ఏపీలో తాజా సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో 13 జిల్లాల్లోనూ వైసీపీ ఆధిప‌త్యం స్ప‌ష్టంగా క‌నిపించింది. అనంత‌పురం నుంచి శ్రీకాకుళం వ‌ర‌కు ప్ర‌తి చోటా, ప్ర‌తి న‌గ‌రంలోనూ, ప్ర‌తి జిల్లాలోనూ వైసీపీదే డామినేష‌న్‌. టీడీపీ కంచుకోట‌లుగా అంద‌రూ భావించే కృష్ణా, గుంటూరు జిల్లాల్లోనే ఫ్యాన్ దూసుకుపోయింది. ఒక్క విశాఖ న‌గ‌రంలో మాత్రం వైసీపీకి షాక్ త‌ప్ప‌లేదు. న‌గ‌రంలోని నాలుగు సీట్లలోనూ టీడీపీ అభ్య‌ర్థులు విజ‌యం సాధించారు. చివ‌ర‌కు విశాఖ ఎంపీ సీటును సైతం వైసీపీ స్వ‌ల్ప తేడాతో గెలుచుకున్నా న‌గ‌రంలోని తూర్పు, ప‌శ్చిమం, ద‌క్షిణం, ఉత్త‌రం సీట్ల‌లో టీడీపీ అభ్య‌ర్థులు ఎమ్మెల్యేలుగా విజ‌యం సాధించారు.
ఇక త్వ‌ర‌లోనే గ్రేట‌ర్ విశాఖ ఎన్నిక‌లు కూడా జ‌ర‌గ‌నున్నాయి.

ఈ ఎన్నిక‌ల్లో ఎలాగైనా వైసీపీ జెండా ఎగ‌రాల‌ని పార్టీ జిల్లా నేత‌ల‌కు, న‌గ‌ర నేత‌ల‌కు జ‌గ‌న్ ఇప్ప‌టికే సీరియ‌స్‌గా వార్నింగ్ ఇచ్చేశారు. ఇక న‌గ‌రంలో వైసీపీ గెలిచేందుకే జ‌గ‌న్ ఎన్నిక‌ల్లో ఓడిపోయిన మాజీ ఎమ్మెల్యే ద్రోణంరాజు శ్రీనివాస్‌కు విశాఖ అర్బ‌న్ డెవ‌ల‌ప్‌మెంట్ అథారిటీ చైర్మ‌న్ ప‌ద‌వి కూడా ఇచ్చారు. గ్రేట‌ర్ ఎన్నిక‌ల్లో గెలిచేందుకు ఇత‌ర పార్టీల నుంచి పెద్ద ఎత్తున వలసలు ప్రోత్సహించాలని కూడా డిసైడ్ అయింది. 


ఎన్నిక‌ల్లో ఓట‌మి త‌ర్వాత న‌గ‌ర‌ టీడీపీలో ఇపుడు గ్రూప్ రాజకీయాలు జోరుగా సాగుతున్నాయి. న‌గ‌ర టీడీపీ అధ్య‌క్షుడిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే రెహ్మ‌న్‌కు చాలా మంది నేత‌లు పొగ‌పెట్టే ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ముఖ్యంగా ఎమ్మెల్యేలు వాసుప‌ల్లి గ‌ణేష్‌, వెల‌గ‌పూడి రామ‌కృష్ణ‌బాబు లాంటి వాళ్లు రెహ్మ‌న్‌కు వ్య‌తిరేకంగా గ్రూపులు క‌డుతున్నారు. ఇక మ‌రో ఎమ్మెల్యే గ‌ణ‌బాబు సైలెంట్‌గా ఉన్నా, మాజీ మంత్రి గంటా శ్రీనివాస‌రావు అయితే అస‌లు ఇక్క‌డ పార్టీ ఆఫీస్ గుమ్మం తొక్క‌డ‌మే మానేశారు.


ఇక అటు సొంత పార్టీ నేత‌లే పొమ్మ‌న‌కుండా పొగ పెడుతుండ‌డంతో అదే టైంలో రెహ్మ‌న్‌పై వైసీపీ క‌న్నేసింద‌ట‌. టీడీపీ న‌గ‌ర అధ్య‌క్షుడిగా ఉన్న రెహ్మ‌న్ గ‌త ఎన్నిక‌ల్లో ఎమ్మెల్యే సీటు ఆశించినా చంద్ర‌బాబు ఇవ్వ‌లేదు. ఇప్పుడు అసంతృప్తితో ఉన్న ఆయ‌న‌ మీద వైసీపీ పెద్దల కన్ను పడిందని అంటున్నారు. ఆయన్ని సైకిల్ నుంచి దించేందుకు తెర వెనక కధ జోరుగా సాగుతోందని తెలుస్తోంది.


పార్టీ అధికారంలో ఉన్న‌ప్పుడు ఎలాంటి ప‌ద‌వి ఇవ్వ‌లేదు. ఇప్పుడు ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌ప్పుడు పార్టీ కార్య‌క్ర‌మాల కోసం ఖ‌ర్చంతా త‌న నెత్తిమీద ప‌డేస్తున్నార‌ని కూడా ఆయ‌న ఆగ్ర‌హంతో ఉన్నారు. ఇక జీవీఎంసీ ఎన్నిక‌ల నేప‌థ్యంలో ఆయ‌న పార్టీలోకి వ‌స్తే మైనార్టీ వ‌ర్గాల్లో ప‌ట్టుంద‌ని భావిస్తున్న వైసీపీ నేత‌లు ఆయ‌న‌తో రాయబేరాలు కూడా మొదలుపెట్టారని అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: