ముఖ్యమంత్రిగా ఉన్నపుడే కాదు ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత కూడా చంద్రబాబునాయుడు నోటివెంట వినబడుతున్న ఒకే ఒక్క పదం పులివెందుల పంచాయితి. అసలు చంద్రబాబు చెబుతున్న తరహాలో పంచాయితీలు పులివెందులలో జరుగుతున్నాయో లేదో తెలీదు కానీ రాష్ట్రమంతటా అదే పద్దతిలో పంచాయితీలు జరుగుతున్నట్లు మండిపోతున్నారు. చంద్రబాబు నోటి వెంట ప్రతిరోజు పులివెందుల పంచాయితి అని ఎందుకు వస్తోంది ?

 

ఎందుకంటే చంద్రబాబు మేల్కొన్నా,  నిద్రలో ఉన్నా పులివెందుల అంటేనే భయపడిపోతున్నట్లున్నారు. దివంగత వైఎస్సార్ ఉన్నంత వరకూ నోరెత్తలేక ఇబ్బంది పడిన చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి దెబ్బకు పూర్తిగా  కుదేలయ్యారు. అప్పట్లో వైఎస్సార్ ఇమేజి ముందు చంద్రబాబు ఇమేజి మరుగుజ్జు లాగైపోయింది. అందుకే వైఎస్సార్ ను చంద్రబాబు ఏమి చేయలేకపోయారు.

 

నిజానికి ఫ్యాక్షన్ రాజకీయం ఒక్క కడప జిల్లా పులివెందులలోనే కాదు చాలా ప్రాంతాల్లో ఉండేది. కర్నూలు, అనంతపురం, ప్రకాశం గుంటూరు జిల్లాలోని పల్నాడు ప్రాంతంలో కూడా ఫ్యాక్షనిజం ఉండేది. ఫ్యాక్షనిజంలో ఒక్క వైఎస్సార్ కుటుంబం మాత్రమే కాదు. టిడిపిలోని చాలా మంది నేతలకు ప్రత్యక్ష పాత్ర ఉందన్న విషయం అందరికీ తెలిసిందే. కెఇ కృష్ణమూర్తి, శివారెడ్డి, రామసుబ్బారెడ్డి, జేసి కుటుంబం, కోడెల శివప్రసాదరావు, పరిటాల కుటుంబం, వరదాపురం సూరి, కరణం బలరామ్, గొట్టిపాటి రవి లాంటి చాలామంది టిడిపి నేతలు ఫ్యాక్షన్ రాజకీయాలు నడిపినవారే. అయినా చంద్రబాబుకు మాత్రం ఒక్క పులివెందుల మాత్రమే గుర్తుకొస్తుంటుంది.

 

జగన్ ను నేరుగా ఏమీ చేయలేక సందర్భం వచ్చినా లేకపోయినా పులివెందుల పంచాయితి అనే పదాన్ని పాపులర్ చేశారు. తునిలో రైలు దహనమైనా పులివెందుల గుండాల పనే. రాజధాని ప్రాంత పొలాల్లో పంటలు తగలబడినా పులివెందుల రౌడీల పనే. రాష్ట్రంలో మంచినీళ్ళ కోసం ఆడవాళ్ళ మధ్య గొడవలు జరిగినా చివరకు పులివెందుల పంచాయితీతో ముడిపెట్టే స్ధాయికి చంద్రబాబు దిగజారిపోయారు. కియా కార్ల ఉత్పత్తి ప్లాంటులో  స్ధానికులకే ఉద్యోగవకాశాలు ఇవ్వాలంటూ వైసిపి నేతలు పులివెందుల పంచాయితీలు మొదలుపెట్టారంటూ మండిపోవటం ఏంటో అర్ధం కాకుండా ఉంది.

 


మరింత సమాచారం తెలుసుకోండి: