రాజకీయాల్లో ఉన్న వారి పరిస్థితి ఎలా తయారైందంటే.. తాటి చెట్టుకింద కూర్చుని పాలుతాగినా నమ్మే పరిస్థితి లేదు. దీంతో నాయకుల్లో ఎంత నిజాయితీ ఉన్నప్పటికీ.. పెద్దగా వెలుగు చూడడం లేదు. పైగా పైస్థాయిలో నిజాయితీగా పనిచేసే నాయకులు ఉన్నప్పటికీ.. కింది స్థాయిలో చేతులు చాచే వారు ఉండడంతో నేతలపైనే ఎక్కువగా ప్రభావం పడుతోంది. గతంలోను, ఇప్పుడు కూడా రాష్ట్ర రాజకీయాల్లో పరిస్థితి ఇదే. 


దీనిని కొంత వరెకైనా తగ్గించేందుకు తాజాగా వైసీపీ మహిళా ఎమ్మెల్యే తీసుకుని, ఆచరణలో పెట్టిన ఓ విషయం సంచలనం సృష్టించడమే కాకుండా అందరి ప్రశంసలూ పొందుతోంది. విషయంలోకి వెళ్తే అనంతపురం జిల్లా శింగనమల ఎమ్మెల్యేగా ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైసీపీ నాయకురాలు,  ఎస్సీ వర్గానికి చెందిన జొన్నలగడ్డ పద్మావతి విజయం సాధించారు. వాస్తవానికి ఎస్సీ కోటాలో ముఖ్యంగా సీమ ప్రాంతానికి సంబంధించి జగన్‌ కేబినెట్‌లో బెర్త్‌ లభిస్తుందని అనుకున్నారు. 


అయితే, కొన్ని సమీకరణల నేపథ్యంలో ఇది సాధ్యంకాలేదు. ఈ నేపథ్యంలోనే వచ్చే రెండున్నరేళ్ల తర్వాత అయినా జగన్‌ కేబినెట్‌లో చోటు దక్కుతుందనే ఆశతో జగన్‌ మనసు మెప్పించేందుకు పద్మావతి తన నియోజకవర్గంలో వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆమె తన నియోజకవర్గంలో అవినీతికి పాల్పడే అవకాశం లేకుండా తన పేరుకు భంగం కలగకుండా సోషల్‌ మీడియాను వాడుతున్నారు. 


ప్రభుత్వ కార్యాలయాల్లో పనుల కోసం వచ్చే వారు ఏ చిన్న పనికైనా సరే ఒక్క రూపాయి కూడా లంచాల రూపంలో ఎవరికీ సమర్పించాల్సిన అవసరం లేదని పేర్కొంటూ.. సోషల్‌ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. దీనికి సంబంధించి ఆమె తన ఫోన్‌ నెంబర్‌ను కూడా ఇస్తున్నారు. ఎవరైనా అధికారులు, కింది స్థాయి సిబ్బంది కూడా ఒక్క రూపాయి లంచం కోరినా.. తనకు వెంటనే ఫోన్‌ చేసి చెప్పాలని ఆమె విజ్ఞప్తి చేశారు. 


అదే సమయంలో ఆమె పార్టీ కార్యకర్తలతోనూ ఇదే విషయాన్ని స్పష్టం చేశారని సమాచారం. తాను నిజాయితీగా పనిచేస్తానని, సీఎం జగన్‌ ఆశయాలను నిలబెట్టేందుకు ప్రతి ఒక్కరూ తనకు సహకరించాలని ఆమె వారికి విజ్ఞప్తి చేశారట. మొత్తంగా ఈ పరిణామం ఒక్క శింగనమల నియోజకవర్గంలోనే కాకుండా ప్రతి ఒక్కరినీ ఆలోచింప జేస్తుండడం గమనార్హం.


మరింత సమాచారం తెలుసుకోండి: