తెలంగాణకు చెందిన మరొక కీలక నేత బీజేపీ లో చేరారు .  లోక్ సభ ఎన్నికలకు ముందు  టీఆరెస్ కు గుడ్ బై చెప్పిన పెద్దపల్లి మాజీ ఎంపీ వివేక్ వెంకట స్వామి బిజెపిలో చేరారు . లోక్ సభ  ఎన్నికల్లో టిఆర్ఎస్ తరఫున పెద్దపల్లి టికెట్ ను అయన  ఆశించారు . అయితే వివేక్ ను  కాదని టీఆస్ అధినేత కేసీఆర్ వెంకటేష్ నేతగానికి టికెట్ కేటాయించారు . దీనితో పార్టీ నాయకత్వం తో విభేదించిన వివేక్ , ప్రభుత్వ సలహాదారు పదవి కి రాజీనామా చేశారు .  టీఆరెస్ ను వీడిన తర్వాత  వివేక్  బిజెపిలో చేరుతారనే  ఊహాగానాలు గత కొద్దికాలంగా విన్పిస్తున్న  విషయం తెలిసిందే. 


బీజేపీ లో చేరడం కంటే ముందుగానే ఆయన , అధికార టీఆరెస్ పై వివిధ స్థాయిల్లో ప్రజాసంఘాలను , ఇతర రాజకీయ పక్షాలను కూడగట్టుకుని నిరసన కార్యక్రమాలు చేపట్టారు . అసెంబ్లీ , సచివాలయం కూల్చివేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ , కేంద్ర హోం  మంత్రి అమిత్ షా ను కలిసి , కూల్చివేతను అడ్డుకోవాలని వినతి పత్రాన్ని అందజేశారు . అప్పుడే వివేక్ బీజేపీ లో చేరుతారన్న అంశం పై క్లారిటీ వచ్చినప్పటికీ , వేచి చూసే ధోరణి అవలంభించారు .  దేశవ్యాప్తంగా బీజేపీ పడుతుండడంతో తెలంగాణలో ఆ పార్టీ లోక్ సభ  ఎన్నికల్లో నాలుగు స్థానాలు గెల్చుకోవడంతో ,  బీజేపీలో చేరాలన్న  నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.


 శుక్రవారం  బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా  సమక్షంలో, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ , హోం శాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి , పార్టీ ప్రధాన కార్యదర్శి రాం మాధవ్ వెంట రాగా  వివేక్ బిజెపి కండువా కప్పుకున్నారు.  వివేక్ బిజెపిలో చేరడం ద్వారా ఆ పార్టీకి తెలంగాణలో మీడియా సపోర్ట్ దొరికినట్లైంది.  తెలుగులో ఒక న్యూస్ ఛానల్,  తెలుగు పత్రికలు నడుపుతున్న విషయం తెల్సిందే . 


మరింత సమాచారం తెలుసుకోండి: