆధారపడి జీవిస్తున్నారు. దీనివల్ల వారెంత వెనకబడి ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. గిరిజనులను వేధించే అతి ముఖ్యమైన సమస్యలు సామాజికమైనవి. అటవీ ప్రాంతాల్లోని గిరిజనుల్లో నిరక్షరాస్యత రేటు చాలా ఎక్కువగా ఉంది. విద్య లేకపోవడం వల్ల వారు ఆరోగ్య పరమైన అవగాహన ఉండటం లేదు. జన జీవన స్రవంతిలో కలవడం లేదు. నిరక్షరాస్యతతో పాటు ఉన్న మరో సమస్య బాల్య వివాహాలు. చాలా గిరిజన సమూహాల్లో ఇప్పటికీ ఈ సమస్య కనిపిస్తుంది. దీనికి తోడు, మంత్రాలు, తంత్రాలు, చేతబడులు, జంతు బలులు వంటి మూఢ విశ్వాసాల నుండి వారింకా బయట పడలేదు. 


రిజర్వ్‌ ఫారెస్ట్‌ గిరిజన ప్రాంతాల్లో పాఠశాలలు, ఆరోగ్యకేంద్రాలు ఏర్పాటు చేయడానికి ప్రభుత్వానికి అవకాశం లేక, వారు అక్కడి నుండి మైదాన ప్రాంతాలకు రావడానికి ఇష్టపడక పోవడంతో అసలు సమస్యలు మొదలవుతున్నాయి. అలా విద్యాపరంగా వెనకబాటుతనం కొనసాగుతుండటంతో పాటు, ఆరోగ్య సమస్యలూ వారిని చుట్టుముట్టే ఉంటాయి. ఆరోగ్య సంరక్షణకు సంబంధించిన పరిజ్ఞానం లేకపోవడం, వసతుల లేమి వల్ల మరణాల రేటు ఎక్కువ. జీవనకాలం తక్కువ. తల్లి, శిశు మరణాల రేటు కూడా ఎక్కువ. జాతీయ సగటు కంటే ఇది ఎక్కువగా ఉంది. పౌష్టికాహార లోపం ఎక్కువ. ఈ నేపథ్యంలో పాల్వంచ,అర్లపల్లి, లక్ష్మిదేవిపల్లి మండలాల్లోని మారుమూల అటవీప్రాంతంలో గిరిజనుల జీవన స్థితిగతుల గురించి తెలుసుకొని, రెండేళ్ల క్రితం వారి మధ్యకు వచ్చాడు డాక్టర్‌ నరేందర్‌.


ఒక కొత్త పరిష్కారం
వైద్యులు అందుబాటులో లేని ఈ ప్రాంతంలోని పది గ్రామాలకు చెందిన పదిమంది గిరజన యువకులకు శిక్షణ ఇచ్చి, ఆరోగ్య సేవకులుగా నరేందర్‌ తీర్చిదిద్దారు. కడుపులో శిశువు గుండె చప్పుడును Fetal Doppler తో కనిపెట్టి, ప్రమాదం ఉంటే , ఆసుపత్రికి తీసుకెళ్తున్నారు. దీని వల్ల గర్భిణీ మహిళలు ఆరోగ్యపరిస్ధితి ఎప్పటికపుడు తెలుసుకోవడానికి అవకాశం కలుగుతుంది. ప్రతీ సమస్యకు ఒక పరిష్కారం ఉంటుంది. ప్రభుత్వమే అన్నీ చేస్తుందని ఎదురు చూడకుండా తమ సమస్యను తామే పరిష్కరించుకునే దిశగా అడుగులు వేస్తున్న గిరిజనుల జీవన చిత్రం ఇది. 


మరింత సమాచారం తెలుసుకోండి: