తెలంగాణ కాంగ్రెస్‌కు ఇంకో షాక్ త‌గ‌ల‌డం ఖాయ‌మా? ఇప్ప‌టికే ముఖ్య‌నేత‌లు ఆ పార్టీని వీడ‌గా...ఇదే ఒర‌వ‌డిలో మ‌రో నేత కూడా పార్టీకి బైబై చెప్పేయ‌నున్నారా? అంటే అవున‌నే స‌మాధానం వ‌స్తోంది. కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నేత‌, ఆ పార్టీ స్టార్‌ క్యాంపెయినర్ విజ‌య‌శాంతి కాంగ్రెస్‌ను వీడ‌నున్నార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. కాంగ్రెస్ నేతల తీరుతో విసుగు చెందిన విజ‌య‌శాంతి బీజేపీలోకి వెళ్లాలన్న నిర్ణయంలో ఉన్నట్లు వార్త‌లు వ‌స్తోంది. త్వ‌ర‌లో ఈ మేర‌కు పార్టీ పిరాయింపు ఉండ‌నున్న‌ట్లు అంటున్నారు.


గ‌త సార్వ‌త్రిక ఎన్నిక‌ల స‌మ‌యం నాటి నుంచి కాంగ్రెస్ నేత‌ల తీరుప‌ట్ల విజ‌య‌శాంతి అసంతృప్తితో ఉన్న‌ట్లు ప్ర‌చారం జ‌రిగింది. ఖమ్మం లోక్‌సభ సీటుపై కాంగ్రెస్ ప్రచార సార‌థి విజ‌య‌శాంతి క‌న్నువేసిన‌ట్లు వార్త‌లు వ‌చ్చాయి. ఈ మేర‌కు ఆమె స‌న్నాహాలు చేసుకుంటున్న‌ట్లు కూడా ప్ర‌చారం జ‌రిగింది. అయితే, ఈ ప్ర‌చారంపై మాజీ కేంద్ర మంత్రి, సీనియ‌ర్ నాయ‌కురాలు రేణుకా చౌదరి భ‌గ్గుమ‌న్నారు. బంజారాహిల్స్‌లోని తన నివాసంలో అనుచ‌రులు, పార్టీ నేత‌ల‌తో భేటి అయ్యారు. ఖ‌మ్మం ఎంపీ సీటు త‌న‌కు ఇవ్వకుంటే పార్టికి రాజీనామా చేస్తానని కార్యకర్తల సమావేశంలో రేణుకా చౌదరి బహిరంగంగా ప్రకటించినట్లు స‌మాచారం.


అయితే, తాను సీటు కోర‌క‌పోయిన‌ప్ప‌టికీ...త‌న‌పై విమ‌ర్శ‌లు చేయ‌డంతో విజ‌య‌శాంతి నొచ్చుకున్నారు. కాంగ్రెస్‌ నేత‌లెవ‌రూ ఆ స‌మ‌యంలో స‌రిగా స్పందించ‌క‌పోవ‌డంతో ఆమె క‌త‌ల చెందారు .అనంత‌రం ప‌లు సంద‌ర్భాల్లో కూడా ఇదే రీతిలో ఇబ్బందులు ఎదుర‌వ‌డంతో..ఆమె పార్టీ ప‌ట్ల అన్య‌మ‌న‌స్కంగానే ఉన్నారు. తెలంగాణలో బీజేపీని బలోపేతం చేయాలన్న అమిత్ షా నిర్ణయంతో...బీజేపీ నాయకులు విజ‌య‌శాంతితో రెండు సార్లు సంప్రదింపులు జరిపారని స‌మాచారం. తన రాజకీయ ప్రస్థానాన్ని బీజేపీలోనే ప్రారంభించిన‌ విజయశాంతి ఆ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నార‌ని అంటున్నారు. త్వరలోనే విజయశాంతి కేంద్రమంత్రి అమిత్‌షాను ఆమె కలవనున్నారని తెలుస్తోంది. కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పే అంశంపై విజ‌య‌శాంతి నిర్ణ‌యం తేలాలంటే..మ‌రికొద్దిరోజులు వేచి చూడాల్సిందే. 



మరింత సమాచారం తెలుసుకోండి: