రెండు రోజుల క్రితం హైదరాబాద్ లో కెసియార్-జగన్మోహన్ రెడ్డి మధ్య జరిగిన భేటీపై బిజెపిలో టెన్షన్ పెరిగిపోతున్నట్లే ఉంది. ఇజ్రాయల్ వెళ్ళేముందు ప్రగతి భవన్ కు వెళ్ళి కెసియార్ తో జగన్ సుదీర్ఘంగా భేటి జరిపారు. ఇద్దరు ముఖ్యమంత్రులు కలిస్తే కచ్చితంగా రాజకీయ చర్చలే జరిగుంటాయనటంలో సందేహమే లేదు. అందుకు బిజెపి నేతలు ఎందుకు గింజుకుపోతున్నారో అర్ధం కావటం లేదు ?

 

వచ్చే ఎన్నికల్లోగా తెలుగురాష్ట్రాల్లో తమ ఉనికిని గట్టిగా చాటుకోవటానికి బిజెపి వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. తెలంగాణాలో అయితే బిజెపి నేతలు చాలా దూకుడు మీదున్నారు. తొందరలోనే కెసియార్ ప్రభుత్వాన్ని కూల్చేస్తామన్నట్లుగా ప్రకటనలిస్తున్నారు. కూల్చగలరా లేదా అన్నది వేరే విషయం. మొన్నటి ఎన్నికల్లో ఎవరే ఊహించని విధంగా నాలుగు ఎంపి సీట్లలో గెలవటంతోనే బిజెపి నేతలు రెచ్చిపోతున్నారు.

 

అదే సమయంలో ఏపిలో బోర్లాపడింది బిజెపి. పోటి చేసిన 175 అసెంబ్లీ, 25 ఎంపి సీట్లలో ఎక్కడ కూడా కనీసం డిపాజిట్ కూడా దక్కించుకోలేకపోయింది. అలాంటి పార్టీ ఈమధ్యనే జగన్ టార్గెట్ గా రెచ్చిపోతోంది. మహిళా మోర్చా అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి కెసియార్-జగన్ స్నేహంపై రెచ్చిపోయి వ్యాఖ్యలు చేశారు. గోదావరి జలాలపై తెలంగాణా ప్రయోజనాలకు అనుగుణంగా జగన్ వ్యవహరిస్తున్నారంటూ మండిపడ్డారు.

 

ఇద్దరు సిఎంల భేటిలో బిజెపిని ఎదుర్కొనే విషయంపైనే ఎక్కువగా చర్చ జరిగిందని సమాచారం పొక్కటమే బిజెపి నేతలు రెచ్చిపోవటానికి కారణాలుగా అర్ధమవుతోంది. సిఎంలిద్దరిని టార్గెట్  చేసుకోవాలని బిజెపి ప్లాన్లు వేస్తున్నపుడు బిజెపిని ఎదుర్కొనేందుకు ఇద్దరు సిఎంలు కలవటంలో తప్పేముంది ? ఎవరి వ్యూహాలు వాళ్ళకుంటాయి కదా ?  చంద్రబాబునాయుడులా కెసియార్, జగన్ బలహీనులు కాదన్న విషయాన్ని బిజెపి నేతలు మరచిపోయినట్లున్నారు. పైగా రెండు ప్రభుత్వాల్లో అస్ధిరత కూడా ఏమీ లేదు. కాబట్టి వీళ్ళని దెబ్బకొట్టేందుకు బిజెపి ప్లాన్లు ఏమేరకు వర్కవుటవుతుందో చూడాల్సిందే ?

 


మరింత సమాచారం తెలుసుకోండి: