బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు అతలాకుతలమవుతున్నారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ప్రజానీకం పడుతున్న అవస్థలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. వరద బాధితులకు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. ఈ క్రమంలో ప్రజలకు నిత్యావసరాలు పంపిణీ చేయాలని అధికారులను ఆదేశించారు.గోదావరి వరద ఉద్ధృతిపై ముఖ్యమంత్రి  వైయస్.జగన్ ఆరా తీశారు. ఇజ్రాయెల్ పర్యటనలో ఉన్న జగన్ ఉభయగోదావరి జిల్లాల్లో వరద ప్రభావంపై తన కార్యాలయ అధికారులతో ఫోన్లో మాట్లాడారు. ప్రస్తుతం గోదావరి పరీవాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలు, వస్తున్న వరదపై ఆయన వివరాలు అడిగి తెలుసుకున్నారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు వరద పరిస్థితిపై, తీసుకుంటున్న చర్యలపై అధికారులు ఎప్పటికప్పుడు సీఎంకు నివేదిస్తున్నారు. ముంపు ప్రాంతాల్లో ప్రజలను వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్నారు. సహాయ శిబిరాల్లో వారికి భోజనం సహా అన్ని ఏర్పాట్లూ చేయాలని జగన్ ఆదేశించారు.

వరదబాధిత గ్రామాల్లోని ప్రజలకు వెంటనే నిత్యావసర వస్తువులను పంపిణీ చేయాలని అధికారులకు చెప్పారు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. అందుకు అనుగుణంగా  విప్తత్తు నిర్వహణ సిబ్బందిని సన్నద్ధం చేయాలని సీఎం ఆదేశించారు. సహాయ కార్యక్రమాల్లో పాల్గొనాల్సిందిగా ఆయా మంత్రులు, ఎమ్మెల్యేలను సీఎం ఆదేశించారు. కోస్తాలో మరో రెండు, మూడు రోజులు విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఆవరించిన ఉపరితల ఆవర్తనం ఒడిసా, పశ్చిమ బెంగాల్‌ పరిసరాల్లో వాయవ్య బంగాళాఖాతంలో కొనసాగుతోంది. ఇదే సమయంలో గుజరాత్‌ నుంచి ఆవర్తనం వరకు ద్రోణి విస్తరించింది. వీటి ప్రభావంతో నైరుతి రుతుపవనాలు చురుగ్గా మారి కోస్తాలో ముసురు వాతావరణం నెలకొని వర్షాలు కురిశాయి. అక్కడక్కడా భారీవర్షాలు పడ్డాయి.  శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళిలో 6.5, విశాఖపట్నం జిల్లా ముంచంగిపుట్టులో 6, అనంతగిరిలో 5సెం.మీ. వర్షపాతం నమోదైంది. 
రానున్న మూడు రోజుల వరకు కోస్తాలో విస్తారంగా, రాయలసీమలో అక్కడక్కడా వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది. 
సముద్రం అల్లకల్లోలంగా ఉంది. అలలు ఎగసి పడుతున్నాయి. కళింగపట్నం, భీమునిపట్నం, విశాఖపట్నం, గంగవరం, కాకినాడ ఓడరేవుల్లో మూడో నంబరు ప్రమాద హెచ్చరిక ఎగురవేశారు. రానున్న 48గంటల్లో ఈశాన్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుందని, తరువాత బలప డుతుందని తెలిపింది. శ్రీకాకుళంజిల్లాలో భారీవర్షానికి సంతబొమ్మాళి- శివరాంపురం గ్రామాల మధ్య రోడ్డు వరద నీటి ఉద్ధృతికి కొట్టుకుపోయింది. ఈ నేపథ్యంలో సీఎం ఆదేశాల మేరకు అధికారులు సహయక చర్యలు చేపట్టారు.

గోదావరి వరదలకు ప్రభావితమైన తూర్పుగోదావరి జిల్లా దేవిపట్నం మండలంలోని 32 ఆవాసాలు సహా, ఉభయగోదావరి జిల్లాల్లోని ముంపు గ్రామాలకు నిత్యావసర వస్తువుల పంపిణీపై ప్రభుత్వం ఉత్తర్వులు  జారీచేసింది. ప్రతి కుటుంబానికి 25 కేజీల బియ్యంతోపాటు, 2 లీటర్ల కిరోసిన్, 1 కేజీ కందిపప్పు, 1 లీటరు పామాయిల్, 1 కేజీ ఉల్లిపాయలు, 1 కేజీ బంగాళాదుంపలు ఇవ్వాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. ముంపు ప్రభావం ఉన్న గ్రామాలన్నింటికీ ఈ ఉత్తర్వులు వర్తిస్తాయని వెల్లడించింది.


వరద పరిస్థితిని ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం సహాయక బృందాలను రంగంలోకి దించింది. తూర్పుగోదావరి జిల్లాలో 90 మంది, పశ్చిమగోదావరి జిల్లాలో 30 మంది ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని రంగంలోకి దింపింది. ఇందులో 30 మంది పి.కూనవరం ప్రాంతంలో సహాయకార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. మరో 10 మంది సీతానగరంలో ఉన్నారు. రాజమండ్రిలో మరో 50 మందిని, దేవీపట్నంలో 30 మందిని అధికారులు సిద్ధంగా ఉంచారు.అలాగే తూర్పుగోదావరిలో ఎస్టీఆర్ఎఫ్ నుంచి 124 మంది, పశ్చిమగోదావరిలో 34 మంది సహాయకార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. తొయ్యేరులో 5గురు, పూడిపల్లిలో 4గురు, వీరవరంలో 23 మంది, దేవీపట్నంలో నదివెంబడి 92 మంది ఉన్నారు. పోలవరంలో 34 మంది ఉన్నారు. ఫైర్సర్వీస్ నుంచి తూర్పుగోదావరి జిల్లాలో 90 మంది, పశ్చిమగోదావరి జిల్లాలో 49 మంది ఉన్నారు. కమ్యూనికేషన్స్కోసం తూర్పుగోదావరి జిల్లాలో 5, పశ్చిమగోదావరి జిల్లాలో 1 శాటిలైట్ ఫోన్లను వినియోగిస్తున్నారు. క్షేత్రస్థాయిలో పరిస్థితిని తెలుసుకునేందుకు ఒక డ్రోన్ బృందంకూడా పనిచేస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: