చదువుల తల్లి అయిన సరస్వతి దేవి వెలసిన ప్రాంతం బాసర. ప్రస్తుతం బాసరలో పరిస్తితులు చాలా క్లిష్టంగా ఉన్నాయని భక్తులు వాపోతున్నారు. ఆలయ అధికారులు వారి కనీస బాధ్యతలు వ్యవహరించడంలో వైఫల్యం చెందుతున్నారు. నిర్మల్ జిల్లా బాసర ఆలయంలో చినుకు పడితే చాలు చిత్తడిగా మారుతుంది. ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం యాభై కోట్లు కేటాయించి నెలలు గడుస్తున్నా, ఇంత వరకు ఎలాంటి అభివృద్ధి కి నోచుకోవడం లేదు.


ఇక్కడికొచ్చే భక్తులకు తిప్పలు తప్పడం లేదు. నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల ఆలయ ప్రాంగణంలో పూర్తిగా నీళ్లు నిలిచిపోయి భక్తులకు ప్రదక్షిణ చేయడానికి కూడా సౌకర్యంగా లేకపోయింది. నిర్మల్ జిల్లా సరస్వతి అమ్మ వారి క్షేత్రం సమస్యల సుడిగుండంలో మునిగింది. పట్టణంలో నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దాంతో అమ్మ వారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు అసౌకర్యంగా మారింది.ఆలయ ప్రాంగణంలో పూర్తిస్థాయిలో  షెడ్డు  నిర్మించకపోవడం, ఉన్న షెడ్డుకి అక్కడక్కడ చిల్లుపడి నీరంతా చేరి అక్కడి పరిసరాలు అన్ని చిత్తడి చిత్తడిగా మారాయి. ఆలయం చుట్టూ నీళ్లు కురుస్తూ భక్తులకు ఇబ్బందికరంగా తయారైంది.


ఆలయ ప్రవేశ ద్వారం వద్ద నుండి ఆలయ దర్శనం అనంతరం ప్రదక్షిణలు చేసే వరకు భక్తు లు వర్షంలో తడుస్తూ అమ్మ వారిని దర్శించుకుంటున్నారు. వర్షపు నీటిని ఆపడానికి అక్కడక్కడా చిన్న చిన్న నీటి తొట్టెలు ఏర్పాటు చేసినా, అవి నిండిపోయినా తర్వాత పట్టించుకునే నాథుడు లేడు. బాసర ఆలయానికి భారీగా ఆదాయం ఉన్నా కనీస సౌకర్యాలు కల్పించటంలో ఆలయ అధికారులు దృష్టి సారించడం లేదని భక్తులు ఆరోపిస్తున్నారు.



ఆలయ అభివృద్ధి కి ప్రభుత్వం యాభై కోట్లు కేటాయించి నెలలు గడుస్తున్నా, అధికారుల పర్యవేక్షణ లోపించడం ఎక్కడేసిన గొంగళి అక్కడే అన్న విధంగా మారింది. ఇప్పటి కైనా దేవాదాయ శాఖ అధికారు లు జోక్యం చేసుకుని పరిస్థితిని చక్కదిద్దాలని భక్తులు భావిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: