మాజీ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డికి తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ గుడ్ న్యూస్ చెప్పారు. శాసనసభ్యుల కోటాలో ఎమ్మెల్సీ స్థానానికి జరిగే ఎన్నికల్లో టిఆర్ఎస్ అభ్యర్థిగా మాజీ ఎంపి గుత్తా సుఖేందర్ రెడ్డి పేరును ముఖ్యమంత్రి కేసీఆర్ ఖరారు చేశారు. పార్టీ తరుఫున నామినేషన్ వేయాల్సిందిగా గుత్తాను సిఎంను కోరారు. ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రిని కలిసి గుత్తా కృతజ్ఞతలు తెలిపారు. నామినేషన్ల పత్రాల దాఖలు తదితర ప్రక్రియలను నిర్వహించడంలో సహకరించాలని ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డిని సిఎం ఆదేశించారు.


గుత్తా సుఖేంద‌ర్ రెడ్డి...కాంగ్రెస్ పార్టీ త‌ర‌ఫున 2014 న‌ల్ల‌గొండ ఎంపీగా గెలిచిన నేత‌. అప్పుడు రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థిగా ఉన్న టీఆర్ఎస్ అధినేత‌, తెలంగాణ సీఎం కేసీఆర్ పై ఓ రేంజ్‌లో నిప్పులు చెరిగారు. అంతేకాకుండా కేసీఆర్ ప్ర‌తిష్టాత్మ‌కంగా భ‌ర్తీ చేసిన పార్ల‌మెంట‌రీ సెక్ర‌ట‌రీ ప‌ద‌వులు రాజ్యాంగ విరుద్ద‌మంటూ ఆ ప‌ద‌వులు ఊడ‌బీకేయించే వ‌ర‌కు వ‌దిలిపెట్ట‌లేదు. ఆ రేంజ్‌లో కేసీఆర్‌ను టార్గెట్ చేసిన గుత్తా సుఖేంద‌ర్ రెడ్డి హ‌ఠాత్తుగా ప్లేట్ ఫిరాయించేశారు. కాంగ్రెస్‌కు గుడ్ బై చెప్తూ కేసీఆర్ గూటికి చేరుకున్నారు. ఆయ‌న చేరిక స‌మ‌యంలో మంత్రి ప‌ద‌వి హామీ ద‌క్కింద‌నే చ‌ర్చ జ‌రిగింది. అయితే అది నెర‌వేర‌క‌పోవ‌డంతో కేసీఆర్ రైతు స‌మ‌న్వ‌య స‌మితి అధ్య‌క్షుడిగా నియ‌మించారు.


ఇటీవ‌ల జ‌రిగిన పార్లమెంటు ఎన్నిక‌ల స‌మ‌యంలో అభ్యర్థులను ప్రకటించిన టీఆర్‌ఎస్‌  అధినేత కేసీఆర్‌ 8 స్థానాల్లో సిట్టింగ్‌లకు మళ్లీ అవకాశమిచ్చారు. వివిధ వ‌ర్గాల‌ ప్రచారాన్ని నిజం చేస్తూ జితేందర్ రెడ్డి, సీతారాం నాయక్, గుత్తా సుఖేందర్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని పక్కనబెట్టిన కేసీఆర్.. వారి స్థానాల్లో కొత్తవారికి అవకాశమిచ్చారు. ఈ సంద‌ర్భంగా గుత్తా సుఖేంద‌ర్ రెడ్డికి ఎమ్మెల్సీ అవ‌కాశం క‌ల్పిస్తామ‌ని హామీ ఇచ్చారు. అయితే, ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీ స్థానానికి  జరుగుతున్న ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థిగా కుర్మయ్యగారి నవీన్ రావు పేరును సీఎం కేసీఆర్ ప్రకటించారు. ప్రస్తుతం ఒకే ఖాళీ ఉండడంతో నవీన్ రావుకు అవకాశం ఇచ్చినట్లు కేసీఆర్ చెప్పారు. త్వరలో జరగబోయే మూడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో గుత్తా సుఖేందర్ రెడ్డికి అవకాశం ఇస్తామని కేసీఆర్ ప్రకటించారు. అందులోనూ ఆయ‌న‌కు అవ‌కాశం ద‌క్క‌లేదు.


కాగా, తాజాగా జ‌రుగుతున్న ఎమ్మెల్సీ ఉప ఎన్నిక‌ల్లో బ‌రిలో దిగే అవ‌కాశం గుత్తా సుఖేంద‌ర్‌రెడ్డికి క‌ల్పించారు. పార్టీ ఫిరాయించిన యాద‌వ‌రెడ్డిపై అన‌ర్హ‌త వేటు ప‌డ‌టంతో ఉప ఎన్నిక‌లు జ‌రుగుతున్నాయి. ఈ స్థానంలో టీఆర్ఎస్ అభ్య‌ర్థిగా గుత్తా సుఖేందర్ రెడ్డికి చాన్సిచ్చారు కేసీఆర్‌. గెలుపు దాదాపు ఖాయ‌మైన నేప‌థ్యంలో...ఆయ‌న‌కు మంత్రి ప‌ద‌వి ద‌క్క‌నుంద‌ని ప‌లువురు అంచ‌నా వేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: