రేవంత్ రెడ్డి తెలంగాణా రాజకీయాల్లో చిచ్చర పిడుగుగా పేరు తెచ్చుకున్నారు.  గతంలో తెలుగుదేశం పార్టీలో ఉండగా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పైనా, అటు తెరాస పార్టీపైనా విరుచుకు పడ్డాడు.  తనదైన మాటలతో తెరాస పార్టీని ఇరుకున పెట్టడంలో దిట్టగా పేరు తెచ్చుకున్నారు.  అందుకే అదును చూసి ఆయన్ను నోటికి ఓటు కేసులో ఇరికించారు.  అక్కడి నుంచి రేవంత్ రెడ్డి పతనం ప్రారంభం అయ్యింది.  నోటుకు ఓటు కేసు తరువాత రేవంత్ రెడ్డి తెలుగుదేశంపార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు.  


కాంగ్రెస్ పార్టీలో చేరిన తరువాత కొడంగల్ నియోజక వర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు.  రేవంత్ రెడ్డిని ఎలాగైనా ఓడించాలనే కసితో తెరాస పార్టీ క్యాడర్ మొత్తం కొడంగల్ లోనే ఉండి పావులు కదిపింది.  ఒక్కడిని ఓడించడం కోసం తెరాస క్యాడర్ మొత్తం అక్కడే ఉండటం విశేషం.  పార్టీ ఓటమి తరువాత కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి కీలకంగా మారడం మొదలుపెట్టారు. ఆయనకు పార్టీ పదవిని ఇస్తుందని, తెరాస పార్టీని ఎదుర్కోవాలంటే రేవంత్ బెస్ట్ అని కాంగ్రెస్ పార్టీ భావించినట్టు అప్పట్లో వార్తలు వచ్చాయి.  


అయితే, అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీ 2019 పార్లమెంట్ ఎన్నికల్లో మల్కాజ్ గిరి నియోజక వర్గం నుంచి పోటీ చేసే అవకాశం ఇచ్చింది.  ఆ నియోజక వర్గం నుంచి రేవంత్ రెడ్డి విజయం సాధించారు.  దీంతో తెరాస పార్టీ ఒక్కసారిగా షాక్ అయ్యింది. తెలంగాణలోని 16 నియోజక వర్గాల్లో జెండా ఎగరేస్తామని చెప్పిన తెరాస పార్టీ కేవలం 9 చోట్ల మాత్రమే విజయం సాధించగలిగింది. రేవంత్ రెడ్డి పరపతి పెరిగింది.  అయితే, ఎంపీగా గెలిచిన తరువాత రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వదిలి బీజేపీలో జాయిన్ అవుతారని వార్తలు వచ్చాయి. 

ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదని తేలింది.  రేవంత్ రెడ్డికి ఇప్పుడు తెలంగాణ పీసీసీ పదవి ఇస్తారని వార్తలు వస్తున్నాయి.  రేవంత్ కి ఆ పదవి ఇస్తే వచ్చే ఎన్నికల నాటికి పార్టీని పటిష్టం చేస్తారని వార్తలు వస్తున్నాయి.  అయితే, రేవంత్ చిన్నవాడు.. పీసీసీ పదవిని హ్యాండిల్ చేసేంతటి అనుభవం లేదు.. కాబట్టి ఆ పదవిని సీనియర్లకు అప్పగించాలని కొందరి వాదన.  ప్రస్తుతం పీసీసీ పదవిలో ఉన్న ఉత్తమ్ ను తొలగించాలనే ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ ఉన్నది. ఈ పదవికోసం జీవన్ రెడ్డి కూడా పోటీ పడుతున్నారు.  ఒకవేళ రేవంత్ రెడ్డిని పక్కన పెడితే కాంగ్రెస్ పార్టీ ఇబ్బందుల్లో పడే అవకాశం ఉంటుంది.    


మరింత సమాచారం తెలుసుకోండి: