అదేమి మాట, కోట్లలో బిజినెస్‌ చేసే వారు విదేశాలకు వెళ్లకూడదా...?   
అనేక వ్యాపార లావాదేవీలున్న నిమ్మగడ్డ ప్రసాద్‌ లాంటి వారు నిరంతరం విదేశాలు చుట్టి వస్తుంటారు అని సరిపెట్టుకుందామంటే అక్కడ ఆయన అనూహ్యంగా అరెస్టు అయి, అతి కష్టంమీద, షరతులతో, విడుదలయ్యారు. బ్రిటన్‌, సింగపూర్‌తో సహా పలు దేశాల్లో నిమ్మగడ్డ తిరిగినా పట్టించుకోకుండా, సెర్బియా లో ఎందుకు అరెస్ట్‌ చేశారు ? ఈ నేపథ్యంలో ఆయన అసలు సెర్బియా ఎందుకు వెళ్లారు..? అనే విషయం ఇపుడు మీడియా,రాజకీయ వర్గాల్లో హాట్‌ టాపిక్‌ గా మారింది.


ఒక ప్రముఖ పత్రిక కథనం ప్రకారం... '' వాన్‌పిక్‌ వ్యవహారంలో లాభాలు ఆర్జించడానికి, నిధులు తరలించడానికి  ఉద్దేశ పూర్వకంగా నష్టం కలిగించారనే ఆరోపణలపై యూఏఈ ఫెడరల్‌ క్రిమినల్‌ కోడ్‌  ప్రకారం నిమ్మగడ్డ ప్రసాద్‌పై కేసు నమోదైంది. ఆ కేసులో నిందితుడిని తమకు అప్పగించాలన్న రస్‌ ఆల్‌ ఖైమా(రాక్‌) దేశ అభ్యర్థన మేరకు అబుదాబిలోని ఇంటర్‌ పోల్‌ 2016 సెప్టెంబరు 5న రెడ్‌ కార్నర్‌ నోటీసు జారీ చేసింది. అలా సెర్బియా వెళ్లినపుడు అకస్మాత్తుగా అక్కడి పోలీసులు జులై 27న ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు. 


అనంతరం బెల్‌గ్రేడ్‌లోని ఉన్నత న్యాయస్థానంలో హాజరుపరిచారు. సదరు నిర్బంధాన్ని కోర్టు అనుమతించింది. సెర్బియా పోలీసుల నిర్బంధంలో ఉన్న నిమ్మగడ్డ ప్రసాద్‌ నిన్న జైలు నుంచి విడుదలయ్యారు. సెర్బియాలోని బెల్‌గ్రేడ్‌ జైలు నుంచి విడుదలైన ఆయనకు అక్కడి న్యాయస్థానం, బెల్‌గ్రేడ్‌ విడిచి వెళ్లరాదనే షరతు  విధించింది .''  



సీబీఐ కోర్టుకు సమాచారం '' బెయిలు షరతుల ప్రకారం సీబీఐ కోర్టు, సీబీఐకి పర్యటన సమాచారం ఇచ్చి యూరోప్‌ వెళ్లానని, సెర్బియా పోలీసులు అరెస్ట్‌ చేయడంతో కోర్టుకు రాలేకపోయానని, సెర్బియా పోలీసులు నిర్బంధించడంతో ముందస్తుగా ఇచ్చిన సమాచారం మేరకు హైదరాబాద్‌ తిరిగి రాలేకపోతున్నానని నిమ్మగడ్డ ప్రసాద్‌ శుక్రవారం సీబీఐ కోర్టుకు నివేదించారు.



పరిస్ధితులు ఇలా ఉండగా,  అసలు నిమ్మగడ్డ ,సెర్బియా గడ్డ మీదకు వెళ్లి ఎందుకు ఇరుక్కు పోయాడని, ఒక స్పోర్ట్స్‌ జర్నలిస్టు దగ్గర ఆరా తీయగా ఆయన  చెప్పిన ఆసక్తికరమైన విషయం ఏమిటంటే...  '' నిమ్మగడ్డ సెర్బియాకు వెళ్లింది విహారయాత్రకు కాదు, ఫుట్‌బాల్‌ క్రీడాకారుల గురించి అక్కడి క్రీడా మంత్రితో మాట్లాడటానికి ...'' అని చెప్పాడు. 


నిమ్మగడ్డకు కొందరు తెలుగు ప్రముఖులతో కలిసి స్టోర్ట్స్‌ పార్టనర్‌ షిప్‌ ఉంది. సెర్బియా ఫుట్‌ బాల్‌ ఆటకు ఫేమస్‌. టాప్‌ ర్యాంకుల్లో ఉంటుంది. సెర్బియా క్రీడాకారులను తీసుకొచ్చి కేరళ బ్లాస్టర్స్‌ తరఫున ఆడించాలనే ఆలోచనతో ఆ దేశానికి బిజినెస్‌ పని మీద వెళ్లి బుక్‌ అయి పోయాడట.  దీనికి సంబంధించిన మరి కొన్ని వాస్తవాలు త్వరలో వెలుగు చూడబోతున్నాయని బిజినెస్‌ సర్కిల్లో టాక్‌ !!



మరింత సమాచారం తెలుసుకోండి: