పెన్షన్లందక పోవటంతో వివిధ వర్గాలు అల్లాడిపోతున్నాయి. ప్రతీ నెలా 1వ తేదీనే వృద్దాప్య ఫించన్లు, వికలాంగులు, వితంతు పెన్షన్లు తీసుకునే లక్షలాది మంది ఇబ్బందులు పడుతున్నారు. అధికారంలోకి రాగానే పై వర్గాలకు పెన్షన్లను క్రమబద్దీకరిస్తానని జగన్ ఎన్నో సమావేశాల్లో హామీలిచ్చారు. పెన్షన్ల కోసం ఎవరి చుట్టూ తిరగాల్సిన అవసరం కూడా ఉండదన్నారు.

 

జగన్ చెప్పింది ఒకరకంగా నిజమే అయ్యింది. ఎందుకంటే తమకందాల్సిన పెన్షన్ కోసం ఎవరి చుట్టూ తిరిగినా ఫించన్ రాదని చాలామందికి అర్ధమైపోయింది. టిడిపి హయాంలో 1వ తేదీనే పెన్షన్ అందేది. కాకపోతే పెన్షన్ కు అర్హులు కాకపోయినా టిడిపి సానుభూతిపరులు తదితరులకు కూడా పెన్షన్లు మంజూరు చేశారనే ఆరోపణలుండేవి. అనర్హులకు పెన్షన్లు ఇచ్చే కారణంతో చాలా చోట్ల అర్హులను కూడా ఏరేశారు.

 

ఈ విషయాలన్నింటినీ జగన్ పాదయాత్రలోను తర్వాత ఎన్నికల సభల్లో కూడా చెప్పారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్నదేమిటో అర్ధం కావటం లేదు. పోయిన నెలలో కూడా పెన్షన్ రావటం చాలా లేటైంది. ఏదో రాజ్యన్న జయంతి రోజున పెన్షన్ల పంపిణీ మొదలవుతోంది కాబట్టి ఆలస్యమైందని పోయిన నెలలో తర్వాత చెప్పుకున్నారు అధికారులు.

 

సరే ఏదోలే ఒక నెలే కదా అని సరిపెట్టుకున్నారు పెన్షన్ దారులు. కానీ ఈ నెలలో కూడా ఇప్పటి వరకూ పై వర్గాలకు పింఛన్ అందలేదు. 1వ తేదీన వచ్చే పెన్షన్ కోసం లక్షలాది మంది ఆపన్నులు ఎదురు చూస్తుంటారన్న విషయం ప్రభుత్వానికి తెలీదా ? ప్రభుత్వం ఇచ్చె పెన్షన్ ఆధారంగా నిరుపేదలు లక్షలాది మంది తమ జీవితాలను వెళ్ళ దీస్తున్నారు.

 

అలాంటిది 6వ తేదీ అయిపోయినా ఇంకా పెన్షన్ అందకపోవటంతో వాళ్ళ పరిస్ధితేంటో ప్రభుత్వం ఆలోచించాలి. ఇటువంటి వ్యవహారాల వల్లే లోపాలు ఎక్కడ జరుగుతున్నాయో చూసుకోకపోవటం వల్లే జగన్మోహన్ రెడ్డికి చెడ్డ పేరొచ్చే అవకాశం ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: