బిజెపి-వైసిపిల మధ్య ఏం జరగబోతోంది ? అన్న అనుమానలు పెరిగిపోతున్నాయ్. ఫిరాయింపులపై అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారామ్ చేసిన వ్యాఖ్యలు రెండు పార్టీల మధ్య పెరుగుతున్న అగాధాన్ని స్పష్టంగా బయటపెట్టాయి. టిడిపికి చెందిన నలుగురు రాజ్యసభ ఎంపిలు బిజెపిలోకి ఫిరాయించటంపై స్పీకర్ తీవ్రంగా స్పందించారు. స్పందించటం కూడా మామూలుగా లేదు.

 

ఏకంగా రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడునే తమ్మినేని ఘాటుగా టార్గెట్ చేశారు. ఎంపిల ఫిరాయింపులను  వెంకయ్య  ప్రోత్సహించటాన్ని తమ్మినేని తీవ్రంగా తప్పుపట్టారు. ఎందుకంటే ఉపరాష్ట్రపతి అయ్యిన తర్వాత ఫిరాయింపులపై వెంకయ్య ఎన్నిసార్లు ధర్మోపదేశాలు చేసింది అందరికీ తెలిసిందే. చంద్రబాబునాయుడు, కెసియార్  ఫిరాయింపులను ప్రోత్సహించినా కేంద్రమంత్రిగా ఉన్నపుడు నోరెత్తని ఇదే వెంకయ్య ఉపరాష్ట్రపతి అయిన తర్వాత మాత్రం నీతులు మాట్లాడటం మొదలుపెట్టారు.

 

ఎక్కడ అవకాశం దొరికితే అకడల్లా నీతులు మాట్లాడిన వెంకయ్య ఎంపిల ఫిరాయింపును తానే దగ్గరుండి ఎలా ప్రోత్సహించారో ఆయనే సమాధానం చెప్పాలి. వెంకయ్యలో నిజాయితీ ఉంటే ఫిరాయించిన నలుగురు రాజ్యసభ ఎంపిలపై వెంటనే అనర్హత వేటు వేయాలి. కానీ అలా చేయకుండా వారందరినీ బిజెపి సభ్యులుగా పరిగణిస్తు నోటిఫికేషన్ కూడా విడుదల చేశారు.

 

 సరే వెంకయ్య ఎందుకు అలా చేశాడని ఆలోచిస్తే మూలకారణం ప్రధానమంత్రి నరేంద్రమోడినే అన్న విషయం ఎవరికైనా అర్ధమైపోతుంది. మోడి ప్రధాని అయిన దగ్గర నుండి ప్రతిపక్షాలను చీల్చి చెండాతున్న విషయం అందరూ చూస్తున్నదే. ఎక్కడవకాశం దొరికితే అక్కడల్లా ప్రత్యర్ధి పార్టీల ఎంపిలను, ఎంఎల్ఏల్లో చీలిక తెచ్చి బిజెపిలో చేర్చుకుంటున్నారు. ఇందులో భాగంగానే టిడిపి ఎంపిలు బిజెపిలో చేరటం.

 

 మోడి చేస్తున్నది అప్రజాస్వామికమని తెలిసినా కేవలం పదవి కోసమే వెంకయ్య నోరు మెదపలేకపోతున్నారు. అందుకనే తమ్మినేని వ్యాఖ్యలు ప్రత్యక్షంగా వెంకయ్యను ఉద్దేశించి చేసినవే అయినా పరోక్షంగా మోడికి కూడా తగులుతాయనటంలో సందేహం లేదు. పైగా తానైతే ఫిరాయింపులను ప్రోత్సహించేది లేదని స్పష్టంగా చెప్పటం కూడా బిజెపికి రుచించనిదే.

 

ఎందుకంటే టిడిపి నుండి కొందరు ఎంఎల్ఏలను లాక్కోవాలని బిజెపి చూస్తోంది. అదే జరిగితే వారిపై అనర్హత వేటు పడటం ఖాయం. ఫిరాయింపులకు అడ్డువస్తున్నాడన్న ఏకైక కారణంతోనే బిజెపి నేతలు జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తున్న విషయం అర్ధమైపోతోంది.

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: