క్షేత్రస్ధాయిలో జరుగుతున్నది చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. జగన్మోహన్ రెడ్డి పాలన మొదలై రెండు నెలలు పూర్తవ్వకుండానే పలువురు మంత్రులు, ఎంఎల్ఏల్లో సొంత ప్రభుత్వంపైనే  అసంతృప్తి మొదలైపోయిందని సమాచారం.  తెలంగాణా ప్రభత్వంలో మొత్తం అధికారాన్ని కెసియార్ తన గుప్పిట్లో పెట్టుకున్నట్లుగానే ఏపిలో జగన్ కూడా అదే విధంగా వ్యవహరిస్తున్నారనే ప్రచారం పార్టీలో బాగా ఎక్కువైపోయింది.

 

తెలంగాణాలో మంత్రులు, ఎంఎల్ఏలున్నప్పటికీ ఎవరికీ ఎటువంటి అధికారాలను కెసియార్ ఇవ్వలేదు. మంత్రులు, ఎంఎల్ఏలు ఏమి చెప్పినా కలెక్టర్లు, ఎస్పీలు తలూపుతున్నారే కానీ పనులు మాత్రం ఏమీ చేయటం లేదు. ఏ జిల్లాలో ఏ పని కావాలన్నా కెసియార్ నుండి ఆదేశాలు అందాల్సిందే. టిఆర్ఎస్-1 ప్రభుత్వంలో  అధికారం సమస్తం కెసియార్ లేదా కెసియార్ కుటుంబం గుప్పిట్లోనే ఉండిపోయింది.

 

టిఆర్ఎస్-2 లో కూడా పెద్దగా మార్పులేమీ ఉన్నట్లు కనబడటం లేదు. సొంత జిల్లాల్లో కూడా మంత్రుల మాట చెల్లుబాటు కావటం లేదు. అందుకనే మెల్లిగా కెసియార్ పై వ్యతిరేకత పెరిగిపోతోంది. ఎంఎల్ఏ సోమారపు సత్యనారాయణ రాజీనామా ఇందులో భాగమే. మరికొందరు నేతలు కూడా టిఆర్ఎస్ కు రాజీనామా చేసేసి బిజెపిలో చేరిపోయారు.

 

సరే కెసియార్ వ్యవహారాన్ని పక్కనపెట్టేస్తే ఏపిలో జగన్ పాలన కూడా దాదాపు అలాగే ఉంది. బహుశా పాలనా వ్యవహారాల్లో కెసియార్ సలహాలే జగన్ పైన పనిచేస్తున్నాయేమో ? ఇక్కడ కూడా తమ మాట చెల్లుబాటు కావటం లేదంటూ ఎంఎల్ఏల్లో అసంతృప్తులు మొదలైపోయాయి. అవినీతి రహిత పాలన అందించాలన్న జగన్ లక్ష్యాన్ని ఎవురూ తప్పు పట్టేందుకు లేదు.

 

అలాగని అధికారపార్టీ ఎంఎల్ఏల మాట కూడా చెల్లుబాటు కాకపోతే జనాల్లో వాళ్ళు తలెత్తుకు తిరగలేరన్న విషయం జగన్ గ్రహించాలి.  కాబట్టి చిన్న చిన్న విషయాలో మంత్రులు, ఎంఎల్ఏల మాట కూడా చెల్లుబాటయ్యేలా జిల్లాల యంత్రాంగాలకు జగన్ ఆదేశించాలి. లేకపోతే పుట్టి ముణిగిపోవటం ఖాయం.

 


మరింత సమాచారం తెలుసుకోండి: