సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబందించిన కాళేశ్వరం వద్ద గోదావరి ఉగ్రరూపాన్ని కొనసాగిస్తున్నది. ఎగువన మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలకు కాళేశ్వరం వద్ద సోమవారం 7,97,000 క్యూసెక్కుల ప్రవాహం నమోదైంది. సోమవారం ఉదయం 81 గేట్ల నుంచి 9.16 లక్షల క్యూసెక్కుల నీటిని వదిలినట్లు అధికారులు వెల్లడించారు. సోమవారం సాయంత్రానికి సుమారు 7.97 లక్షలు ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో ఉన్నట్లు తెలిపారు.

సుందిల్ల బరాజ్, మానేరు నుంచి ప్రవాహం రావడంతో ఇంజినీర్లు అన్నారం బరాజ్‌లో తొమ్మిది గేట్లను ఎత్తి నీటిని వదులుతున్నారు. మొత్తంగా అన్నారం బరాజ్‌కు 45,000 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉన్నది. అన్నారం బరాజ్‌లో సోమవారం వరకు 7.20 టీఎంసీ నీరు నీల్వ ఉన్నట్లు అధికారులు తెలిపారు. కన్నెపల్లి పంప్‌హౌస్‌లో 28 రోజులు ఆరు మోటర్ల ద్వారా 12.1 టీఎంసీల నీటిని ఎత్తిపోసి అన్నారం బరాజ్‌కు గ్రావిటీ కెనాల్ ద్వారా పంపారు.అన్నారం బరాజ్‌లోని అన్నారం పంప్‌హౌస్ నుంచి నాలుగు మోటర్ల ద్వారా ఏడు రోజులు 5 టీఎంసీల నీటిని సుందిల్ల బరాజ్‌కు తరలించారు. కన్నెపల్లి పంప్‌హౌస్ నుంచి అన్నారం బరాజ్‌కు చేరిన 7.20 టీఎంసీల నీరు అలాగే ఉన్నది.

బరాజ్‌లకు గత పదిరోజుల నుంచి మానేరు, చిన్న చిన్న ఒర్రెలు, సోమవారం నుంచి సుందిల్ల బరాజ్ నుంచి వస్తున్న నీటిని అలాగే ఇంజినీర్లు దిగువకు వదిలిపెడుతున్నారు.తెలంగాణలో పడుతున్న వర్షాలకు రాష్ర్టంలో జల కళ సంతరించుకుంది. ప్రస్తుతం ఎగువ నుంచి వస్తున్న నీటితో గోదావరి ఉధృతి పెరుగుతూనే ఉంది. ప్రాణహిత నుంచి లక్షల క్యూసెక్కుల వరద గోదావరిలోకి వచ్చి చేరుతున్నది. సోమవారం కాళేశ్వరం దగ్గర ఆరు లక్షలకు పైగా, మేడిగడ్డకు దిగువన పేరూరు వద్ద ఏకంగా 9.18 లక్షల క్యూసెక్కులకు పైగా ప్రవాహం నమోదవుతున్నది. మరోవైపు శ్రీరాంసాగర్‌కు చుక్కడునీరు లేకపోగా.. శ్రీపాద ఎల్లంపల్లి జలాశయం నిండుకుండలా మారింది.

వర్షాలకుతోడు గోదావరి నదికి ఎగువన అదిలాబాద్ జిల్లాలో ఉన్న కడెం ప్రాజెక్టు గేట్లు ఎత్తి దిగువ గోదావరిలోకి వదులుతున్నారు. ఎల్లంపల్లి ప్రాజెక్టులో పూర్తిస్థాయి నీటిమట్టం చేరడంతో సోమవారం 10 గేట్లు ఎత్తి గోదావరిలోకి నీటిని విడుదలచేస్తున్నారు. ప్రాజెక్టులోకి 39,204 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా, 54,620 క్యూసెక్కుల నీటిని వదులుతున్నట్లు అధికారులు తెలిపారు.సోమవారం సాయంత్రం ఆరు గంటల సమయానికి ఎల్లంపల్లి జలాశయం 485.01 అడుగుల నీటిమట్టంతో 19.70 టీఎంసీల నిల్వకు చేరింది. ఇక్కడినుంచి విడుదలచేసిన జలాలు సుందిల్ల బరాజ్‌కు చేరుకొంటున్నాయి. సుందిల్లలో ప్రస్తుతం 6.5 టీఎంసీల నీటినిల్వ ఉన్నది. ఎగువనుంచి నీరు వస్తుండటంతో ప్రస్తుతం 17 గేట్లను ఎత్తి 28,000 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: