పాత కాలంలో నిర్మించిన ఓ కోట ఒకప్పుడు నిజామ్ సామంత రాజులకు ఆయుధగారంగా మారింది. కోటలో చెక్కుచెదరని చరిత్ర గుర్తులు ఇప్పటికీ కనిపిస్తాయి. కానీ ప్రాచీన చరిత్రకు చెదలు పడుతోంది. తెలంగాణలో చెప్పుకోదగ్గ కోటల్లో ఒకటైన కరీంనగర్ జిల్లాలోని మొలంగూర్ ఖిల్లా విశేషాలు అద్భుతం. జిల్లా కేంద్రానికి ముప్పై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న పురాతన ఊరు మొలంగూర్. ఈ ఊరు గుట్ట పై కాకతీయుల నాటి కోట ఉంది. అందుకే దీన్ని 'ఖిల్లా మొలంగూరు' అని కూడా పిలుస్తారు. ఈ ఊరు వరంగల్ జిల్లా కేంద్రానికి నలభై కిలోమీటర్ల దూరంలో ఉంది. కరీంనగర్ జిల్లా కేంద్రానికి దగ్గర ఉన్న ఎలగందులకు, కాకతీయుల కోటకు మధ్యలో ఉంటుంది మొలంగూర్ ఖిల్లా కాకతీయ ప్రభువైన ప్రతాపరుద్రుని అధికారులలో ఒకరైన వరకీరి మొగ్గరాజు ఈ కోటలో ఉండేవాడని చెబుతారు.


ఏ వైపు నుంచి కూడా కోట లోకి ప్రవేశించటానికి వీల్లేకుండా ఈ కోటను నిర్మించారు. రెండు గుట్టల నడుమ తూర్పు పడమరలో రెండు ప్రవేశ ద్వారాలు ఉన్నాయి. కొండపైకి వెళ్లడానికి కొంత దూరం దాకా రాతిమెట్లు ఉన్నా ఎవరూ ఎక్కడానికి వీల్లేకుండా ఉంటుంది. గుట్ట పై ఉన్న ఆంజనేయ స్వామి దర్శనానికి ఒంటరిగా వెళ్లడానికి భయపడి ఇప్పటికీ స్ధానికులు గుంపుగా వెళుతుంటారు. కోటపై భాగంలో చుట్టూ రాతి ప్రాకారం అక్కడక్కడా బురుజులూ, మర ఫిరంగులు ఇప్పటికీ శిథిలావస్థలో ఉన్నాయి. పైభాగంలో ఆంజనేయ స్వామి దేవాలయం, విశాలమైన మైదానం ఉంటుంది. అక్కడి నుంచి కిందకు చూస్తే చుట్టూ పచ్చటి పొలాలు ఆహ్లాదకరమైన వాతావరణం కనువిందు చేస్తూ ఉంటుంది.


రెండు బండరాళ్ల వంపులో సహజసిద్ధంగా ఏర్పడిన కోనేరు ఒకటి ఇక్కడ కనిపిస్తుంది. కోటలోని ప్రజలు సైనికుల నీటి అవసరాల కోసం దీన్ని నిర్మించారని చెబుతారు. మిద్దె మీడుతూ పిలవబడే చెక్కు చెదరని ప్రకారం చక్కటి కమానుతో ఇప్పటికీ శిథిలావస్థలో కనిపిస్తుంది. దీని ముందు భాగంలో ఓ చెద  బావి ఉంది. దీన్ని రాతి కట్టడంతో అలంకరించారు. దీన్ని గాడి చాని అంటారు. ఈ బావిలోని నీరు పాలరంగులో తెల్లగా ఉండటంతో దీనిని స్థానికులు 'దూద్ బావి' అని కూడా పిలుస్తారు. ఈ నీటికి ఆయుర్వేద గుణాలు ఉన్నాయని ప్రజలు నమ్ముతుంటారు.


అందుకే ఇప్పటికీ జనం ఈ నీటిని తీసుకెళ్తున్నారు. అలాగే ఈ నీటిని తాగితే కిడ్నీ జబ్బులు పోతాయని స్థానికులు నమ్ముతారు. చారిత్రక ప్రాధాన్యం ఉన్న మొలంగూర్ కోట ఎవరూ పట్టించుకోక పోవడంతో శిథిలమైపోయింది. కోటపైకి వెళ్లడానికి సరిగా మెట్లు లేకపోవటంతో పర్యాటకులు పైకి వెళ్లలేక మధ్యలోనే దిగి వెళ్ళిపోతున్నారు. మొలంగూర్ కోటను అభివృద్ధి చేసి ప్రజలు టూరిస్టులు వచ్చేలా ఏర్పాట్లు చేయాలని స్థానికులు కోరుతున్నారు. ఈ కోటకు మరింత ప్రాచుర్యం కల్పించేందుకు ఇటీవలే పోలీసులు ట్రెక్కింగ్ నిర్వహించారు. ప్రకృతి అందాల నడుమ ఎత్తైన గుట్ట పై ఉన్న ఈ కోటను మరింత అభివృద్ధి చేస్తే మంచి పర్యాటక ప్రాంతంగా ఎంతో మందికి ఉపాధి కేంద్రంగా మారే అవకాశముంది.


మరింత సమాచారం తెలుసుకోండి: