తెలుగుదేశం పార్టీ అన్న నందమూరి పెట్టిన పార్టీ. అభిమానమే పెట్టుబడిగా, ఆత్మగౌరవమే పలుకుబడిగా జనంలోకి వచ్చాడు నాడు తారకరాముడు. అన్న గారి పార్టీలో టికెట్లు అతి సామాన్యులకు లభించాయి. ఆ రోజుల్లో ల్యాండ్ లైన్ ఫోన్లు ఉండేవి. ఎన్నికల్లో పోటీ చేయడానికి దరకాస్తు చేసుకొమ్మని ఒపెన్ ఆఫర్ ఇచ్చారు నందమూరి. అలా వచ్చిన వారికి ఫోన్లు చేసి మీకు టికెట్ ఇస్తున్నామ‌ని చెప్పి  వారికి షాక్ తినిపించిన ఘనత అన్న గారిది. అలా ఎందరో విద్యావంతులు ఎంపీలు, ఎమ్మెల్యేలు అయ్యారు. ఒక్క రూపాయి ఖర్చు పెట్టకుండా చట్ట సభల్లోకి అడుగుపెట్టారు. నిజంగా నాడు  అది ఆదర్శనీయమైన రాజకీయంగా ఉండేది.


మరి చంద్రబాబు జమానాలో ఎన్నికలు అతి ఖరీదైన వ్యవహారంగా మారాయని సొంత పార్టీ తమ్ముళ్లే చెబుతారు. ఇపుడు బాబు పక్కన ఉన్న మాజీ మంత్రుల్లో చాలా మంది అన్న గారి టైంలో ఉన్నారు. వారినడిగితే ఎన్నికల్లో ఎంత ఖర్చు ఆనాడు చేశారు, ఈనాడు చేస్తున్నారో చెప్పేస్తారు. ఇవన్నీ ఇలా ఉంటే ఇపుడున్న నీతి ప్రకారం ప్రతీ  రాజకీయ పార్టీకి విరాళాలు అవసరమే వాటిని సంకూర్చి పెట్టేందుకు అనేక ట్రస్టులు కూడా ఉన్నాయి. ఢిల్లీకి చెందిన ప్రుడెంట్ ఎలక్ట్రోరల్ ట్రస్ట్ దేశంలోని  రాజకీయ పార్టీలకు వారి విజయావకాశాలు, పలుకుబడి ఆధారంగా విరాళాలు ఇస్తుంది. ఆ ట్రస్ట్ కి పేరొందిన సంస్థలు  విరాళాలు ఇస్తూంటాయి.


ఇదిలా ఉండగా 2018-19 ఆర్ధిక సంవత్స‌రానికి సంబంధించి తెలుగుదేశం పార్టీకి ఏకంగా పాతిక కోట్ల భూరి విరాళాన్ని ప్రుడెంట్ ఎలక్ట్రోరల్ ట్రస్ట్ అందించింది. అదే సమయంలో తెలుగు రాష్ట్రాల్లో ఏ ఇతర పార్టీకి ఇలా విరాళాలు దక్కలేదు. ఇక ఆ ఏడాది టీడీపీకి వచ్చిన మొత్తం పార్టీ ఫండ్ 26.17 కోట్లు అనుకుంటే అందుకో 25 కోట్ల రూపాయలు ట్రస్ట్ ఇచ్చినవే. మరి ఒక ప్రాంతీయ పార్టీకి ఇంత పెద్ద మొత్తంలో విరాళాలు ఇవ్వడం అంటే అది బాబు పలుకుబడి అనుకోవాలా లేక టీడీపీ గెలుపు గుర్రమని భావించి ఇచ్చారా అన్నది చూడాలి.


ఇదే ట్రస్ట్ దేశంలోని జాతీయ పార్టీలకు కూడా విరాళాలను అదే ఏడాది ఇచ్చింది. దేశంలో గ్రాండ్ ఓల్డ్ పార్టీగా ఉన్న కాంగ్రెస్ కి ఈ ట్రస్ట్ ఇచ్చిన విరాళం పది కోట్లు. దేశమంతా యాభై ఏళ్ళ పాటు అధికారం చలాయించిన కాంగ్రెస్ కి ఇచ్చినది కేవలం పది కోట్లు అయితే ఉప  ప్రాంతీయ పార్టీగా  ఉన్న టీడీపీకి దక్కింది పాతిక కోట్లు. ఇక విజయమే తప్ప అపజయం ఎరగని ఒడిషాలోని  బిజూ జనతాదాళ్ కి అదే ఏడాది ఇచ్చిన సొమ్ము అయిదు కోట్ల రూపాయలు మాత్రమే.


దీన్ని బట్టి అర్ధమైందేంటంటే చంద్రబాబు పలుకుబడి, రాజకీయ ఎత్తుగడలు ఆయనకు పార్టీ  ఫండ్ ఎంతలా తెప్పిస్తాయన్నది. ఇదెవరో చెప్పింది కాదు, టీడీపీ స్వయంగా ఎన్నికల సంఘానికి తమ  పార్టీ చిట్టా పద్దుల వివరాలను జూలై 30న సమర్పించింది. అందులో పేర్కొన్న సమాచారమే ఇదంతా. అంటే 2018 నాటికి బాబే బలవంతుడని, మళ్ళీ పవర్లోకి వస్తారని నమ్మిన సంస్థలు ఈ ట్రస్ట్ ద్వారా అతి పెద్ద మొత్తాన్ని ఫండ్ గా ఇప్పించాయన్నమాట. 


ఇక ఎన్నికల ఏడాది టీడీపీకి వచ్చిన ఫండ్స్ ని గురించి ఇంకా చిట్టా పద్దులు సమర్పించలేదుట. ఇదిలా ఉండగ వైసీపీ, టీయారెస్ తమ పార్టీల నిధుల వివరాలను ఇంతకు ముందే ఎన్నికల సంఘానికి సమర్పించాయట. అందులో ప్రుడెంట్ ట్రస్ట్ గురించి  ప్రస్తావన లేదు అంటే ఆ పార్టీలకు పైసా కూడా దక్కలేదన్న మాటేగా.



మరింత సమాచారం తెలుసుకోండి: