టీడీపీ నుంచి బీజేపీలోకి వెళ్లిన సుజనా చౌదరి.. ఇటీవల ఓ ఆశ్చర్యకరమైన కామెంట్ చేశారు. బీజేపీలోకి వెళ్లినా.. ఆ పార్టీ స్టాండ్ కు భిన్నంగా టీడీపీని సపోర్ట్ చేసే ప్రయత్నం చేశారు. పోలవరం ప్రాజెక్టు కాంట్రాక్టును రద్దు చేయడం సరికాదని సుజనా చౌదరి వ్యాఖ్యానించారు. కేంద్రంతో సంప్రదింపులు జరపకుండా ఏకపక్షంగా చేశారని.. ఇది సరికాదని ఆయన అన్నారు. పోలవరం ప్రాజెక్టు కాంట్రాక్టును క క్షతో చేసినట్లు అనిపిస్తోందని... ఇది తన వ్యక్తిగత అభిప్రాయమని ఆయన అన్నారు.


ఇప్పుడు ఈ ఒక్క డైలాగ్ తో సుజనా చౌదరిని వైసీపీ నేతలు ఆడుకుంటున్నారు. బీజేపీ నేత, రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరిపై వైయస్‌ఆర్‌సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. సుజానా చౌదరి బీజేపీలో చేరినా ఇంకా టీడీపీ అధికార ప్రతినిధిలాగే వ్యహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.


పోలవరం కాంట్రాక్టుల రద్దు, విద్యుత్‌ పీపీఏ ఒప్పందాల్లో అవినీతిపై సమీక్ష.. ఇలా వైయస్‌ జగన్‌ తీసుకున్న నిర్ణయాలను కేంద్రం అడ్డుకుంటున్నట్లు సుజనా చెబుతున్నారని వ్యాఖ్యానించారు. ప్రజాధనం లూటీని సుజనా సమర్థించడం చూస్తుంటే లోపల వేసుకున్న పక్క చొక్కా అలాగే ఉందనిపిస్తోందని ఎద్దేవా చేశారు. ఈ మేరకు విజయసాయిరెడ్డి ట్విట్టర్‌ లో స్పందించారు.


ఇక ఏపీ జలవనరుల మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కూడా సుజనా చౌదరి తీరుపై నిప్పులు చెరిగారు. ఎంపీ సుజనా చౌదరి వ్యవహారం చూస్తే విస్మయం కలుగుతోందన్నారు. ఆయన ఇంకా టీడీపీ నేతగానే కొనసాగుతున్నారా అనే అనుమానం కలుగుతోందని అనిల్ కుమార్ యాదవ్ విమర్శించారు. టీడీపీ హయాంలో జరిగిన అవినీతిపై విచారణ ఆపేయాలని సుజనా చౌదరి చెప్పడం విడ్డూరంగా ఉందని కామెంట్ చేశారు. ఇంతకీ ఇప్పుడు సుజనా చౌదరి ఏ పార్టీలో ఉన్నారో అని అనిల్ కుమార్ యాదవ్ వెటకారంగా అన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: