జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గత ఎన్నికల్లో టిడిపికి మద్దతిచ్చి ప్రత్యక్ష ఎన్నికలకు దూరంగా నిలిచిన సంగతి తెలిసిందే. అయితే ఆ సమయంలో చంద్రబాబు గారిని నమ్మి మేము టిడిపికి మద్దతివ్వడం జరిగిందని, అయితే బాబు గారు సహా కొందరు టిడిపి నాయకులు ప్రజా సంక్షేమం పై సరిగా దృష్టి పెట్టడం లేదని అప్పట్లో పవన్ కళ్యాణ్ టిడిపి నాయకులపై ధ్వజమెత్తారు. ఇక ఇటీవలి 2019లో ఎవ్వరి మద్దతు లేకుండా ఒంటరిగా సార్వత్రిక ఎన్నికల బరిలో నిలిచిన జనసేనకు, కేవలం ఒకే ఒక్క సీట్ మాత్రమే దక్కింది. అయితే ఓటమి గెలుపుకు పునాది అని, ఎందరు ఎన్ని విధాలుగా తనను నిరుత్సాహ పరిచినా, ఏ మాత్రం తగ్గకుండా, తన కంఠంలో ఊపిరి ఉన్నంతవరకు జనసేన పార్టీని ముందుకు తీసుకువెళతాను అంటున్నారు పవన్ కళ్యాణ్. 

ఇక మొన్నటి ఎన్నికల్లో పార్టీ పరాజయానికి గల కారణాలను తెలుసుకుని, ఇకపై ఎక్కువగా ప్రజా సమస్యలపై దృష్టి పెట్టి అలానే పార్టీని మరియు పార్టీ నాయకులను ప్రజలకు మరింతగా చేరువ చేసేలా ఆయన త్వరలో ప్రజాక్షేత్రంలోకి యాత్రల రూపంలో వెళ్లనున్నారు. ఇందుకోసం ఇప్పటికే ప్రణాళిక సిద్ధం చేసి త్వరలో పశ్చిమ గోదావరి జిల్లా పర్యటనకు బయల్దేరనున్నారు. అయితే ఇక్కడే కొందరు ఆయన యాత్రల పై పలువిధాలుగా కామెంట్స్ చేస్తున్నారు. గతంలో టిడిపి అధికారంలో ఉన్న సమయంలో అప్పటి కాంగ్రెస్ నాయకులు దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఆంధ్ర మొత్తం యాత్ర చేయడం, ఆ తరువాత ప్రజల ఆశీస్సులతో కాంగ్రెస్ తరపున గెలిచి ముఖ్యమంత్రి కావడం జరిగిందని, అలానే ఇటీవల వైసిపి అధినేత జగన్ మోహన్ రెడ్డి గారు కూడా ఏడాది పాటు ఆంధ్ర మొత్తం ప్రజాసంకల్పయాత్ర చేపట్టారు. 

ఆ తరువాత జరిగిన మొన్నటి ఎన్నికల్లో ప్రజామోదంతో గెలుపొంది సీఎం అయ్యారని, ఇక ఇప్పుడు అదే వ్యూహాన్ని పవన్ కూడా ఫాలో అవుతున్నట్లు అనిపిస్తోదని వారు అంటున్నారు. అయితే ఈ విషయమై కొందరు రాజకీయ విశ్లేషకులు మాట్లాడుతూ, వైఎస్ గారు మరియు జగన్ గారు కేవలం రాష్ట్రవ్యాప్తంగా యాత్రలు చేసినంత మాత్రానే గెలుపొందలేదని, ప్రజలు వారిని నాయకులుగా నమ్మి, తమకు మంచి చేస్తారని భావించే ఓట్లు వేశారని, అలానే ప్రస్తుతం యాత్రలకు శ్రీకారం చుట్టిన పవన్ కూడా ప్రజలకు ఆ నమ్మకం కనుక కలిగిస్తే, తప్పకుండా రాబోయే ఎన్నికల్లో జనసేన గెలుపొందే అవకాశం లేకపోలేదని అభిప్రాయపడుతున్నారు......!!


మరింత సమాచారం తెలుసుకోండి: