మహేష్‌ బాబు హీరోగా నటించిన 'ఖలేజా' సినిమా గుర్తుందా...? పాలి అనే ఊళ్లో అరుదైన ఇరీడియం లోహం ఉన్నట్టు తెలుస్తుంది, సర్వే చేయించిన ఓ కార్పొరేట్‌ కంపెనీకి.. జనానికి చెప్పి పొమ్మంటే పోరు గనుక ఒక్కొక్కళ్ళని ఏరివేసే కార్యక్రమం పెడుతుంది ఆ కంపెనీ.. ఆఖరికి ఎలా అయితేనేం దేవుడ్నే నమ్ముకున్న ఆ గ్రామస్తుల్ని హీరో వచ్చి కాపాడుతాడు. అదే సినిమా.. ఇప్పుడు, నల్లమల అడవుల్లో నిజం కాబోతుంది. కానీ, ఇక్కడ దేవుడు లాంటి హీరో లేడు గనుక అందరూ మౌనంగా తలలు దించాల్సొస్తోంది.. ...'' అని ఒక ఆసక్తి కరమైన వాస్తవాన్ని చెబుతున్నారు దుబాయ్‌కి చెందిన ప్రవాస భారతీయుడు హరిబాబు మద్దుకూరి. అదేంటో ఆయన రాతల్లోనే చదవండి...


'' సాక్షాత్తూ మన మల్లన్న కొలువైయున్న దట్టమైన నల్లమల అడవుల్లో, రాబోయే కొన్నేళ్లలో 'ఖలేజా' సినిమా రిపీట్‌ కాబోతుంది. 1990 ప్రాంతంలో అడపాదడపా అడవుల పైన తిరుగుతుండే సర్వే హెలికాఫ్టర్లని చూసి ఏమర్ధమయ్యేది కాదు, అమాయకులైన ఆ నల్లమల అడవుల్లోని ప్రజలకి.. 2008 నించీ అప్పుడప్పుడూ ఎవరెవరో వచ్చి రిగ్‌ డ్రిల్‌ యూనిట్స్‌ వేసి దాదాపు 50 చోట్ల నుంచి మట్టి శాంపిళ్ళు తీస్తుంటే తమ పుడమితల్లికి ఏం మహర్దశ పట్టబోతుందో కదా అని మురిసిపోయారు శతాబ్దాలుగా ఆ అడవినే నమ్ముకున్న కోయలు, చెంచులు.. కానీ వాళ్ళకి తెలీనిదేంటంటే కోట్ల ఏళ్ళ క్రితం జీవజాలం పుట్టడానికి ముందే స్వచ్ఛమైన ఆక్సిజన్తో చర్యనొంది భూ పొరల్లో ఏళ్ల తరబడి నిక్షిప్తమైపోయిన యురేనియానికి ఇన్నాళ్లూ వాళ్ళు కాపలా కాశారని, ఆ ఖనిజం ప్రపంచంలోనే అత్యంత నాణ్యమైన యురేనియంగా రూపాంతరం చెంది దాన్ని తన గర్భంలోనే దాచుకున్నందుకు భూదేవికి శాపంగా మారిందని..అవును.. కార్పొరేట్ల లెక్కల్లో దాని విలువ అక్షరాల లక్షల కోట్ల రూపాయలు.. అందుకే తవ్వి పారేస్తే పోలా అనుకున్నాయి..


కానీ పోయేది 42 గ్రామాలు..

70 వేల ప్రజలు.. అంతే..!! నీటిబావి తవ్వినంత సులభం కాదు భూగర్భాన్ని చీల్చి ఖనిజాన్ని వేరు చెయ్యడం.. అందునా అణుశక్తి గల రేడియోధార్మిక పదార్థం.. పేలిస్తే దేశాల్నే మసి చేసేయ్యగలదు.. బట్‌, కార్పొరేట్లు తల్చుకుంటే అదో లెక్కా.. !! మహాలక్ష్మి లోపలెక్కడో రెస్ట్‌ తీసుకుంటుందని తెలియగానే గుట్టుచప్పుడు కాకుండా రంగం సిద్ధమైపోయింది.. జాతి ప్రయోజనాలు తెరమీదకొచ్చాయి.. అడవుల్ని తవ్వి యురేనియం గనుక బయటకి తీస్తే ఇంకో ఇరవైయేళ్ళ నాటికి విద్యుత్తుకి లోటు ఉండదని, దేశానికి వెలుగులు ఇస్తుందని, స్థానికులకు ఉద్యోగాలొస్తాయని ఆశలు కల్పించడం, అడవుల్లో తవ్వకాల వల్ల ఎలాంటి నష్టాలు కలుగవని నమ్మించడం మొదలుపెట్టారు.. అవకాశాల కోసం చూసే సగటుజనం వాటితో సర్దుకుపోతారు.. కానీ అవొక్కటే కాదు దట్టమైన శ్రీశైలం అడవులంటే.. !!


ఆ నల్లమల కొండల్లో ఉన్నంత జీవవైవిధ్యం ఇంకెక్కడా కనబడదు.. దేశంలోనే అతిపెద్ద పులుల అభయారణ్యం.. అవి కాకుండా చిరుతపులులు, ఎలుగుబంట్లు, రకరకాల అడవిజంతువులు, క ష్ణ సర్పాలకి ఆవాసం.. ఇవన్నీ ఏమైపోతాయి..? నల్లమలలో మాత్రమే దొరికే ఔషధమొక్కల మాటేంటి.. ?? వీటిని పరిరక్షించడానికి అటవీశాఖ సలహా మండలి సూచనలేంటి.. ?? కొండల్ని కరిగించేశాకా వందలఏళ్లుగా నల్లమల అడవుల్లో కొలువైయున్న శైవ క్షేత్రాలు మిగలకపోవచ్చు..


శతాబ్దాలుగా అడవితల్లినే కాపాడుకుంటూ వస్తున్న కోయలు, చెంచులకి మైదానాలకెళ్లిపోవడమొక్కటే దిక్కు అంటున్నారు.. యురేనియం తవ్వకాల వల్ల పొల్యూట్‌ అయ్యే చుట్టుపక్కల నీరు, గాలి వల్ల రేడియోధార్మిక ప్రభావం వల్ల ప్రజల ఆరోగ్యాలు దెబ్బతినడం ఖాయం..

డ్రిల్‌ చేసినప్పుడొచ్చే వ్యర్ధాల్ని వదిలేది పక్కనే ఉన్న పచ్చటి క ష్ణమ్మలోకే.. మరి డ్రిల్‌ వేస్ట్‌ వదిలాకా ఆ జీవనదెంత కలుషితమవుతుందో, దాని మీదే ఆధారపడ్డ తాగు, సాగునీరు ఏమైపోతాయో ఆ పైవాడికే తెలియాలి..!! ఇప్పుడు ప్రభుత్వ పర్మిషన్‌ వచ్చేసింది తవ్వి పారేయ్యటానికి.!!

అనుమతులన్నీ వచ్చేశాకా అడిగినా వేస్ట్‌, ఇంకెందుకులే అని చల్లబడతారు ఇక. !!

కానీ నాశనమైపోయేది అడవిలో బతుకుతున్న నోరులేని మూగజీవులు, నోరున్నా అడగలేని మౌనజీవులే..!

మరింత సమాచారం తెలుసుకోండి: