తెలంగాణ‌లోని ఉద్యోగార్థుల‌కు తీపిక‌బురు. పాఠశాల విద్యాశాఖలో ఉపాధ్యాయ నియామక పరీక్ష (టీఆర్టీ-2017) ఎస్జీటీ పోస్టుల భర్తీ ప్రక్రియలో కీల‌క నిర్ణ‌యం వెలువ‌డింది. ఈ నెల 5వ తేదీ సోమవారం నుంచి భ‌ర్తీ ప్ర‌క్రియ‌ ప్రారంభించనున్నారు. అందుకు సంబంధించి పాఠశాల విద్యాశాఖ కమిషనర్ టీ విజయ్‌కుమార్ శుక్రవారం షెడ్యూల్ జారీచేశారు. హిందీ, కన్నడ, మరాఠీ, బెంగాలీ, ఉర్దూతోపాటు తమిళ భాషల్లో ఉన్న మొత్తం 306 మందికి పోస్టింగ్ ఆర్డర్లు ఇస్తారు. పోస్టింగ్ ఆర్డర్లు పొందినవారు మరుసటిరోజున సంబంధిత పాఠశాలల్లో రిపోర్టింగ్ చేయాలి. కౌన్సెలింగ్‌కు హాజరుకాని అభ్యర్థులకు రిజిస్టర్ పోస్టు ద్వారా పోస్టింగ్ ఆర్డర్లు పంపించాలని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఆదేశించారు.


5వ తేదీన షెడ్యూల్ ప్రకారం జిల్లాల వారీగా పోస్టులు గుర్తించి, వాటిని నోటీసు బోర్డు, జిల్లా వెబ్‌సైట్‌లో పెట్టాలి. ఈ నెల 6న ఖాళీలకు సంబంధించి జిల్లాస్థాయి కమిటీతో సమావేశం ఏర్పాటుచేసి చర్చించి నిర్ణయం తీసుకోవాలి. అదేరోజు నోటీసు బోర్డులలో క్యాటగిరీవారీగా పోస్టుల వివరాలు పెట్టాలి.ఎంపికైన వారికి 8వ తేదీన కౌన్సెలింగ్ నిర్వహించి పోస్టింగ్ ఆర్డర్లు జారీచేయాలి.
2017లో 8,792 ఉపాధ్యాయ ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ అయింది. అయితే, కొత్త జిల్లాల ప్ర‌కారం నోటిఫికేష‌న్ ఇచ్చారని ప‌లువురు హైకోర్టును ఆశ్ర‌యించారు. దీంతో పాత 10 జిల్లాల వారీగా నోటిఫికేష‌న్ ఇచ్చారు. అనంత‌రం టీచర్ పోస్టులను పాత ప‌ది జిల్లాల ప్ర‌కారం పేర్కొంటూ టీఎస్‌పీఎస్సీ నోటిఫికేష‌న్ జారీ చేసింది. అయితే సుదీర్ఘంగా ఈ నియామ‌క ప్ర‌క్రియ సాగ‌డంతో...గ‌త నెల‌లో అభ్య‌ర్థులు ఆందోళ‌న చేశారు. త‌మకు వెంటనే నియామక పత్రాలను అందజేయాలంటూ  టీఆర్టీలో సెలెక్ట్‌ అయిన అభ్యర్థులు గొంతెత్తారు. కొలువుకు ఎంపికై ఎనిమిది నెలలు గడిచినా తమకు నియామకపత్రాలు ఇవ్వడం లేదని నిరసిస్తూ ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయమైన ప్రగతిభవన్‌ను ముట్టడించే ప్ర‌య‌త్నం చేయ‌గా పోలీసులు వారి ప్రయత్నాలను అడ్డుకున్నారు. తాజా ఎట్ట‌కేల‌కు వారికి నియామ‌క ప‌త్రాలు అందిస్తున్నారు.

 


మరింత సమాచారం తెలుసుకోండి: