ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి పాలనలో ఎవరి మాట చెల్లుబాటు కావడం లేదు. ఎవరికి వారు తమకు ఇష్టం వచ్చినట్టుగా నిర్ణయాలు తీసుకుంటే జగన్ ఏమాత్రం ఊరుకునే పరిస్థితి లేదు. సీనియర్ మంత్రులు, ఎమ్మెల్యేలు అయినా... ఎవరైనా తమ పరిమితులకు లోబడి మాత్రమే నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంది. ఇది నిజం. పార్టీ నుంచి చాలా మంది ఎమ్మెల్యేలు విజయం సాధించడంతో చాలామంది పదవుల‌పై ఆశలు పెట్టుకున్న వారి ఆశలు తీరలేదు. చాలా మంది సీనియర్లు ఎలాంటి పదవులు లేకుండా కేవలం ఎమ్మెల్యేలుగా మాత్రమే ఉన్నారు. ఇప్పుడు వీరంతా తమ మాట చెల్లుబాటు కావడం లేదని మంత్రులపై అసహనం వ్యక్తం చేస్తున్నట్టు వైసీపీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.


మంత్రుల‌కు మాత్రం ప‌నులు బాగానే అవుతున్నాయ్‌. ఎమ్మెల్యేల స్థాయిలో తమ మాట ఎవరూ వినడం లేదనేది ఎమ్మెల్యేల బాధ‌. ఎమ్మెల్యేలకు తెలియని విషయం ఏంటంటే.. అక్కడ మంత్రుల పరిస్థితి కూడా ఇలానే ఉంది. అంటే ఎవ‌రి ప‌ని వారు చేసుకుంటే ఇక్క‌డ ఇబ్బంది లేదు. త‌మ ప‌రిమితుల‌కు మించి అధికారం ఉంది క‌దా అని స్వేచ్ఛ ఎక్కువ తీసుకునే వారి విష‌యంలోనే ఇబ్బందులు త‌లెత్తుతున్నాయ్‌. చాలా రోజుల త‌ర్వాత బంప‌ర్ మెజార్టీతో అధికారం వ‌చ్చింది క‌దా ? అని కొంత‌మంది సీనియ‌ర్లు, మ‌రికొంత మంది యువ‌కులు రెచ్చిపోవాల‌ని చూస్తున్నారు. వాళ్ల‌తోనే ఇబ్బంది. ఇంకా చెప్పాలంటే వాళ్ల‌కే అస‌లు ఇబ్బంది.


అధికారుల బ‌దిలీలు, ఇసుక రవాణా సహా స్థానిక నాయకత్వం కనుసన్నల్లో జరగాల్సిన చాలా పనుల్లో తమకు ప్రాధాన్యత దక్కడంలేదని బహిరంగంగానే అసహనం వ్యక్తం చేస్తున్నారు ఎమ్మెల్యేలు. అధికారులు త‌మ మాట విన‌డం లేద‌ని ఇన్‌చార్జ్ మంత్రుల‌కు ఫిర్యాదులు ఎక్కువ అవుతున్నాయి. అధికారుల‌పై ఎక్కువుగా ఆధార‌ప‌డ‌కూడ‌దు.... అలాగ‌ని వాళ్ల విధుల్లో ఎక్కువుగా జోక్యం చేసుకోకూడ‌దు అన్న‌దే జగ‌న్ సిద్ధాంతం. ఇది చాలా మందికి న‌చ్చ‌డం లేదు.


చాలా మంది సొంతంగా తీసుకుంటున్న నిర్ణ‌యాలు బూమ‌రాంగ్ అవుతున్నాయి. బొత్స సత్యనారాయణ వంటి సీనియర్ నేతలు అన్న క్యాంటీన్ల వంటి విషయాల్లో తీసుకున్ననిర్ణ‌యం ప్ర‌భుత్వానికి ఇబ్బందిగా మారింది. ఎందుకంటే వీళ్ల ప‌గ్గాలు జ‌గ‌న్ చేతుల్లోనే ఉన్నాయి. వీళ్ల‌కు పూర్తి స్వేచ్ఛ ఇస్తే చాలా మంది గ‌త ఐదేళ్ల టీడీపీ పాల‌న‌లో ఎలా విజృంభించి అవినీతితో చంద్రబాబును నిలువునా ముంచేశారో రేపు జ‌గ‌న్ ప‌రిస్థితి కూడా అదే అవుతుంది. అందుకే ఇప్పుడు వైసీపీలో కొంద‌రు ఎమ్మెల్యేలు మంత్రుల‌పై ప‌డి ఏడుస్తుంటే, మంత్రులు జ‌గ‌న్‌పై అస‌హ‌నంతో ఉన్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: