పోలవరం నిర్మాణంపై వైసీపీ ఓ ప్రత్యేకమైన స్టాండ్ తీసుకుంది. ఎట్టిపరిస్థితుల్లోనూ పాత టెండర్లలోని అక్రమాలు, అవినీతిని బయటపెట్టి.. రివర్స్ టెండర్ల ద్వారా నిర్మాణాన్ని పూర్తి చేయాలని జగన్ సర్కారు భావిస్తోంది. ఇందువల్ల ప్రాజక్టు నిర్మాణం కాస్త ఆలస్యమైనా ఫరవాలేదన్న రీతిలో జగన్ సర్కారు ముందుకు వెళ్తోంది.


అయితే ఇలా జగన్ రివర్స్ టెండరింగ్ కు వెళ్తామనడం.. కేంద్రంలోని పెద్దలకు ఇష్టం లేనట్టు కనిపిస్త్తోంది. ఈ మేరకు సంకేతాలు ఓ కేంద్ర మంత్రి ద్వారా వచ్చాయి. కేంద్రమంత్రి షెఖావత్ పార్లమెంటులో మాట్లాడుతూ.. ఏపీ ప్రభుత్వ నిర్ణయం పోలవరం నిర్మాణానికి అవరోధమని, మళ్లీ టెండర్లు పిలిచి పూర్తి చేయాలంటే ఎంత సమయం పడుతుందో చెప్పలేమని అన్నారు. రీ టెండర్ల వల్ల ఖర్చు పెరుగుతుందని, ఈ నష్టానికి వైకాపా ప్రభుత్వమే బాధ్యత వహించాలని’’ కేంద్రమంత్రి షెఖావత్ కామెంట్ చేశారు.


గతంలో చంద్రబాబు ప్రభుత్వం ఉన్నప్పడు పోలవరం విషయంలో చాలా హడావిడి జరిగేది. పనులు ఎంతవరకూ జరుగుతున్నాయో.. అంతకు మించి ప్రచార ఆర్భాటం జరిగేది. ప్రతి సోమవారం పోలవారం అంటూ చంద్రబాబు సమీక్ష నిర్వహించేవారు.. ఆ వివరాలన్నీ పత్రికల్లో పెద్ద పెద్ద బ్యానర్లో వార్తలుగా వచ్చేవి. పోలవరం ఆంధ్రుల సెంటిమెంట్ ఇష్యూ కూడా కావడంతో జనం పోలవరం గురించి ఆసక్తిగా మాట్లాడుకునే వారు.


దీనికితోడు చంద్రబాబు.. పోలవరానికి సంబంధించిన ప్రతి అంశాన్ని ఓ ఈవెంట్ లా నిర్వహించారు. ప్రాజెక్టు పూర్తి కాకముందే.. గ్యాలరీ వాక్ వంటి పేర్లతో ప్రతి కార్యక్రమాన్ని పబ్లిసిటీ చేసుకునేవారు. ఇప్పుడు జగన్ అందుకు భిన్నంగా వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్రమంత్రి జగన్ సర్కారు తీరును తప్పుబడుతూ మాట్లాడటం.. వైసీపీ సర్కారును ఇబ్బంది పెట్టేదే.. ఇప్పటికే వైసీపీ- బీజేపీ సంబంధాలు అంతంత మాత్రంగా ఉంటున్న పరిస్థితుల్లో కేంద్రమంత్రి కామెంట్స్ వ్యవహారాన్ని ఎక్కడిదాకా తీసుకెళ్తాయో..?


మరింత సమాచారం తెలుసుకోండి: