ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకంతో ఎంతోమంది విద్యార్ధులకు కడుపు నింపుతోంది.ఈ నేపధ్యంలో అన్నంలో పురుగులు వస్తున్నాయని చెబుతున్నా పట్టించుకునే నాధుడే లేడు ఓ పాఠశాలలో. ఉడికీ, ఉడకని భోజనం పెడుతున్నారని ఫిర్యాదు చేసినా అధికారులు స్పందించరు అక్కడ. మధ్యాహ్న భోజన పథకం విద్యార్థుల ఆకలి తీరుస్తుందనుకుంటే ఆ స్కూళ్ళో మాత్రం పిల్లలు పస్తులుండాల్సిన పరిస్థితి వస్తుంది. ఎన్నిసార్లు చెప్పినా నిర్వాహకులు తీరు మారకపోవడంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విద్యార్థులు నిరసన బాట పట్టారు.



మధ్యాహ్న భోజన పథకంతో పిల్లలకు ఆకలి తీర్చాలన్న ప్రభుత్వ ఉద్దేశానికి నిర్వాహకులు తూట్లు పొడుస్తున్నారు. అన్నంలో పురుగులు వస్తున్నాయని నాణ్యతలేని పదార్థాలు పెడుతున్నారని నిర్వహకులపై చర్యలు తీసుకోవాలని అధికారులు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకున్న పాపాన పోలేదు. దీంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులు ఖాళీ కంచాలతో నిరసన బాట పట్టారు. మధ్యాహ్న భోజనం తింటే ఆసుపత్రుల చుట్టూ తిరగాల్సి వస్తుందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.



స్కూల్ లో భోజనం పెడుతున్నారని ఇంటి నుంచి తెచ్చుకోకుండా వస్తే, తీరా ఆ భోజనం తినాలంటేనే భయమేస్తోందని అంటున్నారు విద్యార్థులు. పరిస్థితి మరీ అధ్వానంగా ఉందని ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని విద్యార్థులు చెబుతున్నారు. నిర్వాహకులపై చర్యలు తీసుకునే అధికారాలు తమకు లేవని పిల్లలకు న్యాయం చేయలేక పోతున్నామని పాఠశాల ప్రధానోపాధ్యాయులు అంటున్నారు. పురుగుల అన్నం తినలేక స్కూల్ విద్యార్థులు కూడా ఆందోళన బాట పట్టారు. మరి ఇప్పటికైనా అధికారులలో చలనం వస్తుందా,బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటారా అనేది చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: