కేంద్రంలో అధికారంలో  ఉన్నది మోడీ సర్కార్. చంద్రబాబు మూడు నెలల క్రితం వరకూ మోడీని, బీజేపీని తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టారు. అటువంటి కేంద్ర ప్రభుత్వంలోని ఒక మంత్రి గారి మాటలు వింటే టీడీపీకి పూనకం వస్తోందట. ఆయన వేస్తున్న సెటైర్లు చూసి తమ్ముళ్ళు సంబరపడుతున్నారుట. కాషాయ మంత్రి  టీడీపీకి  అంత మంచిగా ఎలా అయ్యారో అర్ధం కాదు కానీ ఆయన మాత్రం జంకూ గొంకూ లేకుండా మాట్లాడేస్తున్నారు. ఏపీ విషయంలో ఆయన ఇస్తున్న ప్రకటనలు ఇపుడు టీడీపీకి వీనుల విందుగా ఉన్నాయట.


ఇంతకీ ఆ కేంద్ర మంత్రి చూస్తున్న శాఖ జలవనరుల శాఖ. ఆయన గారి పేరు గజేంద్ర సింగ్ షెకావత్. ఆయన ఇంతకు ముందు కూడా పోలవరం ప్రాజెక్ట్ లో ఎటువంటి అవినీతి లేదంటూ టీడీపీ కి అనుకూలంగా స్టేట్మెంట్ ఇచ్చారు. అపుడు తాము విన్నది తప్పేమో అనుకున్న వారికి తాజాగా మరో మారు పోలవరంపై  కేంద్ర మంత్రి మాట్లాడి కళ్ళు తెరిపించారు. ఆయన పార్లమెంట్ లో మాట్లాడుతూంటే టీడీపీ మంత్రి అచ్చంగా మాట్లాడినట్లుగానే ఉంది.


ఇంతకీ కేంద్ర మంత్రి గారు ఏమన్నారంటే పోలవరం ప్రాజెక్ట్ ఎపుడు పూర్తవుతుందో తనకు తెలియదని. అదేంటి పోలవరం జాతీయ ప్రాజెక్ట్ కదా అని విస్తుపోవాల్సిన పని లేదు. పోలవరం నిర్మాణం బాధ్యతలు మొత్తం ఏపీ ప్రభుత్వమే చూసుకోవాలని కూడా కేంద్ర మంత్రి గారు  సెలవిచ్చారు. పోలవరం విషయంలో ఏపీ సర్కార్ విధానాలను కూడా కేంద్ర మంత్రి పరోక్షంగా తప్పుపట్టడమే ఇక్కడ అసలైన విషయం.
పోలవరం నిర్మాణ పనుల నుంచి  నవయుగ కాంట్రాక్ట్ ను  జగన్ సర్కార్ రద్దు చేయడం పట్ల కేంద్ర మంత్రి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఇలా జరగకూడదని కూడా ఆయన వాపోయారు. మళ్ళీ రీ  టెండరింగ్ కి పిలిస్తే పెద్ద ఎత్తున  సమయం, డబ్బూ కూడా వ్రుధా అవుతాయని గజెంద్ర సింగ్ షెకావత్ అన్నారు.


పోలవరం వంటి ప్రాజెక్ట్ వ్యయం సమయం పెరగడం వల్ల ఎపుడు పూర్తి చేస్తారన్నది ఇపుడు చెప్పలేని పరిస్థితి ఉందని కూడా ఆయన అన్నారు.  అయినా పోలవరం గురించి కేంద్రాన్ని పదే పదే  అడగకూడదని, అది రాష్ట్ర ప్రభుత్వం నిర్మించాల్సిన ప్రాజెక్ట్ అంటూ ఆయన మాట్లాడడం బట్టి చూస్తే ఆయన కాషాయ ధారా పసుపు తమ్ముడా అన్నది అర్ధం కాని స్థితి. ఏది ఏమైనా పోలవరం విషయంలో మాత్రం కేంద్ర మంత్రి కామెంట్స్ వైసీపీ సర్కార్ కి షాకింగ్ లాంటివే. పోలవరం  విషయంలో చంద్రబాబు చేసిన కామెంట్స్ కి బీజేపీ మంత్రి గారి మాటలకు పెద్ద తేడా ఏమీ లేదుగా. కాపీ అండ్ పేస్ట్ అంతే. 


మరింత సమాచారం తెలుసుకోండి: