లాట‌రీ అంటే నిజంగానే లాట‌రీ. అదృష్టం ఉంటే...ఆశ‌లు వ‌దిలేసుకున్న స‌మ‌యంలో ఊహించ‌ని రీతిలో స్టార్ తిరిగిపోతుంది. అలా నిజామాబాద్ జిల్లా జక్రాన్‌పల్లి వాసి విలాస్‌రెడ్డి స్టార్ ఊహించ‌ని రీతిలో తిరిగింది. ఏకంగా 28.40 కోట్ల లాట‌రీ ద‌క్కింది. భార్య ఇచ్చిన 20,000తో రిస్క్ చేసి కొన్న లాట‌రీ టికెట్ ఆయ‌న స్టార్ తిరిగిపోయేలా చేసింది. రాత్రికి రాత్రే కోటీశ్వరుడు అయిపోయిన ఆయ‌న వివ‌రాలివి.



రైతు కుటుంబానికి చెందిన విలాస్‌రెడ్డి గతంలో బతుకుదెరువు కోసం దుబాయ్ వెళ్లి నాలుగు సంవ‌త్స‌రాలు వివిధ ప‌నులు చేసుకున్నాడు. ఇటీవ‌ల ఇంటికి వచ్చి నాలుగు ఎకరాల్లో వ్యవసాయం చేసుకుంటూ జీవనం గడుపుతున్నాడు. అయితే, వ్యవసాయం గిట్టుబాటు కాకపోవడంతో మళ్లీ దుబాయ్‌లో పనికోసం విజిట్ వీసాపై 45రోజుల కిత్రం దుబాయ్ వెళ్లాడు. దీంతో అక్కడ ఉద్యోగం లభించక పోవడంతో తిరిగి వచ్చాడు. దుబాయ్ నుంచి ఇంటికి వచ్చే క్రమంలో అబుదాబీలో నిర్వహిస్తున్న ``ది 15 మిలియన్ బిగ్ టికెట్ ర్యాఫెల్`` లక్కీ డ్రాలో స్నేహితుడు రవి సహాయంతో రూ.20,019 ఇండియా కరెన్సీ పెట్టి ఒక టికెట్టు కొన్నాడు. స్నేహితుడు రవి విలాస్‌రెడ్డికి ఒకటి, తనకు రెండు లాటరీ టికెట్లు కొనుగోలు చేశాడు. ఆ లక్కీ డ్రా నిర్వాహకులు ఈనెల 3న డ్రా తీయగా విలాస్‌రెడ్డికి అదృష్టం వరించించింది. విలాస్‌రెడ్డి కొన్న టికెట్‌కు లాటరీ తగిలి ఏకంగా దుబాయ్ కరెన్సీ 15 మిలియన్ల దిరామ్స్ అంటే ఇండియా కరెన్సీలో సుమారు రూ. 28.40 కోట్లు ఆయన గెలుచుకున్నాడు. దీంతో విలాస్ రెడ్డి ఇంట్లో సంబురాలు జ‌రుగుతున్నాయి.


ల‌క్కీడ్రా వార్త గురించి విలాస్‌రెడ్డి త‌న‌ను క‌లిసిన మీడియాంతో సంతోషంగా పంచుకున్నాడు. లక్కీ డ్రాలో తాను గెలుపొందినట్లు దుబాయ్ నుంచి ఫోన్ రాగానే కుటుంబ సభ్యులు ఆనందంతో ఉప్పొంగి పోయారని విలాస్‌రెడ్డి తెలిపారు. తన భార్య పద్మ తను రావడానికి విమానా టికెట్ కోసం పంపిన రూ.20 వేలతో లాటరీ టికెట్ కొనగా అదృష్టం వరించిందని విలాస్‌రెడ్డి తెలిపారు. తాను కొన్న లాటరీ టికెట్‌లో రూ.29 కోట్లు వచ్చినట్లు నిర్వాహకులు ఫోన్ చేసి చెప్పారని, ఆ డబ్బుల కోసం త్వరలో దుబాయ్ వెళ్తానని తెలిపారు. లాటరీలో వచ్చిన డబ్బులతో తన ఆర్థిక సమస్యలను పరిష్కరించుకొని వ్యవసాయ రంగ అభివృద్ధికి ప్రాధానత, చేయూతనిస్తానని తెలిపారు. విలాస్‌రెడ్డికి భార్య పద్మ, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పెద్ద కూతురు మాన్విని ఇంటర్ చదువుతుండగా, చిన్న కూతురు హిమానీ తొమ్మిదో తరగతి చదువుతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: