రాజకీయాలు, సినిమాలు.. సెంటిమెంట్లు..వీటిని విడదీయలేమంటుంటారు... అలాంటి ఓ సెంటిమెంట్లలో వైఎస్ కుటుంబంపై చాలా సెంటిమెంట్లు ఉన్నాయి. ప్రత్యేకించి వైఎస్సార్ సీఎం అయిన కాలంలో వర్షాలు బాగా కురిశాయని.. పంటలు బాగా పండాయని.. రాష్ట్రం సుభిక్షంగా ఉందని వైసీపీ నేతలు చెప్పుకుంటుంటూ ఉంటారు. గతంలో చంద్రబాబు పాలనలో సుదీర్ఘమైన కరువును అనుభవించడం రాష్ట్రప్రజలకు తెలిసిన విషయమే.


మళ్లీ ఇప్పుడు జోరుగా వానలు కురుస్తున్నాయని.. ఇదంతా వరుణ దేవుడికి వైఎస్ కుటుంబంపై ఉన్న ప్రేమే అంటున్నారు వైసీపీ నాయకులు. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు నాగిరెడ్డి ఏమంటున్నారంటే...


“ వైయస్‌ఆర్‌ ముఖ్యమంత్రిగా ఉన్నంత వరకు సకాలంలో వర్షాలు కురిశాయి.. రైతులు సంతోషంగా ఉన్నారు. చంద్రబాబు ఐదు సంవత్సరాల పాలనలో కరువు తాండవం చేసింది. మహానేత తనయుడు వైయస్‌ జగన్‌ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన తరువాత ఆల్మట్టీ నుంచి 2.30 లక్షల క్యూసెక్కుల నీరు ఇవాళ బయటకు వస్తున్నాయి. “


“ గత ఐదేళ్లలోఆల్మట్టీ నుంచి ఎంత నీరు బయటకు వచ్చిందో చంద్రబాబు సమాధానం చెప్పాలి. ప్రకృతి విధ్వంసకులు పాలకులుగా ఉంటే ఏ విధంగా ఉంటుందో.. చంద్రబాబు గత ఐదేళ్ల పాలన తెలిసిపోతుంది. ఒక మీటింగ్‌లో వరుణదేవుడికి మేము అంటే ప్రేమ అని గతంలో వైయస్‌ఆర్‌ చెప్పారు. అన్నట్లుగా చరిత్ర పునరావృతం అవుతుంది. ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ పాలనలో వర్షాలు కురుస్తున్నాయి. రైతులు సంతోషంగా ఉంటారు.. అని నాగిరెడ్డి చెప్పారు.


అందుకే రైతుల కోసం.. వైఎస్ జగన్ ఆలోచిస్తున్నారని.. పోలవరం ప్రాజెక్టును ప్రయారిటీగా తీసుకుని పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తున్నారని వైసీపీ నేత నాగిరెడ్డి చెబుతున్నారు. 1999-2004లో చంద్రబాబు తొమ్మిదేళ్ల పాలనలో కలగా ఉన్న పోలవరం వైయస్‌ఆర్‌ పాలనలో రూపుదిద్దుకుందని గుర్తు చేస్తున్నారు. పోలవరం ప్రాజెక్టు మొదలు పెట్టింది వైయస్‌ఆర్‌.. పూర్తి చేయబోతుంది ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌" అన్నారు నాగిరెడ్డి.


మరింత సమాచారం తెలుసుకోండి: