వైఎస్ జగన్ ప్రస్తుతం ఢిల్లీ టూర్లో ఉన్నారు. ఆయన చాలా మందిని కలవాలనుకుని  రెండు రోజుల బిజీ షెడ్యూల్ తో హస్తినలో కాలు పెట్టారు. అయితే జగన్ టూర్ ప్రోగ్రాం చాలా రోజుల ముందే ఖరారు అయినప్పటికీ హఠాత్తుగా వచ్చిన  కాశ్మీర్ విభజనతో వేగవంతంగా  మారిన పరిణామాలు జగన్ కి ఢిల్లీలో కేంద్ర పెద్దలను కలిసే అవకాశాన్ని ఇవ్వడంలేదంటున్నారు. దీనికి తోడు కేంద్ర మాజీ మంత్రి సుష్మా స్వరాజ్ ఆకస్మికంగా మరణించడంతో కేంద్ర మంత్రులు ఎవరూ అందుబాటులో లేరు.



ఈ నేపధ్యంలో జగన్ ఢిల్లీ టూర్ మరో రోజు పొడిగించుకున్నారు. ఆయన నిన్నా ఇవాళా కలసి ప్రధాని మోడీని, రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతులను కలిసారు. ఆలాగే ఇద్దరు కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, నిర్మలా సీతారామన్లను కలిశారు.  ఇక జగన్ కలవాల్సిన కేంద్ర మంత్రులు ఉన్నారు. అందరి కంటే ముఖ్యమైన వ్యక్తి అమిత్ షా ఉండనే ఉన్నారు. దాంతో జగన్ ఢిల్లీలో మరో రోజు ఉంటారట. అమిత్ షాతోనే జగన్ అసలైన భేటీ అంటున్నారు. ఆయన్ని కలవకుండా జగన్ వెళ్తే ఆ ఢిల్లీ టూర్   వ్రుధాయే అన్న మాట కూడా వినిపిస్తోంది.


షాతో తేల్చుకోవాల్సినవి  చాలానే ఉన్నాయని అంటున్నారు. అమిత్ షాతో జగన్ మాట్లాడేవి హోం మంత్రిగా విభజన సమస్యలపైన ఉంటాయి. ఇక అసలైన విషయాలు బీజేపీ జాతీయ అధ్యక్ష్దుడిగా కూడా ఉన్న షాతో ఏపీ రాజకీయాల మీద మాట్లాడుతారట. ఈ సందర్భంగా జగన్ ఓపెనప్ అవుతారని అంటున్నారు. ఓ విధంగా జగన్ మనసు విప్పి షాతో అన్ని విషయాలు పంచుకుంటారని చెబుతున్నారు. తాము కేంద్రంతో ఎంత సఖ్యతగా ఉన్నదీ వివరిస్తారట. కీలకమైన బిల్లుల విషయంలో వైసీపీ ఎంతగానో సహకరిస్తోందని కూడా జగన్ గుర్తు చేయనున్నారట.


అదే విధంగా బీజేపీతో కూడా మంచి స్నేహపూర్వకమైన సంబంధాలను కొనసాగించాలని జగన్ అనుకుంటున్నట్లుగా షాకు తెలియచేస్తారట. అయితే ఏపీలో మాత్రం బీజేపీ నేతలు తెల్లారి లేస్తే వైసీపీని, తనను టార్గెట్ చేస్తున్నారని, పెద్ద గొంతు చేసుకుని విమర్శలు చేస్తున్నారని జగన్ ఫిర్యాదు చేస్తారని తెలుస్తోంది. తనను, వైసీపీని బీజేపీ నేతలు తిడితే అది అంతిమంగా చంద్రబాబుకు, టీడీపీకే లాభిస్తుందని జగన్ అమిత్ షాకు చెప్పబోతున్నారట. 


నిన్నటి ఎన్నికల్లో దారుణంగా ఓడించి పడుక్కోబెట్టిన టీడీపీని మళ్ళీ బతికించాలనుకుంటున్నారా అని జగన్ అమిత్ షానే సూటిగా అడుగుతారని అంటున్నారు. తన వైపు నుంచి ఎటువంటి  ఇబ్బంది లేని స్నేహం అందిస్తానని, అదే సమయంలో ఏపీలోని బీజేపీ నేతలను కంట్రోల్ చేయకపోతే చివరికి జాతీయస్థాయిలో  బీజేపీకి కూడా అది ముప్పే అవుతుందని జగన్ చెప్పబోతున్నారుట. మరి షా ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: