పాకిస్థాన్. మహమ్మద్ ఆలీ జిల్లా అనే అపర మేధావి బుర్రలో పుట్టిన కల్పిత ద్విజాతి సిధ్ధాంతానికి ఫలితం. పాకిస్తాన్ ఏర్పడి ఈ ఆగస్ట్ 14కి 72 ఏళ్ళు పూర్తి అవుతాయి. కానీ ఇంకా ఓ దేశంగా మాత్రం రూపుదిద్దుకోలేదు. ఈ మాట ఎందుకంటే ప్రపంచంలో ఎక్కడా మనిషి కులం, మతం, వర్గం , వర్ణం మీద ఆధారపడి మనుగడ సాగించలేడు, అలాంటిది మత భావాలను జనంలో నిండుగా నింపి ఒక దేశంగా ఉన్నాను అనిపించుకుంటున్నా పాకిస్థాన్ కి ఇప్పటికి చేదు అనుభవాలు తప్పడంలేదు, పైగా భారత దేశ  విభజన అసంబద్ధంగా సాగిందన్నది మేధావుల  భావన. అటూ ఇటూ అధికార లాలస కలిగిన వారు తొందరపడిన ఫలితమే పాక్ ఏర్పాటు.


ఇవన్నీ ఇలా ఉంచితే తన తప్పులను గుర్తించకుండా ఎప్పటికపుడు  జనాన్ని మభ్యపెడుతూ వస్తున్న పాక్ కాశ్మీర్ ని రావణకాష్టంగా మార్చి అందులో చలి కాచుకుంటోంది. దాంతో ఉగ్ర మూకలను రెచ్చగొట్టి భారత్ లో అశాంతి రేపి తన శాడిజాన్ని అలా వెళ్ళగక్కుతోంది. 72 ఏళ్ళ పాటు పాక్ ఎలా ఆడినా చెల్లింది. ఇపుడు వచ్చాడు మొనగాడు. ఆయనే మోడీ. పాక్ ఆటలు ఇక చెల్లవంటూ గట్టి హెచ్చరికలు చేస్తూనే కాశ్మీర్ విభజనతో అతి పెద్ద షాక్ ట్రీట్మెంట్ ఇచ్చేశారు.


మోడీ దూకుడుతో ఇపుడు పాక్ బెంబేలెత్తుతోంది. నిండు పార్లమెంట్ లో హోం మంత్రి అమిత్ షా కాశ్మీర్ అంటే అందులో ఆక్రమిత కాశ్మీర్ కూడా వస్తుందని విస్పష్టంగా చెప్పడంతో పాక్ గుండెల్లో రైళ్ళు పరిగెడుతున్నాయి. బెలూచిస్తాన్ ప్రజలు తనకు సొంత దేశం కావాలని కోరుతుంటే వారిని అణచిపెట్టి అక్కడ ఉక్కుపాదంతో పాలన చేస్తున్న పాక్ కి కాశ్మీర్ విషయం అనవరసం, అది భారత్ లో అంతర్భాగం. అది మన సమస్య. మనం పరిష్కరించుకున్నాం. కానీ పాక్ కి కలవరం, కంపరం  ఎందుకు.


ఎందుకంటే మోడీ ఇదే దూకుడుతో రేపు ఆక్రమిత కాశ్మీర్ ని కైవశం చేసుకుంటారని, అంతే కాదు, బెలూచిస్థాన్ కి విముక్తి ప్రకటిస్తారని, పాక్ ఆగడాలకు శాశ్వతంగా కళ్ళెం వేశారని. ఇవన్నీ ఇవాళ కాకపోయినా రేపు అయినా జరగవచ్చు. కానీ పాక్ ఒకటే హైరానా పడిపోతోంది. అందుకే లేని పోని అతి చేస్తూ భారత్ మీద విషం కక్కుతోంది. తన తప్పులను భారత్ మీద నిందలుగా మారుస్తోంది.


భారత్ తో ద్వైపాక్షిక సంబంధాలు రద్దుట, భారత్ రాయ‌బారిని వెనక్కి పంపుతారుట. ఐక్య రాజ్య సమితిలో ఫిర్యాదు చేస్తారుట. ఇలాంటి తీర్మానాలు చేస్తూ పాక్ పాలకులు తమను తాము వంచించుకుంటూ అటు పాక్ ప్రజలను,  ఇటు కాశ్మీర్ వేర్పాటువాదులను మభ్యపెడుతున్నారు. అయినా ఇపుడొకటి అందరికీ అర్ధమైపోయింది. పాక్ తోక ముడిచేసిందని, నిలువెల్లా వణుకుతూ పైకి మాత్రం గట్టిగా మాట్లాడుతుందని, మోడీకి ఎపుడు ఏం చేయాలో తెలుసు. మరిన్ని షాక్ ట్రీట్మెంట్లను భరించేందుకు  పాక్ రెడీ అయిపోవడమే  ఇక మిగిలింది.


మరింత సమాచారం తెలుసుకోండి: