ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వం యొక్క పథకాల్ని నేరుగా ప్రజలకు చేరవేయటం కోసం ప్రభుత్వం గ్రామ వాలంటీర్ల నియామకం చేపట్టిన విషయం తెలిసిందే. జులై 5వ తేదీ వరకు గ్రామ వాలంటీర్లు, జులై 10 వ తేదీ వరకు వార్డ్ వాలంటీర్ల కొరకు ప్రభుత్వం ధరఖాస్తులు స్వీకరించింది. జులై 11వ తేదీ నుండి 25వ తేదీ వరకు ధరఖాస్తు చేసిన అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించారు అధికారులు. ఆగష్ట్ 1 వ తేదీన ఎంపికయిన గ్రామ/వార్డ్ వాలంటీర్ల మెరిట్ జాబితా విడుదలయింది. 
 
ప్రస్తుతం గ్రామ/వార్డ్ వాలంటీర్లకు శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నారు అధికారులు. గ్రామ/వార్డ్ వాలంటీర్లుగా ఎంపికయిన వారు ఆగష్ట్ 15 వ తేదీ నుండి వారికి కేటాయించిన 50 ఇళ్ళకు విధులు నిర్వహించబోతున్నారు. ఈ గ్రామ/ వార్డ్ వాలంటీర్లలో కొన్నిచోట్ల విద్యార్థులు, ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు ఎంపికయ్యారు. ఇలా కాలేజీలకు వెళ్ళి చదువుకునే విద్యార్థులను గ్రామ/వార్డ్ వాలంటీర్లుగా నియమించవద్దని ఒకవేళ నియమించి ఉంటే తొలగించాలని అధికారుల్ని పంచాయితీ రాజ్ శాఖ కమిషనర్ గిరిజా శంకర్ ఆదేశించారు. 
 
ప్రైవేట్ ఉద్యోగాల్లో పని చేస్తూ గ్రామ వాలంటీర్లుగా ఎంపికయిన వారు కూడా ఎవరైనా ఉంటే వారిని కూడా తొలగించాలని అధికారులకు పంచాయితీ రాజ్ శాఖ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేసారు. విద్యార్థులు, ప్రైవేట్ ఉద్యోగాలు చేసేవారు విధులు నిర్వర్తించడంలో ఆలసత్వం వహించే అవకాశం ఉందని అందుకే తొలగించాలని ఆదేశాలు జారీ చేసారు. 1,76,720 మందికి ఇప్పటికే గ్రామ వాలంటీర్ల నియామక ఉత్తర్వులు జారీ చేసారని తెలుస్తుంది. 
 
గ్రామ వాలంటీర్లు మొత్తం 31 రకాల సేవలు ప్రజలకు అందించాల్సి ఉంటుంది. పేదలకు బియ్యం, ధృవ పత్రాలు, ప్రభుత్వ పథకాలు గ్రామ వాలంటీర్లు నేరుగా ప్రజల ఇంటివద్దకే చేరవేయాల్సి ఉంటుంది. ప్రభుత్వం గ్రామ వాలంటీర్లకు ప్రతి నెల 5000 రుపాయలు గౌరవ వేతనంగా ఇస్తుంది. 
 
 



మరింత సమాచారం తెలుసుకోండి: