ఏడు పదుల వయసుకి సమీపంలో వచ్చినా కొన్ని సందర్భాల్లో చంద్రబాబు వెనక్కి తగ్గరు.

ఆయనంటే గిట్టని వారు అంతా ప్రచార జిమ్మిక్కులంటూ కొట్టిపారేయ వచ్చు గానీ ప్రకృతి విపత్తుల సమయాన స్పందించే విషయంలో ఆయన సిద్ధహస్తుడిగా చెప్పవచ్చు. దానికి అనేక ఉదాహరణలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం ఏపీ సర్కారులో యువ మంత్రులు ఎక్కువగా ఉన్నారు. పైగా వేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నట్టు కనిపిస్తారు. కానీ తాజాగా గోదావరి వరద బాధితులను ఆదుకోవడంలో నాన్చుడు ధోరణి అవలంభించారు.


రెండో ప్రమాద హెచ్చరిక స్థాయిని దాటి వరద నీరు పారుతుంటే పట్టనట్టే ఉన్నారు. పైగా , చంద్రబాబు ప్రభుత్వం అనాలోచితంగా పోలవరం కాఫర్‌ డ్యాం నిర్మించిందని నీటి పారుదల శాఖ మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌ ఆవేశ పడి పోతున్నారు. కాఫర్‌ డ్యాం వల్లే దేవిపట్నంకు వరద ముప్పు ఏర్పడిందని, అంటారు కానీ, అపార నష్టం ఎదుర్కొంటున్న మన్యం వాసుల పట్ల మానవత్వం చూపి ఆదుకుంటున్న జాడ కనిపించడం లేదు.


ఇదే పరిస్థితి బాబు కాలంలో ఉన్నప్పుడు నేరుగా సీఎం రంగంలో దిగేవారు. అధికారులతో సమీక్షలు కొంత చికాకుగా కలిగించేలా సాగినా చివరకు అధికారులు ఉరుకులు పరుగులు పెట్టించేవారు. శ్రీకాకుళం జిల్లాలో వరదలు వచ్చినపుడు అక్కడే టెంట్‌ వేసుకొన్ని ఉండి అధికారులతో పని చేయించిన విషయం అందరికీ తెలిసిందే. ఫలితంగా బాధితులకు ఏదో మేరకు ఫలితం దక్కేది.ఈసారి దానికి భిన్నంగా పరిస్థితి ఉండడంతో మూడు నెలల క్రితం వైసీపీపై నమ్మకంతో ఎంతో ఆశించి ఓట్లేసిన ఓటర్లే ఇప్పుడు వరద బాధితులుగా ఆగ్రహంతో కనిపిస్తున్నారు. ఇకపై పాలకులు మాత్రం ఈ విషయంలో బాబు నుంచి నేర్చుకుంటే మంచిదేమో...


ఏజెన్సీలో పొంగుతున్న వాగులు ;

వాయుగుండం ప్రభావంతో విశాఖ ఏజెన్సీలో వాగులు, గెడ్డలు పొంగి ప్రవహిస్తున్నాయి. భారీవర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి. వరద నీటితో పంట పొలాలు చెరువుల్లా మారాయి. పెదబయలు, ముంచంగిపుట్టు మండలాల్లో చాలా గిరిజన గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. పాడేరు, హుకుంపేట, జి.మాడుగుల మండలాల్లోని మత్స్యగెడ్డ తీవ్రంగా ప్రవహిస్తోంది.పాడేరు మండలం బొక్కెళ్లు-లింగాపుట్టు మధ్యలో, పాడేరు నుంచి అరకులోయ మెయిన్‌రోడ్డు, హుకుంపేట సమీపంలో రోడ్ల పైనుంచి వరద నీరు ప్రవహించడంతో వాహనాల రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడ్డాయి. డుంబ్రిగుడ మండలంలో చాపరాయి హోరుగా ప్రవహిస్తోంది. చింతపల్లి, జీకే వీధి, కొయ్యూరు మండలాల్లోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి కానీ, ప్రభుత్వం నుండి సహాయం అందడం లేదని అక్కడి ప్రజలంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: