రాష్ట్రం ప్రగతి పథంలో దూసుకుపోవాలి.. నిజమే.. కానీ ఈ ప్రగతి పథానికి కొలమానం ఏంటి.. అభివృద్ధి చెందాల్సిందేమిటి.. వ్యవసాయమా.. పరిశ్రమలా.. మౌలిక సదుపాయాలా.. ఏంటి.. ఇలా ఆలోచిస్తే.. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ కనీస ఆహారం. విద్య, వైద్య, ఆరోగ్యం వంటి సదుపాయాలు కలిగి ఉండాలి..లేకపోతే ప్రభుత్వం కల్పించాలి.


కానీ వాస్తవికంగా ఏం జరుగుతుంది. అందరికీ అన్ని సదుపాయాలు అందుతున్నాయా.. ప్రత్యేకించి అభివృద్ధికి ఆమడ దూరంలో నిలచే గిరిజనులకు కనీస సదుపాయాలు లభిస్తున్నాయా.. అంటే లేదనే సమాధానం వస్తోంది. ఏపీ విషయానికి వస్తే.. కొండ ప్రాంతాలైన ఉత్తరాంధ్ర జిల్లాల్లో గిరిజనులు చాలా ఎక్కువ.


శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో.. కనీసం రహదారి సదుపాయం కూడా లేని పల్లెలెన్నో.. ఏ జబ్బు చేసినా.. నడవలేని పరిస్థితుల్లో ఉంటే... డోలీ కట్టి సమీపంలోని ఆసుపత్రికి ఓ నలుగురు మనుషులు మోసుకురావాల్సిందే. ఇలాంటి పరిస్థితుల్లో గిరిజనులకు వైద్య సేవలందించే అంశంపై జగన్ ప్రభుత్వ కీలకమైన నిర్ణయం తీసుకుంది.


గిరిజన ప్రాంతమైన విశాఖ పట్నం జిల్లా పాడేరులో గిరిజన వైద్య కళాశాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. గిరిజనులకు మెరుగైన వైద్య సేవలందించేందుకు ఈ వైద్య కళాశాలను ఏర్పాటు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతానికి పాడేరు ఏరియా ఆస్పత్రిలోనే ట్రైబల్ మెడికల్ కాలేజీని ఏర్పాటు చేస్తారు. ఈ కళాశాలకు డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గిరిజన వైద్యశాలగా నామకరణం చేశారు. ఈ మేరకు జీవో విడుదల చేశారు.


ఈ నిర్ణయం నిజంగా మెచ్చుకోదగినదే.. ఈ ఒక్క వైద్య కళాశాల ఏర్పాటుతోనే గిరిజన పల్లెల్లో స్థితిగతులు మారిపోకపోవచ్చు.. కానీ ఆ దిశగా ఓ అడుగు అంటూ పడినట్టే చెప్పుకోవాలి. ఈ ట్రైబల్ మెడికల్ కాలేజ్ కేంద్రంగా ఉత్తరాంధ్ర కొండ ప్రాంతాలకు వైద్యసేవలు కొనసాగాలి. ఇది ఓ వైద్య రాజధానిగా మారాలి. అందుకు ప్రభుత్వాలు చొరవ తీసుకోవాలి. సమాజంలో గిరిజనులకూ మనతో పాటు కనీసం విద్య, వైద్యం, ఆహారం అందే రోజులు రావాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: