పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణా కాంగ్రెస్ పార్టీ ముగ్గురు ఎంపీలను గెలిచుకుంది. గతంలో కంటే ఇప్పుడు ఇంకా మేలు అనుకున్నారు. కానీ ముగ్గురు ఎంపీలు ఎవరికి వారే అన్నట్టు వ్యవహరించడంతో అస్తవ్యస్తంగా మారింది కాంగ్రెస్ పరిస్థితి. ఏం చెయ్యాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు పార్టీ పెద్దలు. పార్లమెంటు ఎన్నికల్లో మూడు ఎంపీ స్థానాలు గెలుచుకున్న కాంగ్రెస్ పార్టీ తెగ సంబర పడిపోయింది. గతంలో కంటే పార్టీ పరిస్థితి మెరుగుపడింది అనుకున్నారు పార్టీ పెద్దలు.



కానీ అనుకున్నదొకటి అయినది ఒకటి అవుతోంది, గెలిచిన ఎంపీలు పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిలు ఎవరిదారి వారే అన్నట్లు ఉంటున్నారు. ముగ్గురు రాష్ట్రంలో ప్రభావితం చేసే నాయకులే కానీ ముగ్గురు నాయకులూ ఎవరి పనుల్లో వాళ్లు ఉండిపోయారు. పీసీసీ చీఫ్ గా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రస్తుతం పార్లమెంట్ వ్యవహారాల మీదే ఎక్కువ దృష్టి సారించారు. పీసీసీ చీఫ్ గా కూడా అయిష్టంగానే కొనసాగుతున్నారు. ఢిల్లీ వ్యవహారాలపై ఎక్కువ ఫోకస్ పెట్టడంతో స్థానికంగా పార్టీ పూర్తిగా దెబ్బ తినే పరిస్థితులు ఏర్పడ్డాయి.



సమావేశాలు సమీక్షల ఊసే లేదు. దీంతో పార్టీకి కార్యకర్తల సైతం దూరమవుతున్నారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పార్లమెంటులో ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి తన నియోజకవర్గానికి సంబంధించిన సమస్యలపైన మాత్రమే ఫోకస్ చేస్తున్నారు. మూసీ ప్రక్షాళన, నేషనల్ హైవేలపై ఎక్కువగా దృష్టి సారించారు. రోజుకో కేంద్ర మంత్రిని కలిసి సమస్యల పరిష్కారానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా కార్యకర్తలను ఒకేసారి పైకి తెచ్చేందుకు ప్రయత్నించటం లేదు.రాష్ట్రమంతా పర్యటించాలని అనుకున్నా అది అమలుకు నోచుకోలేదు.



పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి కూడా మల్కాజిగిరి నియోజకవర్గానికి సంబంధించిన పనులపైనే ఎక్కువగా దృష్టి సారిస్తున్నారు.గెలిచిన ముగ్గురు ఎంపీలు నియోజకవర్గాలకు పరిమితం కావడంతో రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాల్లో కార్యకర్తలు పార్టీకి దూరమయ్యే పరిస్థితి ఏర్పడింది. ముగ్గురు ఎంపీలు రాష్ట్రంలో పార్టీ అభివృద్ధికి కృషి చేస్తామని ప్రకటించారు. కానీ రాష్ట్రాన్ని వదిలేసి నియోజకవర్గానికి పరిమితమయ్యారని అభిప్రాయం పార్టీ శ్రేణుల్లో నెలకొంది.

మరింత సమాచారం తెలుసుకోండి: