తమది రైతుల ప్రభుత్వమని జగన్ చెప్పుకుంటున్నారు. ఆయన అధికారంలోకి రావడానికి రైతాంగం కూడా అతి పెద్ద కారణం. రైతులకు మేలు చేస్తామని చెప్పి వైసీపీ అనేక హామీలను ఇచ్చింది. జగన్ అధికారంలోకి వచ్చాక వాటి మీద చకచకా నిర్ణయాలు కూడా తీసుకుంటున్నారు. అదే సమయంలో రైతులకు భరోసాగా పధకాలు కూడా కొత్తవి ప్రవేశపెడుతున్నారు. ఇవన్నీ ఇలా ఉంటే రాజన్న రాజ్యంలో చల్లగా ఉన్న రైతులు జగన్ పాలనలో గందరగోళంలో పడుతున్నారా.


అంటే అవును అంటున్నారు  సీపీఐ రామక్రిష్ణ. ఆయన మీడియాతో మాట్లాడుతూ వైసీపీ సర్కార్ రైతులను అయోమయానికి గురి చేస్తోందని ఆరోపించారు. ఏపీలో రైతులకు భరోసా లేదని కూడా ఆయన కామెంట్స్ చేశారు. రైతుల ప్రభుత్వం అని చెప్పుకుంటున్న జగన్ వారి  కోసం ఏం చేస్తున్నారో చెప్పాలని కూడా ఆయన డిమాండ్ చేసారు. ఇక వైసీపీ సర్కార్ అధికారంలోకి వచ్చినా కూడా రైతుల ఆత్మహత్యకు ఎక్కడా ఆగలేదని ఆయన అన్నారు. గడచిన మూడు నెలలలోనూ రైతులు ఎంతో మంది ఆత్మహత్యలకు పాల్పడ్డారని ఆయన అన్నారు. 


రైతులకు మేలు చేస్తామని చెప్పిన కొత్త పాలకులకు ఈ ఆత్మహత్యలు కనిపించడం లేదా అని ఆయన ప్రశ్నించారు.  ఇక చంద్రబాబు రుణ మాఫీ విషయంలో నాలుగు, అయిదు విడతలు బకాయి పెట్టి దిగిపోయాడని రామక్రిష్ణ విమర్సించారు. కొత్త ప్రభుత్వం తమకు ఆ బకాయిలకు అసలు సంబంధం లేదని అంటోందని ఆయన అన్నారు. ఈ విషయంలో బాకీలు తీరక బ్యాంకులు రుణాలు ఇవ్వక రైతులు నానా అవస్థలు పడుతున్నారని ఆయన అన్నారు.


రైతుల విషయంలో సరైన విధానాలను వైసీపీ ప్రభుత్వం తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. రైతుల పక్షాన నిలబడి తాము పోరాడుతామని కూడా ఆయన చెప్పారు. మొత్తానికి జగన్ రైతు సర్కార్ మాది అంటే కాదు అంటున్నారు కమ్యూనిస్టులు. చూడాలి మరి ఈ ఆరోపణలకు వైసీపీ సర్కార్ ఏం జవాబు చెబుతుందో.


మరింత సమాచారం తెలుసుకోండి: