జమ్ముకశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించే రాజ్యాంగ అధికరణం 370ని రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం సోమవారం నిర్ణయం తీసుకోవడం తెలిసిందే. విజ‌య‌వంతంగా ఈ బిల్లుల‌ను రాజ్య‌స‌భ‌, లోక్‌స‌భ‌ల‌లో ఆమోదించుకుంది. అయితే, దీనిపై పాక్ గింజుకుంటోంది. ఎలా స్పందించాలో తెలియ‌ని రీతిలో.... కొత్త ట్విస్టులు పెడుతోంది. పాకిస్తాన్ మంత్రి ఫవాద్ చౌదరి తాజాగా మీడియాతో మాట్లాడుతూ....త‌మతో మాట్లాడటానికే భారతదేశానికి ఇష్టం లేనప్పుడు ఆ దేశ రాయబారి ఇక్కడే ఉండడమెందుకు? అని ప్రశ్నించారు. త‌ద్వారా భార‌త్ నుంచి త‌మ రాయ‌బారిని ఉపసంహ‌రించుకుంటానే మాట‌ను ప‌రోక్షంగా వెల్ల‌డించారు. 


భారత విదేశాంగ మంత్రి జయశంకర్‌ను ఉద్దేశించి పాక్ మంత్రి చౌద‌రి ఆస‌క్తిక‌ర ట్వీట్ చేశారు. ఇరు దేశాల మధ్య స్నేహా పూర్వక వాతావరణం లేదని, ఇండియాతో దౌత్యపరమైన సంబంధాలను తెగదెంపులు చేసుకుంటున్నామని ఆయన అన్నారు. తమ దేశ రాయబారి ఇండియాలో, వారి రాయబారి ఇక్కడ ఉండటం వల్ల ఉపయోగం లేదంటూ ఉప‌సంహ‌రించుకుంటున్నామ‌ని అంటున్నారు. కాగా, సంబంధాలు ఉప‌సంహ‌రించుకోవ‌డం గురించి ఇప్పుడు సెంటిమెంట్ డైలాగ్‌లు చెప్తున్న పాక్ బుద్ధి ఇన్నాళ్లు ఏమైందని ప‌లువురు ప్ర‌శ్నిస్తున్నారు.


ఇదిలాఉండ‌గా, తాజాగా పాక్ సంబంధాలపై ప‌లువురు అంతర్జాతీయ విశ్లేష‌కులు ఆస‌క్తిక‌ర రీతిలో స్పందిస్తున్నారు. జ‌మ్ముకశ్మీర్ స్వయంప్రతిపత్తిని రద్దు చేసి, దానిని కేంద్రపాలిత ప్రాంతంగా మార్చినందున.. ఇక కశ్మీర్ అంశంపై పాకిస్థాన్‌తో భారత్ చర్చించాల్సిన అవసరం లేదని విశ్లేషకులు కొందరు అభిప్రాయపడుతున్నారు. భారత విదేశాంగశాఖ మాజీ కార్యదర్శి శ్యాంశరణ్ మాట్లాడుతూ ...గతంలో జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించడం ద్వారా ఆ ప్రాంతం వివాదాస్పద అంశమని భారత్ పరోక్షంగా అంగీకరించినట్టయింది. కానీ, ఇప్పుడు ఆ ప్రతిపత్తిని తొలగించినందున ప్రస్తుతం ఆ వివాదానికి ఆస్కారం లేదు. ఇప్పుడు కశ్మీర్ కేవలం మనదేశ అంతరంగిక అంశమే. ఈ నేపథ్యంలో భారత్-పాక్ మధ్య భవిష్యత్ చర్చలపై దీని ప్రభావం చెప్పుకోదగ్గ స్థాయిలోనే ఉంటుంది. 1994లో పార్లమెంట్ తీర్మానం మేరకు పాక్ ఆధీనంలోని కశ్మీర్ (పీవోకే), గిల్గిట్-బాల్టిస్థాన్ కూడా భారత్‌లోని అంతర్భాగాలేనని భారత్ వాదించవచ్చు అని పేర్కొన్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: