క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అందరికీ ఇదే అనుమానం వస్తోంది. పోలవరం ప్రాజెక్టు విషయంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వైఖరిపై కేంద్రం తాజా స్పందన చూస్తుంటే చంద్రబాబు అవినీతికి మద్దతు పలుకుతున్నట్లే అనుమానం వస్తోంది. ప్రాజెక్టు కాంట్రాక్టరుకు ప్రభుత్వం నోటిసులివ్వటాన్ని కేంద్ర మంత్రి జలశక్తి మంత్రి షెకావత్ తప్పుపట్టటమే విచిత్రంగా ఉంది. పోలవరం ప్రాజెక్టులో భారీ అవినీతి జరిగిందని ఎన్నికలకు ముందు స్వయంగా ప్రధానమంత్రి నరేంద్రమోడినే చెప్పిన విషయాన్ని మంత్రి పట్టించుకోవటం లేదు.  ఇక రాష్ట్రంలోని బిజెపి నేతల ఆరోపణలకైతే లెక్కేలేదు.

 

ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అవినీతిని నిర్ధారించటానికి, రివర్స్ టెండరింగ్ ద్వారా ప్రాజెక్టు ఖర్చును తగ్గించేందుకు నిపుణుల కమిటిని నియమించింది. కమిటి ప్రాధమిక అధ్యయనంలో ప్రాజెక్టు పనుల్లో భారీ అవినీతి జరిగిందని నిర్ధారించింది. అందులోను నవయుగ కంపెనీకి చంద్రబాబు సుమారు రూ. 3 వేల కోట్ల పనులను నామినేషన్ పై అప్పగించారు. నిజానికి నామినేషన్ పై పనులు అప్పగించటమే తప్పు.

 

అందుకనే జగన్ ప్రభుత్వం తాజాగా పనులను ఆపేయమంటూ నవయుగ కంపెనీకి నోటీసులిచ్చింది. కాంట్రాక్టర్లందరూ చంద్రబాబుకు సన్నిహితులే కావటంతో మొదటి నుండి కూడా జగన్ చర్యలను టిడిపి తప్పుపడుతోంది. ఇపుడు కేంద్రప్రభుత్వ వైఖరి కూడా చంద్రబాబుకు మద్దతుగానే ఉన్నట్లుంది. అంటే అవినీతి జరిగినా పర్వాలేదన్నట్లే ఉంది కేంద్రం వాదన. పైగా పోలవరం ప్రాజెక్టు ఎప్పుడు పూర్తవుతుందో తాము చెప్పలేమంటున్నారు కేంద్రమంత్రి.

 

 అధికారులు చెప్పినట్లుగా పోలవరం ప్రాజెక్టును 2021 జూలైకల్లా పూర్తి చేస్తామని జగన్ ప్రకటించిన విషయం కేంద్రం మరచిపోయినట్లుంది. అవినీతిని నియంత్రించమని, తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకోమని చెప్పాల్సిన కేంద్రమే జగన్ ను తప్పుపట్టడం విచిత్రంగా ఉంది. రివర్స్ టెండరింగ్ తో ప్రాజెక్టు వ్యయం తగ్గితే కేంద్రానికే మంచిది. అయినా సరే జగన్ చర్యలను కేంద్రమంత్రి తప్పు పడుతున్నారంటే పోలవరం కేంద్రంగా మళ్ళీ నరేంద్రమోడి-చంద్రబాబు ఒకటవుతున్నట్లే అనుమానంగా ఉంది.

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: