రాజ‌మ‌హేంద్ర‌వ‌రం మాజీ ఎమ్మెల్యే డాక్ట‌ర్ ఆకుల స‌త్య‌నారాయ‌ణ జ‌న‌సేన‌కు గుడ్ బై చెప్పేశార‌న్న‌ది దాదాపు తేలిపోయింది. 2014 ఎన్నిక‌ల్లో బీజేపీ నుంచి రాజ‌మ‌హేంద్ర‌వరం సిటీ ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందిన ఆయ‌న స్థానిక బీజేపీ నేత సోము వీర్రాజుతో విబేధించి ఎన్నిక‌ల‌కు ముందు బీజేపీలోకి జంప్ చేసేశారు. ఈ ఎన్నిక‌ల్లో ఆయ‌న జ‌న‌సేన నుంచి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. ఎన్నిక‌ల‌కు ముందు బీజేపీకి షాక్ ఇచ్చి పవన్ సమక్షంలో భార్యా సమేతంగా జనసేన తీర్ధం పుచ్చుకున్నారు.


ఈ క్ర‌మంలోనే త‌న లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలోని కొంద‌రికి తాను కోరుకున్న చోట్ల అసెంబ్లీ సీట్లు ఇవ్వాల‌ని ఆకుల కోర‌గా ప‌వ‌న్ అందుకు ఒప్పుకోలేద‌న్న ప్ర‌చారం కూడా జ‌రిగింది. కార‌ణం ఏదైనా ఎన్నిక‌ల‌కు ముందు ఎంతో ఆర్భాటంగా జ‌న‌సేన‌లో చేరిన ఆకుల ఎన్నిక‌ల ప్ర‌చారంలో చాలా సైలెంట్ అయిపోయారు. ఆర్థికంగా ప‌లుకుబ‌డి ఉన్న నేత కావ‌డంతో ఆయ‌న భారీగా ఖ‌ర్చు చేస్తార‌ని అంద‌రూ భావించారు. అయితే ఆయ‌న ఎన్నిక‌ల్లో అంత ఖ‌ర్చు చేయ‌లేదు.


ఎన్నిక‌ల ఫ‌లితంపై ముందుగానే అంచ‌నాకు రావ‌డంతోనే ఆయ‌న ప్ర‌చారం చేసేందుకు కూడా పెద్ద‌గా ఇష్ట‌ప‌డేలేద‌ని అర్థ‌మైంది. ఇక ఎన్నిక‌ల్లో జ‌న‌సేన ఘోరంగా ఓడిపోయింది. ఎన్నిక‌ల ఫ‌లితాలు వ‌చ్చాక ఆకుల ఓ ప్రెస్‌మీట్ పెట్టి జ‌న‌సేన‌ను, ప‌వ‌న్‌ను క‌డిగిప‌రేశారు. ఎన్నిక‌ల్లో ఘోర‌మైన ఓట‌మికి తప్పంతా పవన్ నాయకత్వ లేమి, పార్టీకి కులముద్ర ప‌డ‌డ‌మే ప్రధాన కారణాలని తేల్చేశారు.


ఇక ఇప్పుడు ఆకుల తిరిగి త‌న పాత గూడు అయిన బీజేపీలో చేరేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్న‌ట్టు తెలుస్తోంది. తాజాగా ప‌వ‌న్ రాజ‌మ‌హేంద్ర‌వ‌రం లోక్‌సభ నియోజ‌క‌వ‌ర్గ పార్టీ కార్య‌క‌ర్త‌ల స‌మావేశం నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మానికి కూడా ఆయ‌న డుమ్మా కొట్టేశారు. దీంతో ఆకుల జ‌న‌సేన‌ను వీడ‌డం దాదాపు ఖాయ‌మైందంటున్నారు. ఈ క్ర‌మంలోనే ఇటీవ‌ల మీడియా వాళ్లు జ‌న‌సేన‌కు ఎందుకు దూరంగా ఉంటున్నార‌ని ప్ర‌శ్నిస్తే అస‌లు జ‌న‌సేన కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయా ? అని ఎదురు ప్ర‌శ్నించారు. 


ఏదేమైనా పార్టీ వీడేందుకు సిద్ధ‌మైన ఆయ‌న ప‌వ‌న్ నిర్వ‌హించిన కీల‌క స‌మావేశానికి రాలేద‌ని తెలుస్తోంది. ఇక ఆయ‌న తిరిగి బీజేపీలో చేరేందుకు సిద్ధ‌మైనా ఇప్పుడు సోము వీర్రాజు ఏం చేస్తార‌న్న‌దే ?  కాస్త స‌స్పెన్స్‌.


మరింత సమాచారం తెలుసుకోండి: