జగన్మోహన్ రెడ్డిగారు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసి రెండు నెలలు పూర్తయింది. ఈ రెండు నెలల్లో సీఎం జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మీద ప్రజల్లో మిశ్రమ స్పందన వ్యక్తమవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయాలపై మెజారిటీ శాతం ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తుండగా తక్కువ శాతం ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పింఛన్లు పొందటానికి వయస్సును 65 సంవత్సరాల నుండి 60 సంవత్సరాలకు తగ్గించటం, పింఛన్ 2250 రుపాయలకు పెంచటం పట్ల ప్రజల్లో సంతృప్తి వ్యక్తం అవుతుంది. 
 
మద్యపాన నిషేధం అమలులో భాగంగా బెల్టుషాపులపై చర్యలు తీసుకోవటం, ప్రభుత్వమే మధ్యం షాపులు నిర్వహించబోతూ ఉండటం, దశల వారీగా మద్యపాన నిషేధం చేయటం పట్ల ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 2020 ఏప్రిల్ 1 నాటికి పేదలందరినీ గుర్తించి ఇళ్ళ పట్టాలు ఇవ్వాలనే నిర్ణయం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అమ్మఒడి పథకం ద్వారా పిల్లలను బడికి పంపే ప్రతి తల్లికి 15000 రుపాయలు ఇవ్వటం పట్ల కూడా ప్రజల్లో సంతృప్తి వ్యక్తమవుతుంది. 
 
 
గ్రామ సచివాలయాల్లో భారీగా ఉద్యోగాల భర్తీ చేయటం నిరుద్యోగులకు ఎంతో సంతోషాన్నిస్తుంది. కానీ గ్రామ వాలంటీర్ల నియామకం పట్ల మాత్రం నిరుద్యోగులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గ్రామాల్లో, మండలాల్లో గ్రామ వాలంటీర్ల నియామకంలో రాజకీయ జోక్యం ఎక్కువయిందని, వాలంటీర్ల నియామకంలో అవినీతి జరిగిందని గ్రామ వాలంటీర్ల ఉద్యోగాల కోసం ధరఖాస్తు చేసిన అభ్యర్థులు చెబుతున్నారు. 
 
డ్వాక్రా యానిమేటర్లకు, ఆశా వర్కర్లకు పెంచిన జీతాలు ఎప్పటినుండి అమలు అవుతాయనే విషయంలో సరైన సమాచారం లభించకపోవటంపై ఆశా వర్కర్లు, డ్వాక్రా యానిమేటర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.. అక్టోబర్ 15 నుండి అమలు చేయబోతున్న రైతు భరోసా పథకంలో 12,500 రుపాయలు రాష్ట్రం మాత్రమే ఇస్తుందా లేక కేంద్రం పీఎం కిసాన్ యోజన పథకం క్రింద రైతులకు ఇచ్చే 6000 రుపాయలతో కలిపి ఇస్తుందా అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. అన్న క్యాంటీన్లలో భోజన సరఫరా నిలిచిపోవటంపై కూడా ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 
 



మరింత సమాచారం తెలుసుకోండి: