అనంతపురం జిల్లాలోని కియా కార్ల పరిశ్రమ నుంచి కార్ల ఉత్పత్తి ప్రారంభమైంది. ఈ కార్యక్రమాన్ని వైసీపీ మంత్రులు ప్రారంభించారు. ఈ నేపథ్యంలో ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తే.. కియా కార్ల ఫ్యాక్టరీ విషయంలో తెలుగుదేశం సర్కారు హయాంలో చాలా హడావిడి జరిగింది. కియా సంస్థతో ఒప్పందం కుదిరిన నాటి నుంచి ప్రతి సారీ ఆ వార్త పతాకశీర్షికల కెక్కేది.


కియా రాకతో అనంతపురం జిల్లా రూపు రేఖలు మారిపోయాయని తెలుగుదేశం అనుకూల మీడియాలో కథనాలు వెళ్లువెత్తాయి. కియా పరిశ్రమకు భూమి కేటాయింపు దగ్గరనుంచి.. ఆ పరిశ్రమ ప్రారంభం వరకూ తెలుగుదేశం సర్కారు చాలా హడావిడి చేసింది. అక్కడ ఒక్క కారు తయారు కాకపోయినా.. తొలి మోడల్ విడుదల అంటూ చంద్రబాబు సర్కారు ఓ భారీ కార్యక్రమం నిర్వహించింది. ఆ కార్యక్రమాన్ని తెలుగు మీడియా అంతా లైవ్ కార్యక్రమాలతో ఊదరగొట్టింది.


మరి ఇప్పుడు సీన్ పూర్తిగా తిరగబడింది.. వాస్తవంగా కారు ఇప్పుడు మార్కెట్లోకి వస్తుంటే కూడా చంద్రబాబుకు ఆ కార్యక్రమానికి ఆహ్వానం లేదు. ఓవైపు వైసీపీ మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, శంకరనారాయణ, ఏపీఐఐసీ ఛైర్ పర్సన్ రోజా కార్ల ప్రారంభం కార్యక్రమంలో పాల్గొంటే... మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రం సాదాసీదాగా గుంటూరులోని పార్టీ ఆఫీసులో కార్యకర్తల మీటింగులో ఉండిపోయారు.


పాపం ఆయన ప్రాణం ఊరుకోదుకదా.. అందుకే అక్కడి నుంచే కియా కారుకు బెస్ట్ విషెష్ చెప్పేశారు. మేడిన్ ఆంధ్రా అని పిలువబడే కియా మొదటి కార్ ఈరోజు విడుదల చేయడాన్ని మస్ఫూర్తిగా అభినందిస్తున్నానని చంద్రబాబు అన్నారు. ఆటో మొబైల్ రంగంలో లో కియా ఒక కొత్త ట్రెండ్ తీసుకురావాలని ఆకాక్షించారు. కియా సంస్థ యాజమాన్యానికి చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. గుంటూరు పార్టీ కార్యాలయంలో తనను కలుసుకున్న కార్యకర్తల వద్ద కియాను ఉద్దేశించి చంద్రబాబు మాట్లాడారు.


మరింత సమాచారం తెలుసుకోండి: