మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు వ్యవహారం ఎవరికీ అంతుపట్టడంలేదు. ఆయన వైఖరి ఏంటన్నది కూడా అంచనా వేయలేకపోతున్నారు. గంటా అంటేనే దూకుడు రాజకీయం. డైనమిక్ లీడర్ గా ఆయన చక్రం తిప్పారు. టీడీపీ అధికారంలో ఉన్నపుడు ముఖ్య నాయకులలో ఆయన ఒకరు. బలమైన క్యాస్ట్, అర్ధ బలంతో గంటా చాలా మందిని దాటుకుని ముందు వరసలోకి వచ్చేశారు. గంటా మాటకు కూడా చంద్రబాబు ఎంతో విలువ ఇచ్చేవారు. ఆయన వ్యూహాలు ఎత్తుగడలు కూడా చాలా సైలెంట్ గా  ఉంటాయి.


ఇపుడు చెప్పుకోవాల్సింది గంటా ప్రెజెంట్  సీన్ గురించి. ఆయన నెమ్మదిగా టీడీపీకి దూరం అవుతున్నారా అంటే సమాధానం అవుననే అనిపిస్తోంది. నిన్న విశాఖలో జరిగిన జిల్లా సమీక్ష సమావేశానికి గంటా డుమ్మా కొట్టారు. విశాఖ జిల్లా మొత్తం మీద ఒక్క సిటీలోనే నలుగురు ఎమ్మెల్యేలు గెలిచారు. వారిలో ముగ్గురు ఒక్కటిగా ఉంటున్నారు. యాక్టివ్ గా ఉంటున్నారు. వారితో గంటా మాత్రమే ఎక్కడా కలవడంలేదు. ఇక అసెంబ్లీలో ఎటూ పెదవి విప్పని గంటా ఇపుడు జిల్లా సమస్యలపైన జరిగిన అతి కీలకమైన సమావేశానికి కూడా గైర్ హాజర్ కావడంతో ఆయన తోవ వేరు అన్న భావన అందరిలో ఏర్పడింది. మిగిలిన ముగ్గురు ఎమ్మెల్యేలు వచ్చినా  గంటా రాకపోవ‌డమంటే అందులో ఏదో ఉందని అంతా అంటున్నారు.


గంటా ఏ పార్టీలో చేరుతారు అన్నదే ఇపుడు పెద్ద చర్చగా ఉంది. గంటా బీజేపీ అని కొందరు అంటూంటే వైసీపీ అని మరికొందరు అంటున్నారు. గంటా బీజేపీలో చేరితే అక్కడ మంచి పొజిషన్ కోరుకుంటారు. మరి ఇప్పటికే సుజనా చౌదరి వెళ్ళిపోయి హవా చలాయిస్తున్నారు. ఇంకోవైపు దగ్గుబాటి పురంధేశ్వరి ఉన్నారు. కాపు కోటాలో గంటా ఏపీ బీజేపీ ప్రెసిడెంట్ పదవి కోరుకున్నా అది ఇస్తారా అన్నది కూడా దౌటే. అయితే గంటా వంటి బిగ్ షాట్ వస్తే సముచితమైన ప్లేస్ మాత్రం బీజేపీలో ఉంటుందని అంటున్నారు.


ఇక గంటా ఇంకా డైలామాలోనే ఉన్నారని కూడా న్యూస్ వస్తోంది. ఏపీ బీజేపీలో చేరినా ఆ పార్టీ ఎంతవరకు పుంజుకుంటుందో తెలియని స్థితి ఉంది. అదే సమయంలో వైసీపీ బలంగా ఉంది. లక్ బాగుంటే మళ్ళీ టీడీపీ కూడా బలంగా తయారవచ్చు. ఈ రకమైన ఆలోచనలతోనే గంటా అటు ఇటు కాని మనసుతో ఉంటున్నారని అంటున్నారు. మొత్తం మీద చూసుకుంటే గంటా టీడీపీకి అంటీ ముట్టనట్లుగా ఉంటునంది మాత్రం నిజమని అంటున్నారు. పరిణామాలు కూడా అలాగే ఉన్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: