పిల్లలు స్కూల్ కి వెళ్లి చదువుకోవడం మామూలు విషయమే. రోజూ ఉదయం స్కూల్ కి వెళ్లాలి. ఇలా స్కూల్ కి వెళ్లే క్రమంలో వారు చేసే అల్లరి అంతా ఇంతా కాదు. కొంతమంది బుద్దిగా బడికి వెళ్తే మరికొందరు బడి ఎగ్గొట్టడానికి  నానా ప్రయత్నాలు చేస్తూంటారు. ఈ ప్రహసనంతోనే తల్లిదండ్రులకు రోజు మొదలవుతుంది. అలాంటిది ఓ వానరం బుద్దిగా బడికి వెళ్లి అయ్యవార్లు చెప్పే పాఠాలు వింటుంటే ఆశ్చర్యమే కదా.



వింత గొలుపుతున్న ఈ సంఘటన కర్నూలు జిల్లా ప్యాపిలీ మండలంలోని వెంగళంపల్లి ప్రాధమిక పాఠశాలలో జరుగుతోంది. 15 రోజులుగా ఈ వానరం రోజూ సహ విద్యార్ధులతో కలిసి బడికి వస్తోంది. బుద్దిగా వారి పక్కనే కూర్చుని ఉపాధ్యాయులు చెప్పే పాఠాలు వింటోంది. వాళ్లు రాసుకుంటున్నా, చదువుతున్నా ఆ పుస్తకాల వంకే చూస్తూ బుద్దిగా వారి పక్కనే కూర్చుంటోంది. పిల్లలకు ఎటువంటి హాని కలిగించకుండా కూర్చోవడంతో దానికి మాస్టార్లు కూడా అడ్డు చెప్పడంలేదు. సహ విద్యార్ధులందరూ కలిసి ఈ వానరానికి లక్ష్మీ అని పేరు కూడా పెట్టారు. లక్ష్మీ అని పిలుచుకుంటూ వాళ్ల దగ్గరే కూర్చోబెట్టుకుంటున్నారు. లక్ష్మీ కూడా స్కూల్ అంతా కలియతిరుగుతూ తనకిష్టమైన క్లాస్ కి వెళ్తోందట.


 

క్లాస్  లో పాఠాలు వినడమే కాదు, ప్రేయర్ లో పాల్గొనటం, మధ్యాహ్నం భోజనం చేయడం, పిల్లలతో కలిసి ఆడుకోవడం కూడా చేస్తోందట లక్ష్మీ. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు అబ్దుల్ లతీఫ్ ఈ విషయాలను ధ్రువీకరిస్తూ మా స్కూల్ కు బుద్దిమంతుడైన స్టూడెంట్ దొరికింది అని చెప్తున్నారు. కానీ, గత ఐదు రోజులుగా మేము లక్ష్మీని క్లాస్ రూమ్ కి రానివ్వటంలేదు. పిల్లలు టీచర్లు చెప్పే పాఠాలపైన దృష్టి పెట్టటంలేదని గ్రహించి మేం ఈ నిర్ణయం తీసుకున్నామని అన్నారు. ఏమైనా వానరం ఇలా బుద్దిగా స్కూల్ కి రావడం వింతైన విషయమే.


మరింత సమాచారం తెలుసుకోండి: