నీటి వనరుల్ని సరైన రీతిలో ఉపయోగించుకోలేక పోవడం వల్ల మన దేశంలో దాదాపు రెండు లక్షల గ్రామాలు దారుణమైన కరవును ఎదుర్కొంటున్నాయి. ఇలాంటి పల్లెలు ఆంధ్రప్రదేశ్‌ తూరుపు కనుమల్లో వందలాది కనిపిస్తాయి. పంచభూతాల్లో ఒకటైన నీటిని వృధా కానివ్వకుండా ,కొండకోనల్లో నుండి ఇంటి ముంగిటకు తెచ్చుకున్న ఆదివాసీల అరుదైన విజయ గాథ ఇది.
కొండ మీద ఏడాది పొడవునా పారే ఊటనీటితో గ్రామ ప్రజల గొంతు తడిపారు.


ప్రకృతితో జీవనం సాగించే వీరు ప్రకృతి వనరులను ఎలా కాపాడుకుంటున్నారో చూడాలంటే, విశాఖ నుండి పాడేరు వైపు దాదాపు 180 కిలోమీటర్లు వెళ్లి, అడవి బాటలో మూడు కిలో మీటర్లు నడవాలి. అక్కడి, గత్తుం,హుకుం పేట, జంగం పుట్టు గ్రామాలు పక్కపక్కనే ఉంటాయి. సముద్రమట్టానికి 900 మీటర్లు దాటిన ఎత్తయిన కొండ ప్రాంతాలివి. నిత్యం విపరీతమైన గాలుల మధ్య ఊగుతున్న సిల్వర్‌ ఓక్‌ చెట్ల లాగా బతికేయడం ఇక్కడి ప్రజలకు అలవాటైన జీవితం. కేవలం వర్షపు నీరు తప్ప ఆ గిరిజనులకు వేరే నీటివసతి లేదు. కొండవాలులోని ఊటనీటి కుంటలే వీరికి జీవజలం. ప్రతీరోజు నీళ్ల కోసం బిందెలు పట్టుకొని, ఐదు కిలోమీటర్లు కొండ మీదికి వెళ్లి తెచ్చుకోవాలి. మధ్యలో ఎలుగుబంట్లు,విష సర్పాల నుండి తమను కాపాడుకుంటూ,ఆదివాసీలు ఊట నీటిని తెచ్చుకునేవారు.


శ్రమ దానంతో సాధించారు
ఇలా ఎంత కాలం కష్టాలు పడాలని, మూడు వందల కుటుంబాలు చేతులు కలిపి, తాగునీటి సమస్యకు పరిష్కారం కనుగొన్నారు. కొండవాలులోని ఊటనీటిని పైప్‌ లైన్‌ ద్వారా గ్రామాలకు చేరువ చేయడంలో వారికి, విశాఖలోని రామకృష్ణమిషన్‌ ఆర్థిక తోడ్పాటు నివ్వగా శ్రమదానంతో ఊరి మధ్య నీటినిలువ ట్యాంకర్‌లు ఏర్పాటు చేసుకొని అవసరమైనన్ని నీళ్లు పట్టుకుంటున్నారు. దీంతో గిరిజన మహిళలకు దూర ప్రాంతాల నుండి నీటిని మోసుకునే సమస్యలు తగ్గాయి. ప్రతి కుటుంబం స్వచ్ఛ జలం తాగుతూ, రోగాల నుండి విముక్తి పొందారు.

కొండ మీద నుండి నీటినెలా తెచ్చారు ?;
ఆ గ్రామాలకు తాగునీటికోసం పైపు లైను వేయటంతోనే ఆగిపోలేదు రామకృష్ణ మిషన్‌ వారు. కొండవాలులో పుట్టిన ఊటనీరు ప్రజలకు అందించడంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఆ నీటిని వడకట్టడానికి కొండల దగ్గర తొట్టెలు నిర్మించి, శాస్త్రీయమైన వాటర్‌ ఫిల్టర్‌లను ఏర్పాటు చేశారు. దీనివల్ల ఊటనీరు మూడు సార్లు వడగట్టిన తరువాత కింది గ్రామాలకు చేరుతాయి. వాటర్‌ ఫిల్టర్‌ వాడకం, పైప్‌లైన్లలో లీకేజ్‌లు లేకుండా నిరంతరం పరిరక్షించడానికి గిరిజన యువకులకు సాంకేతిక శిక్షణ కూడా ఇచ్చారు.


కష్టాల నుండి బయట పడ్డాం ;
''గతంలో మంచినీళ్ళకోసం మైళ్ల దూరం నడిచి కొండమీదకు వెళ్ళి రావాల్సి వచ్చేది. వృద్ధులు, గర్భిణీ స్త్రీలు నీళ్ళు తెచ్చుకోలేక అవస్తలు పడేవాళ్ళు.ఇపుడు కొండల మీద నీటిని ఇంటిముందుకు తెచ్చారు. రోగాలు తగ్గాయి.'' అని , జంగం పుట్టు కు చెందిన స్వాతి సంతోషంగా మాతో చెప్పారు.
ఇంటిముందే తాగునీరు ;
''ప్రొద్దున్న లేచింది మొదలు నీళ్ళకోసం కొండమీదికి పోవాల్సి వచ్చేది. వానాకాలంలో కాలిబాట బురదమయమై చాలా ఇబ్బందులు పడేవాళ్లం. చంటిపిల్లలను చూసేవారు లేక వాళ్లని ఎత్తుకునే బిందెలను మోసుకుంటూ వచ్చే వాళ్లం.ఈ అవస్థలు నుండి బయట పడ్డాం.తాగునీటి కోసం మేం పడుతున్న కష్టాలు చూసి రామకృష్ణ మిషన్‌ వారు కొండమీది ఊటనీటిని మా గ్రామానికి రప్పించి ఎంతో మేలు చేశారు.'' అని గతాన్ని గుర్తు చేశారు హుకుం పేటకు చెందిన, రత్నకుమారి, దేవుడమ్మ.

సరే , ఒక సేవాసంస్ధ తమకున్న పరిమిత వనరులతో ఈ గ్రామాల సమస్య తీర్చింది. మరి మిగతా గ్రామాల పరిస్ధితి ఏమిటి? అధికారులు ఏమంటున్నారో కూడా తెలుసుకునే ప్రయత్నం చేశాం. పాడేరు సమగ్ర గిరిజనాభివృద్ది 'ఐటీడిఏ' అధికారులను ఫోన్‌లో సంప్రదించి, నీళ్లు,రహదారులు లేని ఇలాంటి గ్రామాలు వందలాది ఉన్నాయి వారి సమస్యలకు ఎలా తీరుస్తారని అని ప్రశ్నించగా, మంచినీటి పైపులైన్లు, రహదారులు , కోసం సర్వే జరుగుతుంది, ఆ రిపోర్టు వచ్చాక పనులు చేపడతామని సమాధానం ఇచ్చారు.
( ఫొటోలు, శ్యాంమోహన్‌ , 9440595858 )


మరింత సమాచారం తెలుసుకోండి: