అవును చంద్రబాబునాయుడు చెప్పినట్లుగా ప్రజలే తప్పు చేశారు. చంద్రబాబు లెక్క ప్రకారం వైసిపిని అధికారంలోకి తీసుకొచ్చి ప్రజలు తప్పు చేశారట. కానీ టిడిపి తరపున గెలవటానికి 23 మందికి ఓట్లేసి తప్పు చేశామని జనాలు కూడా అనుకుంటే అప్పుడు చంద్రబాబు పరిస్ధితేంటి ? పాలిచ్చే ఆవును ఓడగొట్టి  వైసిపికి ఓట్లేసి గెలిపించి జనాలు తప్పు చేశారని నిసిగ్గుగా చంద్రబాబు అంటున్నారంటే ఆశ్చర్యంగా ఉంది.

 

ఐదేళ్ళ పాలనలో తాను చేసిన తప్పు ఏమిటో గుర్తించకుండా, ఒప్పుకోకుండా ఇంకా జనాలనే తప్పు పడుతుండటమే విచిత్రంగా ఉంది. ఐదేళ్ళ పాలన మొత్తం అవినీతి మయమైపోయిందని పార్టీ నేతలు బాహాటంగా చెప్పుకుంటున్నది చంద్రబాబుకు వినబడలేదా ? చింతమనేని ప్రభాకర్ లాంటి ఎంఎల్ఏలు, కొందరు నేతలు అధికారాన్ని అడ్డంపెట్టుకుని చేసిన అరాచకాలు చంద్రబాబుకు గుర్తులేదేమో.

 

ఐదేళ్ళ పాలనలో సర్వ వ్యవస్ధలను భ్రష్టు పట్టించిన చంద్రబాబు సిఎంగా తానేం తప్పు చేశానో తెలియటం లేదని అమాయకంగా ప్రశ్నిస్తే నమ్మేవాళ్ళు ఎవరూ లేరని గుర్తించాలి. చంద్రబాబు నటనను పక్కనపెట్టి నిజాయితీగా చేసిన తప్పులను ఒప్పుకుంటే జనాలకు ఎందుకు దూరమయ్యోమనే విషయంలో సమీక్షలు చేసుకుంటేనే పార్టీకి భవిష్యత్తుంటుందన్న విషయం తెలుసుకోవాలి.

 

సమీక్షలంటే తాను మాట్లాడితే మిగిలిన వాళ్ళు వినటమనే కాన్సెప్ట్ నుండి ముందు చంద్రబాబు బయటపడాలి. ఓటమికి నిజమైన కారణాలేంటో చంద్రబాబు తెలుసుకోవాలని అనుకుంటే పార్టీలో అట్టడుగున్న ఉండే కార్యకర్తలను వేదిక మీదకు పిలిపించి మాట్లాడే అవకాశం ఇవ్వాలి. అంటే కార్యకర్తలు మాట్లాడితే చంద్రబాబు వినటం అలవాటు చేసుకోవాలి. అప్పుడే వాస్తవాలు బయటపడతాయి.

 

మొన్నటి వరకూ జరిగిన సమీక్షల్లో  పార్టీ  ఓటమికి కారణాలను కొందరు నేతలు చెప్పినా చంద్రబాబు అంగీకరించకుండా తన ధోరణిలోనే తాను మాట్లాడుతున్నారు. అంటే వాస్తవాలను అంగీకరించేందుకు చంద్రబాబు సిద్దంగా లేరని అర్ధమైపోతోంది. కాబట్టి సమక్షల పేరుతో చంద్రబాబు ఎన్ని కథలు మాట్లాడినా జనాలు నమ్మేందుకు ఎవరూ సిద్ధంగా లేరని తెలుసుకోవాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: