తెలంగాణ ముఖ్య‌మంత్రి, టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ మ‌రోమారు ఆఫీస‌ర్లు, ప్ర‌జాప్ర‌తినిధుల‌ను ఉద్దేశించి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. గ్రామ పంచాయతీల్లో అమలు చేయాల్సిన 60 రోజుల కార్యాచరణ ప్రణాళికపై సీఎం కేసీఆర్ అధికారులు, సర్పంచుల సంఘం ప్రతినిధులతో శనివారం ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సంద‌ర్భంగా కేసీఆర్ సీరియ‌స్ వార్నింగ్ ఇచ్చారు. నిర్దేశించిన పనులు చేపట్టని ప్రజాప్రతినిధులు, అధికారులపై చర్యలు తీసుకుంటామని సీఎం కేసీఆర్ అన్నారు. 


స్వాతంత్య్రం వచ్చి ఇన్నేళ్లయినా గ్రామాల పరిస్థితి ఇంకా మారలేదని సీఎం కేసీఆర్‌ అన్నారు. ఎన్నో వేల కోట్లు ఖర్చు చేసినా ఫలితం కనిపించడం లేదన్నారు. గ్రామాల్లో ఎక్కడి సమస్యలు అక్కడే తిష్టవేసి ఉన్నాయన్న సీఎం.. ఎవరికి వారు బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్నారన్నారు. ఇకపై విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. చర్యలు తీసుకునే అధికారాన్ని పంచాయతీరాజ్ చట్టం ప్రభుత్వానికి కల్పించిందని.. కొత్త చట్టం అమలు విషయంలో ప్రభుత్వం చాలా మొండిగా వ్యవహరిస్తుందని తెలిపారు.


అన్ని గ్రామాల్లో 60 రోజుల కార్యాచరణ ప్రణాళిక అమలు చేయాలని సీఎం కేసీఆర్ అన్నారు. 60 రోజుల కార్యాచరణలో భాగంగానే పవర్ వీక్ హరితహారం నిర్వహణ అన్నారు. 60 రోజుల తర్వాత ముఖ్య అధికారులు గ్రామాల్లో పర్యటిస్తారన్నారు. పనులు చేయని ప్రజాప్రతినిధులు, అధికారులపై చర్యలు తీసుకుంటామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 100 ఫ్లయింగ్ స్కాడ్ బృందాలు ఆకస్మిక తనిఖీలు చేస్తాయన్నారు. పంచాయతీ, మండల పరిషత్, జిల్లా పరిషత్ పోస్టులను భర్తీ చేస్తామన్నారు. కొత్తగా ఎన్నికైన సర్పంచ్‌లు గ్రామాభివృద్ధికి పాటుపడాలన్నారు. అన్నిగ్రామాల్లో 6 నెలల్లో విధిగా స్మశాన నాటికలు నిర్మిస్తామన్నారు.పంచాయతీలు పచ్చదనం, పరిశుభ్రతపైనే ఎక్కువ దృష్టి పెట్టాలన్నారు. గ్రామ వికాసంలో పంచాయతీ రాజ్ శాఖది చాలా క్రియాశీలకమైన పాత్ర కాబట్టి, ఈ శాఖను ప్రభుత్వం సంస్థాగతంగా బలోపేతం చేస్తుందని సీఎం ఈ సందర్భంగా వెల్లడించారు.


అన్ని జిల్లాలకు జిల్లా పంచాయతీ అధికారులను నియమించాలన్నారు. ప్రతి రెవెన్యూ డివిజన్‌ను ఒకరు చొప్పున డీఎల్‌పీవోలను, ప్రతి మండలానికి పంచాయతీ అధికారిని నియమించాలన్నారు. ఈవోపీఆర్ అండ్ ఆర్డీ పేరు తీసేసి ఎంపీవోగా మార్చాలని సూచించారు. ఎంపీడీవో, సీఈవో పోస్టులను భర్తీ చేయాలన్నారు. పోస్టుల భర్తీకి వీలుగా పంచాయతీ అధికారులకు పదోన్నతులు ఇవ్వాలన్నారు. శాఖాపరంగానే కొత్త నియామకాలు చేపట్టాలన్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో కలిసి పనిచేయాలన్నారు.


 ప్రజల భాగస్వామ్యంతో పచ్చదనం, పరిశుభ్రత పెంచే కార్యక్రమం చేపట్టాలన్నారు. గ్రామానికి అవసరమైన ఏడాది, ఐదేళ్ల ప్రణాళికలు రూపొందించాలన్నారు. వీధి దీపాల కోసం మూడో లైన్ వేసి.. ఎల్‌ఈడీ బల్బులు అమర్చాలన్నారు. విరివిగా మొక్కలు నాటి అన్నీ చెట్లుగా ఎదిగే వరకు బాధ్యత తీసుకోవాలన్నారు. ఇంటి యజమానులు, రైతులతో మాట్లాడి ఏ రకం చెట్లు కావాలో ఇవ్వాలన్నారు. చింతచెట్లను పెద్ద సంఖ్యలో పెంచాలన్నారు. వందకు వందశాతం పన్నులు వసూలు చేయాల్సిన బాధ్యత గ్రామ కార్యదర్శిదేనన్నారు. గ్రామంలో ఎవరు పెళ్లి చేసుకున్నా వెంటనే రికార్డులో నమోదు చేసుకోవాలన్నారు. గ్రామాల్లో జనన, మరణ రికార్డులు రాయాలన్నారు. పుట్టిన వెంటనే తల్లిదండ్రులకు కులం వివరాలతో సహా బర్త్ సర్టిఫికెట్ ఇవ్వాలన్నారు. విద్యుత్ సంస్థలకు క్రమం తప్పకుండా బిల్లులు చెల్లించాలన్నారు. గ్రామస్తులను శ్రమదానానికి ప్రోత్సహించి సామాజిక పనులు చేయాలని సీఎం పేర్కొన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: