ఏపీలో ఎన్నికలు ముగిసి రెండు నెలలు అయ్యాయ్ కాగా ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధించిన సంగతి అందరికీ తెలిసిందే. దీంట్లో టిడిపి పరాజయం పాలైంది. అయితే, టీడీపీ కార్యకర్తలపై జరుగుతున్న దాడులపై ప్రతిపక్షనేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పులివెందుల పంచాయతీ చేస్తున్నారని, వైసీపీ శ్రేణులు బెదిరిస్తే టిడిపి కార్యకర్తలు ఊళ్లు విడిచి వెళ్ళిపోవాలా అని చంద్రబాబు ప్రశ్నించారు. తాము అధికారంలో ఉన్నప్పుడు ఇదే పని చేస్తే మీరు ఎక్కడ ఉండేవారంటూ వైసీపీ శ్రేణులను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఏదైనా ఊళ్లో టిడిపి కార్యకర్తలకు భద్రత లేదని భావిస్తే తాను ఆ ఊళ్లోనే బస చేస్తానని మళ్లీ సాధారణ పరిస్థితులు నెలకొన్నాకే తిరిగి వెళతానన్నారు నారా చంద్రబాబు నాయుడు.



పోలీసులు కూడా ఎవరి ఒత్తిళ్లకూ లొంగకుండా పనిచేయాలని చంద్రబాబు సూచించారు. "ధైర్యంగా మీరందరు సరెండర్ అయిపోతారా? ఊరూరు నేను చూస్తున్న పల్నాడులో ఏమి జరుగుతుంది అని, గ్రామాలు వదిలి పెట్టి పోవాలనా? ఈ రోజు నువ్వు ఆ పని చేస్తే రేపు మేము వస్తే మీరు గూడ గ్రామాలు వదిలి పెట్టి పోవాలనా" అని చంద్రబాబు ప్రశ్నించారు. "22 సంవత్సరాలు మనం అధికారంలో ఉన్నామే 22 సంవత్సరాలలో మనం ఆ పని చేసుంటే వీళ్ళు ఉండేవాళ్ళ.?" "పోలీసులు ఏం చేస్తున్నారు వ్యవస్థని అడుగుతున్న, వదిలిపెట్టారా పోలీసుల్ని, బాధ్యత లేదా మీకు" అని చంద్రబాబు ప్రశ్నించారు.



"ఒకవేళ గాని వీళ్ళు ఇష్టప్రకారం చేస్తే దాన్ని ఏ విధంగా చేయాలో చేద్దాం మరీ తప్పుడు కేసులు పెడితే మనం కూడా కేసులు పెడదాం, కేసులు కూడా తీసుకోకపోతే ప్రైవేటు కంప్లయింట్ కూడ పెట్టి అవసరమైతే కన్సర్న్ ఆఫీసర్ తీసుకోకపోతే వాళ్ళని కూడా పార్టీ చేసి కోర్ట్లో వేసి న్యాయం చేసే వరకు నేను మీకు అండగా ఉంటాను తప్ప ఎవ్వరినీ వదిలిపెట్టము" అని చంద్రబాబు చెప్పారు.ఇది ఎవ్వరూ తమాషాకి తీసుకోవద్దనీ, పోలీసులు తమ బాధ్యతను నెరవేర్చాలని ఆయన సూచించారు. ఏపీ అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేసిన ఎందుకు ఓడిపోయామో ఇప్పటికీ అర్థం కావడం లేదన్నారు ప్రతిపక్షనేత చంద్రబాబు.



పాలిచ్చే ఆవును వదిలేసి తన్నే దున్నపోతును తెచ్చుకున్నారని ఆయన వ్యాఖ్యానించారు. తాను ఎక్కడ తప్పు చేశానో ప్రజలు చెబితే సరిదిద్దుకునేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పారు చంద్రబాబు. జనం టిడిపి ప్రభుత్వాన్ని ఓడించినందుకు బాధ కలుగుతుందన్నారు ప్రతిపక్షనేత చంద్రబాబు. అయితే కొత్త ప్రభుత్వ పాలనతో ప్రజలు బాధపడుతూ ఉంటే చూస్తూ ఉండలేకపోతున్నానని అన్నారు. వారి కష్టాలు చూసి బాధ కలుగుతుందన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఎప్పుడు పోరాడుతూనే ఉంటానని చెప్పారు చంద్రబాబు. అమరావతి అభివృద్ధి కోసం ఎన్నో కలలు కన్నానని, కానీ కొత్తగా అధికారం చేపట్టిన వైసీపీ ప్రభుత్వం రాజధానిని చంపేస్తుందని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.



రాజధాని నిర్మాణం దిశగా జగన్ సర్కారు ఒక్క చర్య కూడా తీసుకోవడం లేదని చంద్రబాబు మండిపడ్డారు. ఢిల్లీకి వెళ్లి ప్రధానిని కలిసిన సీఎం జగన్ నిధులు అడగాల్సింది పోయి తనపై ఫిర్యాదులు చేస్తున్నారని ఆరోపించారు చంద్రబాబు. "హైదరాబాద్ కు ధీటుగా అమరావతి ఉండాలనే ప్రణాళిక తయారు చేస్తే ఎన్నికలు అయిపోయిన తర్వాత ఏమైందో మీరే చూస్తున్నారు,ఎక్కిరిస్తా ఉంది ఇప్పుడు రాజధాని మనకు. చాలా బాధేస్తుంది. అమరావతిని చంపేశారు. చాలా బాధ కలుగుతుంది ఎందుకంటే మన పిల్లల భవిష్యత్ ఏంటి? ఉద్యోగం కావాలంటే బ్యాంగ్లూరు,హైదరాబాదు,చెన్నై, బాంబే లకి వెళ్ళాల విదేశాలకెళ్లాలనా,మనకంటూ ఒక రాజధాని ఉండి మన పిల్లలు ఉద్యోగాలు చేసుకునే అర్హత మనం సంపాదించుకోలేమా అనే ఉద్దేశంతో నేను కడితే, దాని మీద కక్షగట్టి అమరావతిని చంపేసే పరిస్థితికొచ్చారు." అంటూ చంద్రబాబు ఆరోపణ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: