అనుకున్న‌ది ఒక్క‌టి.. అయింది మ‌రొక్క‌టి.. అన్న‌ట్టుగా ఉంది. ఏపీ టీడీపీ ప‌రిస్థితి. ముఖ్యంగా కీల‌క‌మైన న‌గ‌రాల్లో పార్టీ ప‌రిస్థితి అగ‌మ్య‌గోచ‌రంగా త‌మారైంది. ఎక్క‌డి క‌క్క‌డ పార్టీని బ‌ల‌ప‌రిచేవారు కాకుండా.. న‌డిపించే వారు కూడా క‌నిపించ‌డం లేదు. అత్యంత కీల‌క‌మైన విజ‌య‌వాడ న‌గ‌రంలో ఉన్న మూడు నియోజ‌క‌వ‌ర్గాల్లో కేవ‌లం ఒక్క‌ తూర్పులోనే విజ‌యం సాధించిన టీడీపీ.. సెంట్ర‌ల్ నియోజ‌క‌వ‌ర్గంలో 25 ఓట్ల తేడాతో ఓట‌మిపాలైంది. అదే స‌మయంలో ప‌శ్చిమంలో ఏకంగా 4 వేల పైచిలుకు ఓట్ల‌తేడాతో ఘోర ప‌రాజ‌యాన్ని మూట‌గ‌ట్టుకుంది. 


అయితే, ఇప్పుడు మిగిలిన రెండు నియోజ‌క‌వ‌ర్గాల క‌న్నా కూడా ప‌శ్చిమంలో ఇక టీడీపీ బ‌తికి బ‌ట్ట‌క‌ట్టే ప‌రిస్థితి క‌నిపించ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. ఇక్క‌డ నుంచి టీడీపీ ఇప్ప‌టి వ‌ర‌కు ఒక్క 1983లో మిన‌హా ఎప్పుడూ విజ‌యం సాధించ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. చాలాసార్లు కమ్యూనిస్టులు, ఆ తర్వాత కాంగ్రెస్ తరపున జలీల్ ఖాన్ విజయం సాధించారు. ఒకసారి 2009లో ఇక్కడ ప్రజారాజ్యం పార్టీ కూడా విజయం సాధించింది. ఇక, 2014 ఎన్నికల్లో వైసీపీ తరఫున పోటీ చేసిన మైనార్టీ నేత జ‌లీల్ ఖాన్ (బీకాంలో ఫిజిక్స్) విజయం సాధించారు. అదే సమయంలో తాజాగా జరిగిన ఎన్నికల్లో వైసీపీ తరఫున మాజీ ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాస్ పోటీ చేసి విజయం సాధించారు. 


టిడిపి తరఫున తొలుత ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్నకు ఇస్తారని ప్రచారం జరిగింది. ఈ క్రమంలో ఆయన ఎన్నికల ప్రచారానికి నిధులు కూడా రెడీ చేసుకున్నారు. అయితే, రెండు నెలల ముందుగానే ఇక్కడ వైసీపీ నుంచి విజయం సాధించిన జలీల్ ఖాన్ కుమార్తె ఖ‌తూన్‌కు టికెట్ ఖరారైంది. దీంతో తాజాగా జరిగిన ఎన్నికల్లో జలీల్ కుమార్తె ఖ‌తూన్ టీడీపీ టికెట్‌పై పశ్చిమ నుంచి పోటీకి దిగారు. ఆమెకు విజయవాడ ఎంపీ కేశినేని నాని అండగా ప్రచారం కూడా నిర్వహించారు. అయితే ఇక్కడి ప్రజలు మాత్రం వెలంపల్లి గెలిపించారు. దీంతో అమెరికా నుంచి వచ్చి ఇక్కడ పోటీ చేసిన ఖ‌తూన్‌ ఎన్నికల ఫలితాలు వెలువడిన తక్షణమే ఫ్లైట్ ఎక్కేసింది. 


మరోపక్క, జలీల్ ఖాన్ అనారోగ్య కారణాలతో ఇంటికే పరిమితమయ్యారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఇక్కడ టిడిపి పుంజుకుంటుందా ? అనే ప్రశ్న తెరమీదకు వచ్చింది. అయితే, టిడిపి ఇక్కడ నాయకులు లేర‌ని అనుకుంటే పొరపాటే. కావాల్సినంత మంది నాయకులు ఉన్నారు. వీరిలో ప్రధానంగా బుద్ధా వెంకన్న, మైనార్టీ వర్గానికి చెందిన నాగుల్ మీరా వంటి వారు ఉన్నారు. అయితే వీరికి ప్రజల్లో పెద్దగా ఫాలోయింగ్ లేకపోవడమే పార్టీకి శాపంగా మారింది.


గ‌తంలో ఇక్క‌డ ఓ సారి టీడీపీ నుంచి పోటీ చేసిన నాగుల్ మీరా ఓటమి పాలయ్యారు. ఇక, ఇప్పుడు వీరిలో వర్గ‌ విభేదాలు చోటు చేసుకొన్నాయి. ఇటీవల ఎంపీ కేశినేని నానికి, ఎమ్మెల్సీ  బుద్ధా వెంక‌న్న‌కు ట్విట్టర్ వేదికగా పెద్ద ఎత్తున యుద్ధం చోటు చేసుకుంది. దీంతో పశ్చిమ నియోజకవర్గానికి చెందిన నాగుల్ మీరా కేశినేనితో జత కట్టారు. ఈ పరిణామంతో వెంకన్న వెనక్కి తగ్గినా.. భవిష్యత్తులో నాగుల్ మీరాకు టికెట్ ఇస్తే అయిన ఓటమికి పరోక్షంగా కృషి చేసే అవకాశం లేక పోలేదని అంటున్నారు. విశ్లేషకులు. ఎలా విజయవాడలోని పశ్చిమలో టిడిపి పరిస్థితి దినదిన గండంగా సాగుతోంది. ప్రజలను ఆకట్టుకునే నేత కానీ, ప్రజల తరపున పోరాడే నాయకుడు కానీ లేక పోవడంతో పార్టీ ఇక ఈ నియోజకవర్గంపై ఆశ‌లు వ‌దులుకున్న‌ట్టేనా ? అని చ‌ర్చ జ‌రుగుతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: