తెలంగాణలో అధికార పార్టీ తెరాసకి మిత్ర పక్షంగా ఉన్న MIM అధినేత అసదుద్దీన్ ఓవైసీ సోదరుడు చంద్రాయణ గుట్ట ఎమ్మెల్యే అయిన అక్బరుద్దీన్ పై పోలీస్ కేసు నమోదైంది. జూన్ 23 న కరీంనగర్ లో జరిగిన మీటింగ్ లో అక్బరుద్దీన్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఆయన మాట్లాడిన తీరు రాజ్యాంగానికి విరుద్ధంగా లౌకిక వాదానికి వ్యతిరేకంగా ఉండి, మత ఘర్షణలకి తావునిచ్చేలా ఉందని ఆరోపిస్తూ కరీంనగర్ బిజెపి ప్రెసిడెంట్ కంప్లైంట్ చేసాడు.


అయితే అక్బరుద్దీన్ పై ఎలాంటి కేసు ఫైల్ చేయలేదు. అదీ గాక అక్బరుద్దీన్ మాట్లాడిన దాంట్లో అటువంటి అంశాలే లేవని పోలీస్ కమీషనర్ కమల్ హాసర్ రెడ్డి అతనికి క్లీన్ చిట్ ఇచ్చాడు. ఇక్కడితో ఈ మ్యాటర్ క్లోజ్ అయిందనే అనుకున్నారు. కానీ కరీంనగర్ సిటీ బిజెపి ప్రెసిడెంట్ మహేందర్ రెడ్డి అక్బరుద్దీన్ మీటింగ్ తాలూకు వీడియో క్లిప్పింగులను సబ్మిట్ చేసి పిటిషన్ వేశాడు. వీడియో క్లిప్పింగిల్లో ఉన్న ప్రకారం అక్బరుద్దీన్ మాటలు మత సామరస్యాన్ని దెబ్బ తీసే విధంగా ఉన్నాయని, ఇలాంటివి మత ఘర్షణలకు దారి తీస్తాయని ఆరోపించాడు.


కోర్ట్ ఆర్డర్ ప్రకారం పోలీసులు అక్బరుద్దీన్ పై సెక్షన్ 153-A( ఒక మతంపై దాడి చేసినందుకు), 153- B( దేశ సమగ్రతకు హాని కలిగించినందుకు), 506( ఒక వర్గం వారిని బెదిరింపులకు గురి చేసినందుకు) కేసు బుక్ చేసారు.  అక్బరుద్దీన్ స్పీచ్ ఒక వర్గం వారిని టార్గెట్ చేసినట్లుగా ఉందని, దానివల్ల ఇరు వర్గాల మధ్య గొడవలు చెలరేగే అవకాశం కనిపిస్తుందని, అలాగే ఒక మతాన్ని ఫాలో అయ్యే వారిపై బెదిరింపు దాడులకు పాల్పడుతున్నట్లుగా మాట్లాడాడని  పిటీషన్ వేసాడని కోర్ట్ తెలిపింది. అక్బరుద్దీన్ కి ఇలాంటి కేసులు కొత్తేం కాదు. గతంలో నిర్మల్ లో జరిగిన మీటింగ్ లో ఆయన మాట్లాడిన మాటలు ఎంత వివాదాస్పదం అయ్యాయో అందరికీ తెలిసిందే.


మరింత సమాచారం తెలుసుకోండి: