తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో, భారత రాజ్యాంగం లోని 370వ ఆర్టికల్‌కు సంబంధించి అనేక అర్ధసత్యాలు సోషల్‌ మీడియాలో ప్రచారం అవుతున్నాయి. వాటిలో ఒక ఆసక్తికరమైన అంశం ఇది. భారత దేశంలోని ఏ రాష్ట్రానికీ లేనటువంటి ప్రత్యేక ప్రతిపత్తిని 370 ఆర్టికల్‌ జమ్మూ-కాశ్మీర్‌కు కల్పిస్తుంది.
ఉదాహరణకు ఈ ఆర్టికల్‌ ప్రకారం జమ్మూ-కశ్మీర్‌లో, భారత దేశంలోని ఇతర ప్రాంతాల ప్రజలు, స్థలాలు కొనడం, అమ్మడం చేయరాదు.

ఇది నిజమే ...
అక్కడే కాదు, ఆంధ్రా,తెలంగాణలో కూడా కొన్ని ప్రాంతాల్లో స్ధానికేతరులు స్ధలాలు కొనడాకిని హక్కు లేదు.. అదెలాగో  చూద్దాం .

 రాజ్యాంగం ప్రకారం ఒక ప్రాంతానికి లేక రాష్ట్రానికి ప్రత్యేక సదుపాయాలు కల్పించడం అనేది ఒక జమ్మూ-కాశ్మీర్‌ రాష్ట్రానికే పరిమితం కాదు. అలాంటి సదుపాయాలు ఆర్టికల్‌ 371 ద్వారా అనేక రాష్ట్రాలకు కల్పించారు. ఈ ఆర్టికల్‌ ప్రకారం మహారాష్ట్రలోని విదర్భ, మరట్వాడాల్లోను, గుజరాత్‌ లోని కచ్‌ ప్రాంతంలోను ప్రత్యేక అభివృద్ధి కమిటీలు ఏర్పాటు చేశారు.

 ఈ కమిటీలకు ఆ ప్రాంతాలలోని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలలో సరైన వాటా ఇచ్చే ప్రత్యేక అధికారాలు వుంటాయి. అలాగే 371-బి అస్సాంకు, 371-సి మణిపూర్‌ కు, 371-ఎఫ్‌ సిక్కింకు, 371-హెచ్‌ అరుణాచల్‌ ప్రదేశ్‌కు, 371-ఐ గోవాకు ఇలాంటి ప్రత్యేక సదుపాయాలు కల్పించింది.

.ఇక స్థలాల కొనుగోళ్లు, అమ్మకాల విషయంలో ఆర్టికల్‌ 370 జమ్మూ-కాశ్మీర్‌ రాష్ట్రానికి ప్రత్యేక సదుపాయం కల్పించినట్లే, ఆర్టికల్‌ 371-ఎ నాగాలాండ్‌కు, 371-జి మిజోరాంకు ప్రత్యేక సదుపాయాలు కల్పించింది. ఆర్టికల్‌ 371ఎ, ఆర్టికల్‌ 371-జి ప్రకారం నాగాలాండ్‌, మిజోరాం లో కూడా ఆయా రాష్ట్రాలకు చెందని వారు అక్కడి భూములు కొనగూడదు. అమ్మకూడదు.

 ఈ విషయాలలో భారత పార్లమెంటు చేసే చట్టాలు కూడా ఆ రాష్ట్రాలకు వర్తించవు. అంతెందుకు? ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలలో కూడా 1/70 చట్టం అమలులో వుంది. ఆ చట్టం ప్రకారం ఈ రెండు తెలుగు రాష్ట్రాలలోని గిరిజన ప్రాంతాలుగా ప్రకటించబడ్డ ప్రాంతాలలో గిరిజనులు మాత్రమే భూములు కొనాలి. అమ్మాలి. గిరిజనేతర ప్రజలు, వారు భారతీయులైనా సరే ఆ ప్రాంతాలలో భూములు కొనరాదు. అమ్మరాదు. ఇలా 370, 371-ఎ, 371-జి, 1/70 చట్టాలను రాజ్యాంగం లో ఎందుకు పొందుపరచారు?
ఎందుకు అమలు చేస్తున్నారు?

ఎందుకంటే ఆయా ప్రాంతాలు తీవ్రంగా వెనుకబడి వున్నాయి. అక్కడ కొనుగోళ్లకు భారతీయుల లోనే వేరే ప్రాంతాల వారికి అవకాశమిస్తే, వెనుకబడిన ఆయా ప్రాంతాల వాళ్లను వేరే ప్రాంతాల వాళ్లు మోసం చేస్తారనే సందేహంతో, ఆ ప్రాంతాల వారి ఆస్తులకు ప్రత్యేక రక్షణ నిమిత్తం రాజ్యాంగంలో కొన్ని ఆర్టికల్‌లు, కొన్ని ప్రత్యేక చట్టాలు చేశారు.
వాస్తవం ఇది కాగా, ఆర్టికల్‌ 370 ప్రకారం ఒక్క కశ్మీర్‌లోనే ఆస్తులకు సంబంధించి నిబంధనలు ఉన్నాయని ప్రచారం చేయడం వాస్తవాన్ని వక్రీకరించడమే అని పరిశీలకులు అంటున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: