ఒకే వేధికపై కౌంటర్ మరియు రీ కౌంటర్ లు ఎదుర్కొన్న పరిస్థితి పల్నాడులో ఆర్ఎస్ఆర్ భూముల వ్యవహారంలో చోటు చేసుకుంది.పల్నాడులో ఆర్ఎస్ఆర్ భూముల వ్యవహారం తీవ్ర స్థాయిలో దుమారం రేపుతుంది. దశాబ్దాలుగా పెండింగ్ లో ఉన్న ఈ సమస్య పరిష్కారం కోసం ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు నడుం బిగించారు. ఆ దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేశారు. అయితే ఇదే సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారడంతో సమస్య పక్కదారి పట్టే ప్రమాదం ఏర్పడింది. గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతంలో ఆర్ ఎస్ ఆర్ భూముల వ్యవహారం అధికారులు, రైతులకు మధ్య పంతాలు పట్టింపులను రాజేస్తుంది.





దశాబ్ధాలుగా ఈ సమస్య పరిష్కారం కోసం రైతులు నాయకుల చుట్టూ తిరుగుతున్నారు. భూములపై రైతులకు అధికారం కల్పించేందుకు గతంలో పాలకులు కూడా హామీలిచ్చారు. ఇదే సమస్య పరిష్కారం కోసం వినుకొండ శాసన సభ్యుడు బొల్లా బ్రహ్మనాయుడు బహిరంగ వేదిక సాక్షిగా అధికారులను సంజాయషీ కోరారు. రైతులకు ఇచ్చిన హామీ మేరకు సమస్య పరిష్కారం కాకపోతే ఆందోళనకు దిగుతానన్నారు. ఇదంతా ఒకెత్తయితే అదే సమయంలో బొల్లాపల్లి ఎమ్మార్వో కూడా తనదైన శైలిలో ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడుకి సమాచారమిచ్చారు.




తమకు అధికారం లేదని కలెక్టర్ ను సంప్రదించి పూర్తి వివరాలు అందజేస్తానని అదే వేదిక పై ఎమ్మెల్యేకు సమాధానమిచ్చారు. ఇది కాస్త వైరల్ గా మారింది. ఎంఎల్ఎ మాటలకి ఎమ్మార్వో అదే వేదిక పై కౌంటరిచ్చారు అన్నట్లుగా ప్రచారంలోకి రావడంతో బొల్లా బ్రహ్మనాయుడు మండిపడుతున్నారు.ఇలాంటి సంఘటనల వల్ల ప్రజా సమస్యలు పక్కదారి పట్టే ప్రమాదం ఉందని ఇటువంటివి ప్రోత్సహించటం సమంజసం కాదని నర్సరావుపేట ఎంపి శ్రీకృష్ణదేవరాయులు అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. ఎన్నో దశాబ్దాలుగా పెండింగ్ లో ఉన్న భూములపై రైతులకు హక్కు కల్పించే అంశం బహిరంగ వేదికపై చర్చించటం, అక్కడి పరిస్థితులను తారుమారు చేసిందనే చెప్పాలి. మరి ఈ సమస్యకి పరిష్కారం చూపే విషయంలో అధికారులు ప్రజా ప్రతినిధులు ఏ మేరకు విజయం సాధిస్తారో వేచి చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: